Police Dog : అనారోగ్యంతో పోలీస్ డాగ్ ట్యాంగో మృతి, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
Police Dog : రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్ లో 8 ఏళ్లుగా విధులు నిర్వహించిన పోలీస్ జాగిలం ట్యాంగో అనారోగ్యంతో మృతి చెందింది. పోలీస్ జాగిలం మృతదేహానికి ఎస్పీ, అదనపు ఎస్పీ, పోలీసు అధికారులు నివాళులర్పించారు.
Police Dog : విశ్వాసం గల శునకం... నిందితులను గుర్తించడంలో దిట్టా... అలాంటి పోలీస్ జాగిలం ట్యాంగో అనారోగ్యంతో మృతి చెందింది. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్ 8 ఏళ్లుగా విధులు నిర్వహించిన జర్మన్ షెఫర్డ్ సంతతికి చెందిన పోలీస్ జాగిలం ట్యాంగో శనివారం మృతి చెందడంతో పోలీసులు దిగ్బ్రాంతికి గురయ్యారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గౌరవ వందనం చేసి అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పోలీస్ జాగిలం హ్యాండ్లర్ లక్ష్మణ్ తో కలిసి ట్యాంగో భౌతికకాయంపై ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్.ఐ లు యాదగిరి, మాధుకర్, రమేష్, రాజా పుష్ప గుచ్చాలు ఉంచి నివాళులర్పించారు.
8 ఏళ్లలో 99 కేసుల్లో నిందితులను గుర్తించిన పోలీస్ డాగ్
అనారోగ్యంతో అకాల మరణం చెందిన పోలీస్ జాగిలం ట్యాంగో గత 8 ఏళ్లుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పని చేసింది. విధి నిర్వహణలో 15 హత్య కేసులు, 84 దొంగతనాల కేసులు మొత్తం 99 కేసులలో నిందితులను గుర్తించిందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. విధి నిర్వహణలో చాకచక్యంగా వ్యవహరించిన ట్యాంగో సేవలు మరువలేమని కొనియాడారు. 2017 సంవత్సరంలో ట్యాంగో తన హ్యాండ్లర్ లక్ష్మణ్ తో పాటుగా ఎనిమిది నెలల పాటు IITA మొయినాబాద్ నందు బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని జిల్లాకు కేటాయించిగా జిల్లాలో 08 సంవత్సరాలుగా సేవలందించిందని తెలిపారు. పోలీస్ మాదిరిగానే పోలీస్ జాగిలం విధి నిర్వహణలో క్రమశిక్షణగా మెలిగిందని అలాంటి జాగిలం అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించిందని పోలీసులు సంతాపం తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేశారు.
5 వేల మొక్కలు నాటిన పోలీసులు
వనమహోత్సవంలో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో హోమ్ గార్డ్ నుంచి జిల్లా అధికారి వరకు ఐదు వేల మొక్కలు నాటారు. ఒకే రోజు జిల్లా వ్యాప్తంగా వనమహోత్సవం చేపట్టి మొక్కలు నాటడం జరుగుతుందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ ఆవరణలో పలు రకాల పండ్ల మొక్కలు 500 నాటారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్ లో సైతం మొక్కలు నాటి ఒక్క రోజే జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఐదువేల మొక్కలు నాటామని ఎస్పీ ప్రకటించారు. మానవాళి మనుగడకు ప్రతి ఒక్కరు విరివిగా మొక్కలు నాటి వాటిని రక్షించే బాధ్యత తీసుకోవాలని కోరారు. కాలుష్య రహిత సమాజం కోసం సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.
రిపోర్టింగ్: కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం