Warangal Rains : ధ్వంసమైన రైల్వే ట్రాక్.. తప్పిన పెనుప్రమాదం! నిలిచిపోయిన పలు రైళ్లు
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. చెరువు కట్ట తెగడంతో మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. దీంతో పలు రైళ్లు నిలిచిపోయాయి.
తెలంగాణలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పరిధిలోని తాల్లపూసలపల్లి శివారు రైల్వే స్టేషన్ వద్ద పెనుప్రమాదం తప్పింది. స్టేషన్ సమీపంలో వర్షానికి రైల్వే ట్రాక్ ధ్వంసమైంది.
భారీ వర్షాల దాటికి సమీపంలో ఉన్న అయోధ్య చెరువు కట్టు తెగటంతో ఈ ఘటన జరిగింది, ఎగువు, దిగువ రైలు మార్గాల్లో కంకర కొట్టుకుపోయింది. రైలు పట్టాలపై భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. అప్రమత్తమైన రైల్వే అధికారులు.. మహబూబాబాద్ లోనే మచిలీపట్నం ఎక్స్ ప్రెస్ తో పాటు పలు రైళ్లను నిలిపివేశారు. ట్రాక్ మరమ్మతు పనులు చేపట్టారు.
మరోవైపు విజయవాడ-వరంగల్ మధ్యలో పలుచోట్ల రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దారి మళ్లింపు కోసం అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లను కూడా రద్దు చేశారు.
ఉమ్మడి వరంగల్ లో జోరు వాన
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా ఇదే పరిస్థితి ఉంది. దీంతో వాగులు, వంకలు ఉప్పొంగాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇండ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందిపడ్డారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సు మళ్లీ మత్తడి పోస్తోంది. ఇక పలు గ్రామాల్లో ఇళ్లు కూలిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టరేట్లు, మండలస్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. రెడ్ అలర్ట్ జారీ అయిన జారీ అయిన జిల్లాలో మహబూబాబాద్ కూడా ఉంది.
భారీ వర్షాల దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క సూచించారు. అత్యవసరం ఉంటే తప్ప ప్రజలు బయటకు రావొద్దని కోరారు. ఐటిడిఏ ఏటూరునాగారంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 6309842395. 08717-293246 లేదా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన 1800 425 7109 నెంబరును సంప్రదించాలని కోరారు.
ఇవాళ భారీ వర్షాలు…! ఈ జిల్లాలకు హెచ్చరికలు
- ఇవాళ(సెప్టెంబర్ 1) తెలంగాణలో చూస్తే... ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది.
- ఇక ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.
- సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.