తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణితో పాటు ఆవర్తన ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. మరోవైపు బంగాళాఖాతంలో రేపు(మే 22) అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కూడా అంచనా వేసింది.
ఐఎండీ అంచనాల మేరకు అల్పపీడనం ఏర్పడితే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ్టి నుంచి పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ లో వివరాలను పేర్కొంది.
ఇవాళ(మే 21) నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఇక భూపాలపల్లి, మలుగు, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్నిచోట్ల 40- 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
రేపు(మే 22) కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్. వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలచోట్ల 40- 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఇవాళ ఉదయం నుంచే రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో వాతావరణం పూర్తిగా చల్లబడింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచే వర్షం కురుస్తోంది. సంతోష్‌నగర్, చాదర్‌ఘాట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎల్బీ నగర్, హయత్ నగర్, దిల్‌సుఖ్‌నగర్, సరూర్‌నగర్, కొత్తపేట, తిరుమలగిరి, బేగంపేట, సికింద్రాబాద్, బోయిన్ పల్లి, అల్వాల్‌తో పాటు శివారు ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. దీంతో పలుచోట్ల రహదారులపై నీరు నిలిచింది. వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లో మాత్రమే కాకుండా పలు జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి.
హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరో మూడు రోజులు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలని అన్నారు.
హైదరాబాద్ సిటీలో వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలని…. ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్ విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ ను ఆదేశించారు.
సంబంధిత కథనం