Telangana Rains : బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం..! వరంగల్ లో దంచికొట్టిన వాన, ఈ జిల్లాలకు హెచ్చరికలు-rain lashes in many parts of hyderabad and warangal city weather updates check here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Rains : బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం..! వరంగల్ లో దంచికొట్టిన వాన, ఈ జిల్లాలకు హెచ్చరికలు

Telangana Rains : బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం..! వరంగల్ లో దంచికొట్టిన వాన, ఈ జిల్లాలకు హెచ్చరికలు

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. బుధవారం మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్, వరంగల్ నగరంలో చాలా సేపు వర్షం కురిసింది. అకాల వర్షానికి ఏనుమాముల మార్కెట్‌లో పత్తి తడిచిపోయింది.

హైదరాబాద్, వరంగల్ లో వర్షం (image source unsplash.com)

నైరుతి బంగాళాఖాతంలో మరియు దక్షిణ ఏపీ తీరంలో మరో ఉపరితల ఆవర్తం ఏర్పడినట్లు ఐఎండీ తెలిపింది. ఇది సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీటర్ల నుంచి 3.1 కిమీ మధ్య విస్తరించి ఉన్నట్లు తెలిపింది. దక్షిణ ఛత్తీస్ ఘట్ మరియు దానిని అనుకుని ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని... ఇది దక్షిణ దిశగా వంగి ఉందని వివరించింది. ఇది ఇవాళ్టికి బలహీనపడుతుందని అంచనా వేసింది.

వరంగల్ లో భారీ వర్షం…

ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో ఇవాళ వాతావరణం మారిపోయింది. బుధవారం మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్, వరంగల్ నగరంతో పాటు పలు జిల్లాల్లో వర్షం కురిసింది. వరంగల్ సిటీతో పాటు రూరల్ ఏరియాలో గంటకు పైగా వర్షం దంచికొట్టింది. ఈ అకాల వర్షం దాటికి ఏనుమాముల మార్కెట్‌లో పత్తి భారీ స్థాయిలో తడిచిపోయింది. పత్తిలో తేమ శాతం ఉంటే ప్రభుత్వం కొనుగోలు చేయదని రైతన్నలు వాపోయారు. అకాల వర్షం దాటికి తమ కష్టం నీళ్లపాలు అయ్యిందని బాధపడుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు…

ఇవాళ తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

నవంబర్ 6వ తేదీ వరకు తెలంగాణ ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

ఏపీలోనూ వర్షాలు:

మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో చూస్తే ఇవాళ మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,ఏలూరు,కృష్ణా,ఎన్టీఆర్,గుంటూరు, బాపట్ల,పల్నాడు,ప్రకాశం,నెల్లూరు,అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రేపు, ఎల్లుండి కూడా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని వాతావరణశాఖ అంచనా వేసింది.

రేపు(అక్టోబర్ 31) అల్లూరి, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు,నంద్యాల,అనంతపురం,శ్రీసత్యసాయి, వైఎస్ఆర్,అన్నమయ్య,చిత్తూరు,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తాజా బులెటిన్ లో పేర్కొంది.