South Central Railway : తెలంగాణ, ఏపీ మధ్య మరో కొత్త రైల్వే లైన్.. హైదరాబాద్- విశాఖ మధ్య 150 కి.మీ తగ్గనున్న దూరం
South Central Railway : కొత్తగూడెం- కొవ్వూరు రైల్వేలైన్ నిర్మాణం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నిర్మాణానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఈ లైన్ నిర్మాణం పూర్తయితే.. హైదరాబాద్- విశాఖ మధ్య 150 కి.మీ దూరం తగ్గనుంది. దీనికి సంబంధించిన కీలక విషయాలు ఇలా ఉన్నాయి.
కొత్తగూడెం- కొవ్వూరు రైల్వేలైన్.. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అంశం. తాజాగా.. ఈ రైల్వేలైన్ నిర్మాణానికి రైల్వే శాఖ సుముఖత వ్యక్తం చేసింది. 1964లో ఈ లైన్ నిర్మాణానికి బీజం పడింది. కానీ.. ఇప్పటివరకు ప్రకటనలకే పరిమితమైంది. తెలంగాణ ఎంపీలు పార్లమెంట్‌లో ప్రస్తావించినప్పుడు మాత్రమే కదలిక వచ్చింది. ఆ తర్వాత అధికారులు సర్వేలతోనే సరిపెట్టేవారు.
ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఈ లైన్ గురించి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టత ఇచ్చారు. రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. రూ.2,115 కోట్లతో ఈ ప్రాజెక్టును 2030 నాటికి పూర్తిచేస్తామని సమాధానమిచ్చారు. దీంతో మళ్లీ ఆశలు చిగురించాయి. అయితే.. ఈసారి అయినా పనులు మొదలు పెడతారా అనే అనుమానాలు ఉన్నాయి.
నేపథ్యం ఇదీ..
కొత్తగూడెం -కొవ్వూరు రైల్వేలైన్ నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా.. 1984లో కొవ్వూరు రైల్వేలైన్ సాధన కమిటీ ఏర్పాటైంది. పాండురంగాచార్యులు అధ్యక్షతన ఏర్పడిన ఈ కమిటీ ఆధ్వర్యంలో.. నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చంద్రుగొండ, అశ్వారావుపేట, సత్తుపల్లి, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు ప్రాంతాలకు ఈ కమిటీని విస్తరించారు. 2014 జనవరిలో నుంచి 22 రోజుల పాటు కొత్తగూడెం నుంచి కొవ్వూరు వరకు పాదయాత్ర నిర్వహించారు.
తగ్గనున్న దూరం..
కొత్తగూడెం- కొవ్వూరు రైల్వేలైన్ పూర్తయితే.. హైదరాబాద్- విశాఖ మధ్య 150కి.మీ. దూరం తగ్గుతుంది. 2.30 గంటల సమయం ఆదా అవుతుంది. ప్రస్తుతం హైదారాబాద్ నుంచి విశాఖకు విజయవాడ మీదుగా వెళ్తే 800కి.మీ. ప్రయాణించాలి. అదే కొత్తగూడెం- కొవ్వూరు లైన్ పూర్తయితే హైదరాబాద్ నుంచి విశాఖకు వయా కొత్తగూడెం అందుబాటులోకి వస్తుంది. 650 కి.మీ. ప్రయాణంతో విశాఖపట్నం చేరుకోవచ్చు.
సింగరేణి సంస్థ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇప్పటికే కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు 56.25కి.మీ. రైల్వేలైన్ పూర్తయ్యింది. సత్తుపల్లి నుంచి కొవ్వూరు వరకు మరో 95కి.మీ. లైన్ నిర్మిస్తే సరిపోతుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వేలైన్ కోసం నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించటంతో.. ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి.