Fake Certificates : సిరిసిల్ల జిల్లాలో నకిలీ సర్టిఫికెట్ల దందా గుట్టురట్టు, కీలక సూత్రదారి రిటైర్డ్ టీచర్
Fake Certificates : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫేక్ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టైంది. ఈ ముఠాలోని ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ సర్టిఫికెట్ల తయారి సూత్రధారి రిటైర్డ్ టీచర్ కావడం విశేషం.
Fake Certificates : రాజన్న సిరిసిల్ల జిల్లాలో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టయింది. ఆరుగురు సభ్యులు గల ముఠాలో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి భారీ మొత్తంలో నకిలీ స్టాంపులు, సర్టిఫికెట్లు, సర్టిఫికెట్ల తయారీకి ఉపయోగించే సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. నకిలీ సర్టిఫికెట్ల తయారి సూత్రధారి రిటైర్డ్ టీచర్ కావడం విశేషం.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల ఫేక్ సర్టిఫికెట్స్ కలకలం సృష్టించాయి. టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టగా ఆరుగురు సభ్యులు గల ముఠా పట్టుబడిందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సిరిసిల్ల గాంధీనగర్ కు చెందిన రిటైర్డ్ టీచర్ సిరిపురం చంద్రమౌళి, ప్రింటింగ్ వర్కర్ పోలు ప్రకాష్, డాక్యుమెంట్ రైటర్ బొడ్డు శివాజీ, అనంతపల్లికి చెందిన రైతు లక్ష్మీనారాయణ, అడ్వకేట్ బిట్ల విష్ణు, శిలం రాజేష్ కలిసి గత కొంత కాలంగా నకిలీ సర్టిఫికెట్ల దందా నడుపుతున్నారు.
నకిలీ స్టాంపులతో ఫేక్ సర్టిఫికెట్స్
రిటైర్డ్ టీచర్ చంద్రమౌళి ఎమ్మార్వో, గ్రామ కార్యదర్శి అసిస్టెంట్ సివిల్ సర్జన్ పేరుతో నకిలీ స్టాంపులు తయారు చేసి ఫోర్జరీ సంతకాలతో సర్టిఫికెట్లు రూపొందించి అక్రమంగా విక్రయించారు. కోర్టులో బెయిల్ కోసం, ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం, స్కూల్ లో ఇచ్చే డే టాప్ బర్త్ సర్టిఫికేట్లను వినియోగించిన ఫేక్ సర్టిఫికేట్స్ తయారు చేశారు. వాటిని ఉపయోగించి బెయిల్ కోసం ఫేక్ సర్టిఫికెట్స్ వినియోగించారని ఎస్పీ తెలిపారు. ఇటీవల నకిలీ సూరిటీ సర్టిఫికెట్ పెట్టుకొని రిమాండ్ అయిన కేసులో బెయిల్ వచ్చేలా చేయగా దానిపై విచారణ చేయగా ఫేక్ సర్టిఫికెట్ ముఠా గుట్టు రట్ఠయిందన్నారు. పట్టుబడ్డ వారి నుంచి రకాల నకిలీ డాక్యుమెంట్లు, ఆరు స్టాంప్ లు, సెల్ ఫోన్లు, డాక్యుమెంట్లు తయారీ చేసే సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ చెప్పారు.
కస్టడీకి తీసుకుని ఎన్ని విక్రయించారో తేలుస్తాం
ప్రస్తుతం ఐదుగురు అరెస్టు కాగ ఒక్కరు రాజేష్ పరారీలో ఉన్నాడని ఎస్పీ తెలిపారు అతన్ని త్వరలోనే పట్టుకొని ఆరుగురుని కోర్టు అనుమతితో కస్టడిలోకి తీసుకొని నకిలీ సర్టిఫికెట్లు తయారుచేసి ఎంతమందికి విక్రయించారో తెలుస్తామని ఎస్పీ అఖిల్ మహజన్ తెలిపారు. ప్రస్తుతం కోర్టు బెయిల్ పిటీషన్ కోసం, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం ఫేక్ సర్టిఫికెట్స్ వినియోగించినట్లు తేలిందని సర్టిఫికెట్లు పొందిన వారిపై సైతం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఫేక్ సర్టిఫికెట్ల ముఠాను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ సి.ఐ సదన్ కుమార్,టాస్క్ఫోర్స్ సిబ్బంది ఎస్పీ అభినందించారు.
రిపోర్టింగ్ : కేవీ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం