AP TS Weather updates: తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు-rains in many parts of telugu states farmers are in trouble due to rains ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Rains In Many Parts Of Telugu States, Farmers Are In Trouble Due To Rains

AP TS Weather updates: తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు

HT Telugu Desk HT Telugu
May 30, 2023 09:20 AM IST

AP TS Weather updates: ఆంధ్రా, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మాదిరి వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో వాతావరంలో మార్పు వచ్చింది. మరో మూడు రోజులు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

AP TS Weather updates: తెలంగాణలో పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌‌‌‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మూడు రోజులకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ, గాలులు ఉండవని తెలిపింది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

తెలంగాణలో సోమవారం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడ్డాయి. చాలా ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, హనుమకొండ, మహబూబ్‌‌‌‌నగర్, ఖమ్మం, రామగుండం, నల్గొండ, నిజామాబాద్‌‌‌‌ సహా పలు ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి హనుమకొండ జిల్లా పరకాలలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురుస్తోంది. వరంగల్‌ జిల్లా నర్సంపేటలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం, ఇల్లందు మండలంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షంతో పలుచోట్ల రోడ్లు జలమయమయ్యాయి. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది.

మరో మూడు రోజులు వర్షాలు

రోహిణి కార్తె కావడంతో పలు ప్రాంతాల్లో ఎండ, వడగాల్పుల తీవ్రత ఉన్నా ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతున్నదని, దీంతో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు భద్రాద్రి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో అక్కడక్కడ వడగండ్లు కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. బుధవారం నుంచి శనివారం వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది.

ఏపీలో వడగాల్పులు…

ఏపీలో ఉక్కపోత, వడగాలులు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. మంగళవారం మన్యం జిల్లా కొమరాడ లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 18 మండలాల్లో వడగాల్పులు వీచాయి.

నెల్లూరు జిల్లా వెంకటాచలంలో 45°C, తిరుపతి బలయపల్లిలో 44.8°C, ఏలూరు జిల్లా దెందులూరు, కర్నూలు జిల్లా మంత్రాలయం, ప్రకాశం జిల్లా బెస్తువారిపేట మండలంలో 44.4°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనవి.

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రేపు శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు పడే అవకాశం ఉంది. ఈదురు గాలులు, పిడుగుపాటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

IPL_Entry_Point