ద్రోణి, ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్..! మరో 4 రోజులు వర్షాలు, తెలంగాణలోని ఈ జిల్లాలకు హెచ్చరికలు-rain likely for another 4 days in telangana imd weather updates here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ద్రోణి, ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్..! మరో 4 రోజులు వర్షాలు, తెలంగాణలోని ఈ జిల్లాలకు హెచ్చరికలు

ద్రోణి, ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్..! మరో 4 రోజులు వర్షాలు, తెలంగాణలోని ఈ జిల్లాలకు హెచ్చరికలు

ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక ఏపీలోనూ కొన్ని ప్రాంతాలకు వర్ష సూచన ఉండగా… మరికొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఉండే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు...! (unsplash)

మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా తెలంగాణ వరకు ద్రోణి కొనసాగుతున్నట్లు ఐఎండీ తెలిపింది. సగటు సముద్రమట్టానికి 0.9 కిమీ ఎత్తులో ఉన్నట్లు తెలిపింది. ఉత్తర తమిళనాడు నుంచి దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు కర్ణాటక మీదుగా మరో ద్రోణి కూడా కొనసాగుతోంది. ఇవే కాకుండా... వాయువ్య బంగాళాఖాతం దానిని అనుకుని ఉన్న ఉత్తర తీర ఒడిశా, దక్షిణ గంగా తీర పశ్చిమ బెంగాల్ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో వర్షాలు కురవనున్నాయి.

ఎల్లో హెచ్చరికలు జారీ…

ఇవాళ తెలంగాణలోని కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

మరోవైపు రేపు, ఎల్లుండి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. చాలా జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది. జూన్ 14వ తేదీ నుంచి తేలికపాటి వర్షాలు పడొచ్చని తెలిపింది. ఇక ఇవాళ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది.

ఏపీలో భిన్న వాతావరణం:

ఏపీలో భిన్న వాతావరణం నెలకొంది. ఇవాళ విజయనగరం,మన్యం, అల్లూరి,కాకినాడ,కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు,బాపట్ల,పల్నాడు,ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉక్కపోత ఉండే అవకాశం ఉంది. గరిష్టంగా41- 42.5°C వరకు ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉంది. రేపు గరిష్టంగా40- 41°C ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

మరోవైపు అల్లూరి, అన్నమయ్య, చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమవారం తూర్పుగోదావరి జిల్లా రంగంపేట,మన్యం జిల్లా గంగన్నదొరవలస, కృష్ణా జిల్లా పెనుమల్లి, ప్రకాశం జిల్లా మాలెపాడులో 40.9°C నమోదైంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం