హైదరాబాద్ లో మళ్లీ వర్షాలు షురూ అయ్యాయి. ఇవాళ ఉదయం నుంచే పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎస్‌ఆర్‌నగర్, ఫిల్మ్ నగర్, ఖైరతాబాద్, అమీర్‌పేట,లక్డీకపూల్, నాంపల్లి, కోఠి, సుల్తాన్‌బజార్ తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది.
హిమాయత్‌నగర్, నారాయణగూడ, లోయర్ ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, కుత్బుల్లాపూర్ తో పాటు శివారు ప్రాంతాల్లో కూడా వర్షం పడుతోంది. కొన్నిచోట్ల భారీ వర్షం పడుతుండటంతో… రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
వచ్చే 2 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడొచ్చని అంచనా వేసింది. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది.
నగరంలోని పటాన్ చెరు, ఆర్సీపురం, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్ పల్లి, గాజులరామారం, నిజాంపేట్, ఖుత్బుల్లాపూర్, జీడిమెట్ల, సుచిత్ర, అల్వాల్,మల్కాజ్ గిరి, కాప్రా, బొల్లారం ప్రాంతాల్లో వచ్చే 2 గంటల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ పేర్కొన్నాడు.
మరోవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సంగారెడ్డి, వికారాబాద్, సిద్ధిపేట,మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా వర్షం పడుతుండటంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.
రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. మరో నాలుగైదు రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటన ద్వారా తెలిపింది.
మరోవైపు హైదరాబాద్ లోని జంట జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో ముందుగానే అప్రమత్తమైన జలమండలి అధికారులు.. జంట జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ సూచించారు.జంట జలాశాయల నుంచి నీటిని విడుదల చేస్తుండటంతో… మరోసారి మూసీ పరివాహక ప్రాంతాలకు అధికారులు హెచ్చరికలను జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
సంబంధిత కథనం