వివాహేతర సంబంధం రేపిన కలకలం.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితకబాదిన బంధువులు-rajanna sircilla brs leader extramarital relationship caught red handedly ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  వివాహేతర సంబంధం రేపిన కలకలం.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితకబాదిన బంధువులు

వివాహేతర సంబంధం రేపిన కలకలం.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితకబాదిన బంధువులు

HT Telugu Desk HT Telugu
Aug 18, 2024 01:22 PM IST

వివాహేతర సంబంధం కారణంగా రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కట్టుకున్న వారిని కడుపున పుట్టిన పిల్లల భవిష్యత్తును విస్మరించి వివాహేతర సంబంధం పెట్టుకోవడం, బంధువులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని దాడిచేయడంతో కలకలం రేగింది.

వివాహేతర బంధంతో రోడ్డున పడ్డ కుటుంబాలు (ప్రతీకాత్మక చిత్రం)
వివాహేతర బంధంతో రోడ్డున పడ్డ కుటుంబాలు (ప్రతీకాత్మక చిత్రం)

ఔను, వాళ్లిద్దరికీ పెళ్ళైంది.‌ ఇద్దరికీ పిల్లలు ఉన్నారు. కానీ వారి భవిష్యత్తును విస్మరించి దారితప్పారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్న కుటుంబసభ్యులు వీరిద్దరినీ చితకబాదారు. బీఆర్ఎస్ నాయకుడిగా చలామణి అవుతూ పరువు పోయే పనిచేసిన ఆ వ్యక్తికి బంధువులు దేహశుద్ధి చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నారు. అయితే ఇదే మండలానికి చెందిన వివాహితతో వివాహేతర సంబంధం సాగించాడు. ఆ మహిళకు సైతం భర్త, పిల్లలు ఉన్నారు.‌ సదరు యువకుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుచరుడుగా చలామణి అవుతున్నారు. కాగా ఈ ప్రేమాయణం కొనసాగించేందుకు వీరిద్దరూ విడిగా ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నట్టు సమాచారం.

వివాహితకు చెందిన కుటుంబ సభ్యులు వీరి వ్యవహారంపై అనుమానంతో ఈ ఇద్దరి కోసం ఆరా తీయగా సికింద్రాబాద్‌లోని ఆల్వాల్‌లో ఉంటున్నట్లు గుర్తించారు. ఇద్దరు ఉన్నచోటుకు చేరుకొని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదారు. ఇద్దరిని గంభీరావుపేటకు తరలించారు. యువకుడి భార్య ఆగ్రహావేశాలతో సదరు మహిళను చెప్పుతో చితక్కొట్టారు. భర్త రెండు చేతులు జోడించి దండం పెట్టగా చేసిన తప్పంతా చేసి... అంటూ నిలదీసి చెంప చెల్లుమనిపించారు. అటు సదరు మహిళ కుటుంబ సభ్యులు సైతం కోపంతో ఊగిపోతూ పచ్చని సంసారంలో చిచ్చు పెట్టాడని యువకుడిపై దాడి చేశారు.

మందలింపు

దారి తప్పిన ఇద్దరిని చితక్కొట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మహిళ బంధువులు యువకుడి పై దాడి చేస్తుంటే దారి తప్పిన భర్తకు భార్య బాసటగా నిలువడం కొసమెరుపు. పరువు పోయిందని భావించిన నాయకులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు‌. పెద్ద మనుషుల సమక్షంలో దారి తప్పిన ఇద్దరిని మందలించి తగిన గుణపాఠం చెప్పారు. వివాహ బంధం వివాదాస్పదంగా మారకుండా ఇరువురి కుటుంబ సభ్యులను సముదాయించారు. ఒకరి జోలికి మరొకరు వెళ్లకుండా వివాహ బంధం కలకాలం నిలిచేలా బుద్ధి చెప్పారు. కాగా వివాహేతర సంబంధం దాడిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు స్పష్టం చేశారు.

రిపోర్టింగ్: కేవీ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు