Bharat Jodo Yatra in Telangana: 24న తెలంగాణలోకి భారత్ జోడో యాత్ర..-rahul gandhi bharat jodo yatra route map in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Rahul Gandhi Bharat Jodo Yatra Route Map In Telangana

Bharat Jodo Yatra in Telangana: 24న తెలంగాణలోకి భారత్ జోడో యాత్ర..

HT Telugu Desk HT Telugu
Oct 01, 2022 02:27 PM IST

Bharat jodo yatra in Telangana: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి త్వరలో రానుంది. దేశవ్యాప్తంగా తలపెట్టిన ఈ పాదయాత్రలో భాగంగా తెలంగాణలోని పలు ప్రాంతాల మీదుగా కొనసాగనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది.

రాహుల్ జోడో యాత్ర
రాహుల్ జోడో యాత్ర (twitter)

Bharat Jodo Yatra in Telangana: కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చే లక్ష్యంతో రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ప్రసుత్తం కర్ణాటకలో కొనసాగుతోంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు సాగే యాత్ర తెలంగాణలోని పలు ప్రాంతాల మీదుగా కొనసాగనుంది. పాదయాత్ర రూట్‌మ్యాప్‌ దాదాపు ఖరారైంది. అక్టోబర్ 24వ తేదీన తెలంగాణలోకి జోడో యాత్ర ఎంట్రీ కానుందని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో అగ్రనేతకు స్వాగతం పలికేందుకు రాష్ట్ర నాయకత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

అధ్యాత్మిక ప్రాంతాలకు రాహుల్...!

ఇక తెలంగాణలో సాగే యాత్రలో భాగంగా.. పలు అధ్యాత్మిక ప్రాంతాలను రాహుల్ సందర్శించేలా కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఫలితంగా ప్రముఖ దేవాల‌యాలు, చ‌ర్చిలు, మ‌సీదుల‌ను రాహుల్ గాంధీ సంద‌ర్శించ‌నున్నారు. మ‌త సామ‌ర‌స్యానికి ప్ర‌తీక‌గా ఈ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకోవాల‌ని కాంగ్రెస్ భావిస్తున్న‌ది. ఈ చ‌ర్య‌ల్లో భాగంగా హైద‌రాబాద్ న‌గ‌ర శివారులో ఉన్న చిలుకూరి బాలాజీ దేవాల‌యాన్ని ద‌ర్శించుకొని స్వామి ఆశీస్సులు రాహుల్‌ పొంద‌నున్నారు. అటు త‌ర్వాత ఆసియా ఖండంలోనే అతి పెద్ద‌ మెద‌క్ చ‌ర్చికి వెళ్తారు. హైద‌రాబాద్ న‌గ‌రానికి 44 కిలోమీట‌ర్ల ప‌రిధిలో ఉన్న జ‌హంగీర్ ద‌ర్గాను కూడా సంద‌ర్శిస్తార‌ని భార‌త్ జోడో యాత్ర వ‌ర్గాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. వీటిని సంద‌ర్శించ‌డం ద్వారా బీజేపీ దేశంలో చేస్తున్న మ‌త విభ‌జ‌న రాజ‌కీయాల‌కు గట్టి సమాధానం ఇచ్చిన‌ట్టువుతుంద‌ని కాంగ్రెస్ అంచ‌నాలు వేసుకుంటుంది.

Bharat Jodo Yatra in Telangana: ఇప్పటివరకు ఖరారైన యాత్ర షెడ్యూల్ ప్రకారం... అక్టోబర్‌ 24న రాహుల్‌ కర్ణా టకలోని రాయచూర్‌ నియో జకవర్గం నుంచి తెలంగాణలోని మక్తల్‌ నియోజక వర్గంలోకి ప్రవేశిస్తారు. మక్తల్‌ నియోజక వర్గంలోని కృష్ణ మండలం గుడ వల్లూరు గ్రామం వద్ద ఆయన రాష్ట్రంలోకి వస్తారు. అక్కడి నుంచి దేవరక్రద, మహబూబ్‌ నగర్, జడ్చర్ల, షాద్‌ నగర్, శంషాబాద్, ముత్తంగి, సంగారెడ్డి,జోగి పేట, శంకరంపేట, మద్నూరుల మీదుగా మహా రాష్ట్రలోని నాందేడ్‌కు వెళ్తారు. మొత్తం మీద 15 రోజుల పాటు 366 కిలోమీటర్ల మేర రాహుల్ యాత్ర కొనసాగనుంది. 4 పార్లమెంట్ నియోజకవర్గాలను కవర్ చేస్తారని రాష్ట్ర నేతలు చెబుతున్నారు. రాహుల్ యాత్రను విజయంతం చేసే దిశగా రాష్ట్ర నేతలు కూడా కార్యాచరణను రూపొందిస్తున్నారు. అయితే అక్టోబర్ 4న అధిష్టానం తుది రూట్ మ్యాప్‌ను ఖరారు చేస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి..

ఇప్పటికే యాత్ర సాగే ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లపై దృష్టిపెట్టారు. రాహుల్ ను యాత్ర ద్వారా సరికొత్త జోష్ ను నింపాలని చూస్తోంది. తద్వారా అధికార టీఆర్ఎస్ తో పాటు బీజేపీకి సవాల్ విసిరాలని భావిస్తోంది.

IPL_Entry_Point