Warangal SR University : ఎస్ఆర్ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం - సీనియర్లపై ఫిర్యాదు, కేసు నమోదు
Warangal SR University : వరంగల్ లోని ఎస్ఆర్ యూనివర్శిటీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. దీనిపై ఓ విద్యార్థి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నగర సీపీ అంబర్ కిషోర్ ఝా వార్నింగ్ ఇచ్చారు.
వరంగల్ ఎస్ఆర్ యూనివర్సిటీలో ర్యాగింగ్ భూతం కలకలం రేపింది. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం అనంతసాగర్ లోని ఎస్ఆర్ యూనివర్సిటీలో బీబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్ ను సీనియర్లు ర్యాగింగ్ చేశారు. బూతులు తిడుతూ తీవ్రంగా దాడి చేయడంతో బాధితుడు హసన్ పర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రెండు రోజుల కిందట ఈ ఘటన జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాధితులు, బాధితులు, పోలీసులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హనుమకొండలోని జులైవాడ న్యూ బృందావన్ కాలనీకి చెందిన జాటోతు దిలీప్ కుమార్ అనంతసాగర్ లో ఉన్న ఎస్ఆర్ యూనివర్సిటీలో బీబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. రోజువారీలాగే కాలేజీకి వెళ్లిన దిలీప్ కుమార్ ను మంగళవారం కొంత మంది సీనియర్లు టార్గెట్ చేశారు. మధ్యాహ్నం సమయంలో దిలీప్ కుమార్ లంచ్ చేసేందుకు అక్కడున్న గార్డెన్ లో కూర్చోగా, బీబీఏ థర్డ్ ఇయర్ కు చెందిన శ్రీకేష్, ఫిరోజ్, రిషీద్ మాలిక్, ఫస్ట్ ఇయర్ కు చెందిన నందన్, ఇంకొందరు అతడిని పిలిచారు. దీంతో వారి వద్దకు వెళ్లిన దిలీప్ కుమార్ తనను తనను ఎందుకు పిలిచారని అడిగాడు. దీంతో వాళ్లంతా బూతులు అందుకున్నారు.
దుర్భాషలాడటంతో పాటు దిలీప్పై దాడికి దిగారు. దీంతో గాయాలపాలైన బాధితుడు మంగళవారం సాయంత్రం హసన్ పర్తి పోలీసులను ఆశ్రయించాడు. ఎస్ఆర్ యూనివర్సిటీ యాజమాన్యం తమకు సరైన సెక్యూరిటీ ఇవ్వడం లేదని, తమ పట్ల బాధ్యత వహించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
తనను ర్యాగింగ్ చేసిన వారితో పాటు ఎస్ఆర్ యూనివర్సిటీ యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు హసన్ పర్తి పోలీసులు వివరించారు. విద్యార్థి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
ఇదివరకు వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీతో పాటు ఇతర విద్యాసంస్థల్లో ర్యాగింగ్ కలకలం రేపగా.. ఎస్ఆర్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి ఫిర్యాదుతో వరంగల్ లో మరోసారి ర్యాగింగ్ వ్యవహారం చర్చనీయాంశమైంది.
ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు: వరంగల్ సీపీ హెచ్చరిక
కాలేజీల్లో విద్యార్థులు ర్యాగింగ్ లాంటి విష సంస్కృతికి పాల్పడితే, కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. కళాశాలల్లో ర్యాగింగ్ భూతాన్ని కట్టడి చేయాలనే లక్ష్యంతో వరంగల్ సీపీ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
విద్యార్థుల భవిష్యత్‌ను నిర్మించడంలో కాలేజీ క్యాంపస్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అలాంటి విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కళాశాల విద్యార్థుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండేలా చూసుకోవాలన్నారు. సీనియర్లు, జూనియర్లు అని తేడా లేకుండా, సీనియర్లు జూనియర్లకు మార్గదర్శకులుగా వ్యవహరించాలన్నారు.
ర్యాగింగ్ అనేది అత్యంత అమానుష చర్య అని, తోటి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడం, వారిని ఇబ్బందులకు గురి చేయడం మంచి విద్యార్థుల లక్ష్యం కాదన్నారు. ర్యాగింగ్ లాంటి వికృత చర్యలకు పాల్పడి విద్యార్థులు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు.
సరదాలకు వెళ్లి కష్టాలను కొని తెచ్చుకోవద్దని, తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని హితవు పలికారు. ఎవరైనా కళాశాలల్లో ర్యాగింగ్ కు గురైతే మౌనంగా ఉండిపోకుండా తక్షణమే డయల్ 100 కు సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా విద్యార్థులకు సూచించారు.