Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు భారీ రాయితీలపై రుణసదుపాయం కల్పిస్తుంది. ఇందుకోసం రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేస్తుంది. అయితే రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల ప్రక్రియలో సాంకేతి సమస్యలు తలెత్తుతున్నాయి. సర్వర్ లోపాలు, సాంకేతిక ఇబ్బందులతో దరఖాస్తుల ప్రక్రియలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీంతో ఇంటర్నెట్, మీసేవ కేంద్రాల వద్ద దరఖాస్తుదారులు పడిగాపులు కాస్తున్నారు. కొన్నిసార్లు దరఖాస్తు చివరి దశకు వెళ్లిన తర్వాత సర్వర్ లోపాలతో మళ్లీ మొదటికి వస్తున్న దాఖలాలు ఉన్నాయి.
దీంతో దరఖాస్తుదారులు ఇబ్బంది పడుతున్నారు. దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫారం డౌన్‌లోడ్ కావడం లేదని చెబుతున్నారు. తిరిగి మళ్లీ దరఖాస్తు చేస్తే అల్రెడీ అప్లై చేసినట్లు వస్తుందని దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల గడువు ఈ నెల 14తో ముగియనున్న విషయం తెలిసిందే.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం స్కీమ్ అమల్లోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి రూ.4 లక్షల వరకు రాయితీతో కూడిన రుణాలు ఇస్తారు. రుణాలపై 60 నుంచి 80 శాతం వరకు సబ్సిడీ (రుణ వర్గం ఆధారంగా) ఉంటుంది. లక్ష రూపాయల వరకు రుణంలో 80 శాతం సబ్సిడీ ఉంటుంది. మిగిలిన 20 శాతం లబ్దిదారుడు లేదా బ్యాంక్ లింకేజ్ ద్వారా భరించాలి. లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రుణం 70 శాతం సబ్సిడీ ఉంటుంది. రూ.3 లక్షల వరకు రుణం 60 శాతం సబ్సిడీతో ఉంటుంది.
దరఖాస్తుదారుడు తెలంగాణ రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ లేదా మైనారిటీ వర్గానికి చెందిన వారై ఉండాలి. వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇటీవల ఈ నిబంధనను సడలించారు. 35 ఏళ్ల పైబడిన వారికి కూడా అవకాశం ఇచ్చారు. దారిద్య్రరేఖకు దిగువ వర్గంలో ఉండాలి.
సంబంధిత కథనం