Khaki Kids : ఖాకీ కిడ్స్ కు శ్రీకారం చుట్టిన రాజన్న సిరిసిల్ల పోలీసులు- సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలపై అవగాహన
Khaki Kids : రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు సరికొత్త కార్యకర్యక్రమానికి శ్రీకారం చుట్టారు.సైబర్ నేరాలను అరికట్టేందుకు, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పిల్లల ద్వారా పెద్దలకు అవగాహన కల్పించే ఖాకీ కిడ్స్ కార్యక్రమం చేపట్టారు.
Khaki Kids : వింత వినూత్న కార్యక్రమాలు చేపట్టే రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పిల్లల ద్వారా పెద్దలకు అవగాహన కల్పించే ఖాకీ కిడ్స్ కార్యక్రమం చేపట్టారు. రాబోయే మూడు నెలల్లో జిల్లాలోని అన్ని కళాశాలలు, పాఠాశాలల విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రమాదాలకు గురి కాకుండా ఉండేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు వినూత్నంగా చేపట్టిన ఖాకీ కిడ్స్ కార్యక్రమాన్ని సిరిసిల్లలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎస్పీ అఖిల్ మహాజన్ విద్యార్థులతో కలిసి ప్రారంభించారు. శాంతి భద్రతలకే పరిమితం కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల్ని చైతన్యపర్చడం అభినందనీయమన్నారు ఆది శ్రీనివాస్. పోలీస్ శాఖ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు యువతకు క్రీడా పోటీలు, ఆరోగ్య శిబిరాలు, డ్రైవింగ్ లెసైన్స్, సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.
ప్రస్తుతం సమాజంలో సైబర్ నేరగాళ్లు కొత్తకొత్త మోసలకు పాల్పడుతున్నారని అట్టి మోసాల బారిన ప్రజలు పడకూడదనే ఉద్దేశంతో ప్రతి పోలీస్ స్టేషన్లలో సైబర్ వారియర్ లను ఎంపిక చేసి వారికి సైబర్ నేరాలు జరుగు విధానం, ట్రాఫిక్ నియమలపై శిక్షణ ఇచ్చి జిల్లాలో ఉన్న అన్ని కళాశాల్లో, పాఠశాలల్లో విద్యార్థులకు ఇంటర్నెట్ దుర్వినియోగం, ఆన్‌లైన్ మోసాలు, సైబర్ మోసాల భారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు కల్పిస్తామన్నారు. విద్యార్థులు ఖాకీ కిడ్స్ కార్యక్రమన్ని సద్వినియోగం చేసుకొని తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సైబర్ నేరాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ పై అవగాహన పెంపొందించుకుని తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కోరారు.
బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దడమే ఖాకీ కిడ్స్ లక్ష్యం
సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు నియంత్రించడమే లక్ష్యంగా విద్యార్థి దశ నుంచి పిల్లలకు సైబర్ నేరలు, ట్రాఫిక్ సిగ్నల్స్ పై అవగాహన కల్పించి సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాడమే "ఖాకీ కిడ్స్" లక్ష్యమని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. విద్యార్థులు మంచిని స్వీకరించి చెడుకు దూరంగా ఉండాలన్నారు. తల్లిదండ్రులు, ప్రజలు పిల్లలు చెప్పితే తప్పక పాటిస్తారనే ఉద్దేశంతో ఖాకీ కిడ్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న సైబర్ వారియర్లకు సైబర్ నేరాలు జరుగు విధానం, ఎలా అరికట్టాలి, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. విద్యార్థులు సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని, ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలలో వ్యక్తిగత గోప్యత పాటించాలని కోరారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ఓటిపి ఫ్రాడ్, సోషల్ మీడియాలో వచ్చే ఉద్యోగ ప్రకటనలు,అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే విడియో కాల్స్ కు ఫ్రాడ్, olx ఫ్రాడ్ లాంటి వాటికి దూరంగా ఉండాలన్నారు.
రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం