Constable Saves Woman Life : కానిస్టేబుల్ సమయస్ఫూర్తి, సీపీఆర్ చేసి మహిళ ప్రాణాలు కాపాడిన వైనం
Constable Saves Woman Life : గుండె పోటుకు గురైన మహిళలకు సీపీఆర్ చేసి, ఆమె ప్రాణాలు రక్షించారు కానిస్టేబుల్. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల గాంధీ నగర్ కు చెందిన చిలగాని అనూహ్య అనే మహిళా గుండెపోటుకు గురయ్యారు. తండ్రి శంకర్ మరణ వార్త విని కుప్పకూలిపోయారు. ఇంట్లో నుంచి కేకలు వినబడడంతో ఆ పక్కనే ఉన్న తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే కానిస్టేబుల్ శ్రీనివాస్ వెంటనే స్పందించి ఇంట్లోకి పరిగెత్తారు. గుండెపోటుకు గురైన మహిళకు సీపీఆర్ చేశారు. ఏం జరిగిందోనని ఇంట్లో వాళ్లు గమనించేలోపే కానిస్టేబుల్ శ్రీనివాస్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే స్పందించారు. ఆమెకు గుండెపోటు వచ్చినట్టు గుర్తించి వెంటనే సీపీఆర్ చేశారు. అనంతరం సమీపంలోని ఆస్పత్రికి తన సొంత వాహనంలో తరలించారు. ప్రస్తుతం మహిళా కోలుకుంది. కానిస్టేబుల్ సమయ స్ఫూర్తితో స్పందించి సీపీఆర్ చేయడంతోనే మహిళ ప్రాణాలతో బయటపడిందని స్థానికులు కానిస్టేబుల్ ను అభినందించారు.
కానిస్టేబుల్ ను అభినందించిన ఎస్పీ
సీపీఆర్ చేసి మహిళా ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్ శ్రీనివాస్ ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు. కానిస్టేబుల్ చాకచక్యంగా వ్యవహరించడంతోనే మహిళా ప్రాణాలతో బయట పడిందన్నారు. కానిస్టేబుల్ శ్రీనివాస్ ను పలువురు నెటిజన్ల సైతం అభినందించారు. గుండెపోటుకు గురైన వారికి తక్షణం సాయపడేలా పోలీసులకు ఉన్నతాధికారులు ఇప్పించిన సీపీఆర్ శిక్షణ నిండు ప్రాణాన్ని నిలబెట్టేలా ఉపయోగపడిందని కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు.
HT తెలుగు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ కె.వి.రెడ్డి