Rajanna Sircilla News : రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం, వడదెబ్బతో ఒకరు అంతిమయాత్రలో మరొకరు మృతి
Rajanna Sircilla News : రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. వడదెబ్బతో మృతి చెందిన వ్యక్తి అంతిమ యాత్రలో మరొకరు గుండెపోటుతో మృతి చెందగా, ఇద్దరికి వడదెబ్బ తగిలింది.
Rajanna Sircilla News : రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదంలో విషాదం నెలకొంది. వడదెబ్బతో మృతి చెందిన వ్యక్తి అంతిమయాత్రలో గుండెపోటుతో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. అనూహ్యంగా చోటు చేసుకున్న సంఘటన జిల్లాలో కలకలం రేపుతుంది. ఈ సంఘటన తంగళ్లపల్లి మండలం గోపాల్ రావుపల్లెలో జరిగింది. గ్రామానికి చెందిన ములిగె అంతయ్య(50) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పనికివెళ్లి వడదెబ్బకు గురై మృతి చెందాడు. అంతయ్య అంత్యక్రియలు నిర్వహిస్తుండగా డప్పు కొడుతున్న ఎడ్ల శంకరయ్య(55) గుండెపోటుకు గురై కుప్పకూలి అక్కడికక్కడే మృతిచెందాడు. పక్కనే ఉన్న ఎంపీటీసీ ములిగె దుర్గాప్రసాద్, ములిగె మహేశ్ వడదెబ్బకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వారిని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. మృతుడు ములిగె అంతయ్య(55) కు భార్య లత, కొడుకు రంజిత్, కూతురు ఆకాంక్ష ఉన్నారు. మరో మృతుడు ఎడ్ల శంకరయ్య(55)కు భార్య వసంత, కొడుకులు అనిల్, వెంకటేశ్, కూతురు వందన ఉన్నారు. ఒకరి తరువాత మరొకరు మరణించడంతో గోపాల్రావుపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకరి కోసం మరొకరు అన్నట్లు ఇద్దరు మృతి చెందడం మరో ఇద్దరు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలు కావడం చర్చనీయాంశంగా మారింది.
ఓ వైపు వర్షం...మరో వైపు మండే ఎండలు
ఓ వైపు అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల రెండు రోజుల క్రితం వర్షం కురియగా మరో వైపు ఎండలు సైతం మండిపోతున్నాయి. ఏప్రిల్ మాసంలో రికార్డు స్థాయిలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 39 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. దీంతో పలువురు వడదెబ్బకు గురై ఆసుపత్రి పాలయ్యారు. ఇద్దరు వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో అంతయ్య, పెద్దపల్లి జిల్లా బొంతకుంటపల్లిలో కౌలు రైతు నర్సింగరావు వడదెబ్బకు గురై మృతి చెందారు. రాత్రి పూట వాతావరణం చల్లగా ఉంటున్నప్పటికి పగటి పూట ఉష్ణోగ్రతలు విఫరీతంగా పెరగడంతో భానుడి ప్రతాపానికి జనం విలవిలవాడుతున్నారు. ఉపశమనం కోసం కూల్ ప్రదేశాలను ఆశ్రయించి చల్లని పానీయాలను సేవిస్తున్నారు. ఈనెలాఖరులోగా నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణశాఖ చెబుతుండడంతో అప్పటి వరకు ఎండవేడితో ఉక్కిరి బిక్కిరి కావాల్సిందేనా అని జనం ఆందోళన చెందుతున్నారు.
మళ్లీ ఎండలు
తెలంగాణలో మళ్లీ ఎండల తీవ్రత పెరుగుతుందని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. బుధవారం నుంచి రాష్ట్రంలో ఎండల తీవ్ర ఉంటుందని అంటున్నారు. అధిక వేడి కారణంగా పలు వర్షాలు కురిసినా, మిగిలిన ప్రాంతాల్లో ఎండలు అధికంగా ఉంటాయని తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో 41-42 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
HT తెలుగు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ కె.వి.రెడ్డి
సంబంధిత కథనం