Rachakonda Police Annual Report: 19 శాతం పెరిగిన నేరాలు.. ఆ కేసులే అత్యధికం
Rachakonda Police Annual Report 2022: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల శాతం పెరిగింది. గతేడాది కంటే ఈ ఏడాది 19 శాతం నేరాలు పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు వార్షిక నేర నివేదికను సీపీ మహేశ్ భగవత్ విడుదల చేశారు.
Rachakonda Police 2022 Annual Report: రాచకొండ కమిషనరేట్ పరిధిలో వార్షిక నేర నివేదికను పోలీస్ అధికారులు విడుదల చేశారు. ఈ మేరకు ఏడాది కాలంలో నమోదైన కేసులు, శాంతిభద్రతల కోసం తీసుకుంటున్న చర్యలతో పాటు సీసీటీవీల ఏర్పాట్లుతో పాటు పలు అంశాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 19 శాతం నేరాలు పెరిగినట్టు సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు. ఇందులో సైబర్ క్రైమ్ నేరాలు 66 శాతం పెరిగినట్లు పేర్కొన్నారు.
ఇక అత్యధికంగా రహదారి ప్రమాదాలు 19 శాతం.. మత్తు పదార్థాల కేసులు 140 శాతం పెరిగాయని సీపీ వెల్లడించారు. హత్యలు, అపహరణల కేసుల శాతం తగ్గిందని చెప్పుకొచ్చారు. మహిళలపై నేరాలు 17 శాతం.. ఆస్తి సంబంధిత నేరాలు 23 శాతం పెరిగాయని వివరించారు. అత్యాచార కేసులు 1.3 శాతం, వరకట్న హత్యలు 5 శాతం తగ్గాయని... మోసాలు 3 శాతం పెరిగాయని వెల్లడించారు. గుట్కా రవాణా కేసులు 131 శాతం తగ్గాయని... రహదారి ప్రమాద మరణాల్లో 0.91 శాతం తగ్గినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మానవ అక్రమ రవాణాలో 62 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
రాచకొండ పోలీస్ పరిధిలో గంజాయి నివారణ కోసం ప్రతిరోజు సోదాలు జరుపుతున్నామని సీపీ చెప్పారు. మిగతా నెలలతో పోల్చితే డిసెంబర్ నెలలో అత్యధికంగా రైడ్స్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కేసుల్లో 296 మందిని అరెస్ట్ చేసినట్లు వివరించారు. రాచకొండ పోలీస్ పరిధిలో మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు వస్తున్నారని.. ఇదీ చాలా మంచి పరిణామం అని సీపీ పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేశారు.
నిబంధనలు ఇవే…
బహిరంగ ప్రదేశాల్లో డీజేలకు అనుమతి లేదు. 45 డిసెబుల్స్ కంటే తక్కువ స్థాయిలో శబ్ధం వచ్చేలా నిబంధనలు పాటించాలి.
అసభ్యత, అశ్లీల దుస్తులు ధరించడం, అశ్లీల నృత్యాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దు.
జంటల కోసం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల్లో మైనర్లను అనుమతించవద్దు. నిర్వాహకులు వారి వయస్సును నిర్ధారించుకోవాలి.
ఈవెంట్లు జరిగే ప్రదేశంలోకి వచ్చీపోయే వారు సీసీ టీవీల్లో రికార్డు అయ్యే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. తప్పని సరిగా రికార్డింగ్ సౌకర్యం ఉండాలి.
అన్ని పబ్స్, వైన్‌షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు నిర్ణీత సమయం ప్రకారం మూసేయాలి. లైసెన్స్ దారుడు టైమ్ టూ టైమ్ నిబంధనలు పాటించాలి.
తుపాకులు, బాణాసంచా, అగ్నిప్రమాదాలు.. ఇతరత్రా ప్రమాదాలకు కారణమయ్యే వస్తువులను లోపలికి అనుమతించవద్దు.
మద్యం సేవించిన వినియోగదారుల సాయం కోసం డ్రైవర్లు, క్యాబ్‌లు అందుబాటులో ఉండేలా పబ్, బార్‌ల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలి.
తాగి మత్తులో ఉన్న ప్రేక్షకులు ఎవరూ ఆవరణలో గొడవలు, దుష్ప్రవర్తనకు తావు లేకుండా చూసుకోవాలి. ఇందుకు లైసెన్స్ దారులే బాధ్యత వహించాలి.
బార్ అండ్ రెస్టారెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో లైవ్ బ్యాండ్ నిర్వహించకూడదు.