Rajanna Sircilla Crime : మద్యం మత్తులో భార్యతో గొడవ, కోపంతో ఇంటికి నిప్పు పెట్టిన భర్త-rajanna sircilla crime man put fire to house after quarrel with wife in drunken stage ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rajanna Sircilla Crime : మద్యం మత్తులో భార్యతో గొడవ, కోపంతో ఇంటికి నిప్పు పెట్టిన భర్త

Rajanna Sircilla Crime : మద్యం మత్తులో భార్యతో గొడవ, కోపంతో ఇంటికి నిప్పు పెట్టిన భర్త

HT Telugu Desk HT Telugu
Published Jun 09, 2024 05:02 PM IST

Rajanna Sircilla Crime : రాజన్న సిరిసిల్లలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో భార్యతో గొడవ పడి ఇంటికి నిప్పుపెట్టాడో ఓ వ్యక్తి. మంటలు దాటికి ఇల్లు కూలిపోయి కట్టుబట్టలతో మిగిలారు.

మద్యం మత్తులో భార్యతో గొడవ, కోపంతో ఇంటికి నిప్పు పెట్టిన భర్త
మద్యం మత్తులో భార్యతో గొడవ, కోపంతో ఇంటికి నిప్పు పెట్టిన భర్త

Rajanna Sircilla Crime : వెనుకటికి ఒకరు అత్త మీద కోపాన బిడ్డను కుంపట్లో వేసిందట? అచ్చం అలానే ఉంది రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఘటన. భార్య భర్తలు గొడవపడి ఇంటికి నిప్పు పెట్టడంతో ఇల్లు కాలి బూడిద అయింది. వృద్ధ దంపతులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. తంగళ్లపల్లి మండలం పద్మనగర్ లో ముడారి బాలపోశయ్య రాజేశ్వరీ వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. మత్స్యకారుడైన బాల పోచయ్య చేపలు పట్టగా ఇంటివద్ద రాజేశ్వరీ చేపలను ఫ్రై చేసి అమ్ముతూ జీవనోపాధి పొందుతున్నారు. మృగశిరకార్తె కావడంతో చేపలకు భలే గిరాకీ ఉండగా భర్త పోచయ్య ఉదయం బయటకు వెళ్లి మద్యం సేవించి సాయంత్రం ఇంటి కొచ్చాడు. ఈ క్రమంలో చేపలు పట్టేందుకు వెళ్లకుండా మద్యం తాగివస్తావా అని భార్య మందలించింది. దీంతో భార్యభర్తల మద్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన బాలపోశయ్య మద్యం మత్తులో ఇంటిలో కిరోసిన్ చల్లి నిప్పంటించాడు. గమనించిన భార్య రాజేశ్వరీ ప్రాణభయంతో బయటకు పరుగెత్తింది. మంటలకు తాలలేక బాలపోశయ్య కూడా బయటకు పరుగులు తీశాడు. స్థానికుల వెంటనే అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇవ్వగా అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పే లోగా ఇల్లు దగ్దం కావడంతోపాటు పక్కింటికి మంటలు అంటుకున్నాయి. బయట నిలిపిన ద్విచక్రవాహనానికి మంటలు వ్యాపించడంతో కాలిపోయింది. మంటల వేడికి పెంకుటిల్లు కాలి, కూలిపోయింది.

క్షణికావేశంతో కట్టుబట్టలతో మిగిలిన దంపతులు

క్షణికావేశంతో ఇంటికి నిప్పు పెట్టడంతో ఇల్లు కాలిపోయి భార్యాభర్తలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. మద్యం మత్తే భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టి ఇంటికి నిప్పు పెట్టి నివాసాన్ని దగ్ధం చేసే దుస్థితికి తీసుకువచ్చిందని స్థానికులు అభిప్రాయపడ్డారు. కోపంతో ఇల్లును కాలబెట్టుకుని రోడ్డునపడ్డ వృద్ధ దంపతులను చూసిన వారు దూషిస్తూ, మరోవైపు అయ్యే పాపం అంటూ నిత్యవసర సరుకులు దుస్తులు సమకూర్చారు. ఇల్లు దగ్ధంపై తంగళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

HT Telugu ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ కె.వి.రెడ్డి

Whats_app_banner