Punjab CM Tour in Siddipet: తెలంగాణ నీటిపారుదల మోడల్ దేశానికే ఆదర్శం - పంజాబ్ సీఎం
punjab cm bhagwant mann news: పంజాబ్ సీఎం భగవంత్‌సింగ్ మాన్ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. గురువారం గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్‌ను పరిశీలించారు. ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు గుప్పించారు.
punjab cm bhagwant mann telangana tour: తెలంగాణలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పర్యటన కొనసాగుతోంది. గురువారం సిద్ధిపేటకు వెళ్లిన ఆయన... కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్ ను, కొండపోచమ్మ పంప్ హౌస్ ను, ఎర్రవల్లిలోని చెక్ డాంను సందర్శించారు. ప్రాజెక్ట్ నిర్మాణంతో పాటు ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు తెలంగాణ నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మాట్లాడుతూ.... తెలంగాణ సర్కార్ పై ప్రశంసలజల్లు కురిపించారు. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు నాలెడ్జ్ షేరింగ్ లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరం ఎత్తిపోతల పథకంను పరిశీలించేందుకు రాష్ట్రానికి వచ్చినట్లు తెలిపారు. 500 మీటర్ల పైకి గోదావరి నీటిని కాళేశ్వరం ద్వారా తీసుకువచ్చి మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేయడం ఆదర్శనీయమన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంతో పాటు నీటిపారుదల, పారిశ్రామిక, వైద్య, ఆరోగ్యం తదితర అన్ని రంగాలలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని కొనియాడారు.
తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన రిజర్వాయర్లు, చెక్ డ్యామ్ లు భూగర్భ జలాల పెంపునకు అత్యధికంగా ఉపయోగపడుతుందని... తెలంగాణ నీటిపారుదల మోడల్ దేశానికి ఆదర్శనమని వ్యాఖ్యానించారు. 1947 ముందు నుంచే పంజాబ్ రాష్ట్రంలో నీటిపారుదల మరియు వ్యవసారంగాలు అభివృద్ధి సాధించాయని చెప్పారు. పంజాబ్ అంటేనే ఐదు నదుల సంఘమం అన్న ఆయన.... భాక్రానంగల్ లాంటి గొప్ప ప్రాజెక్టులతో పంజాబ్ దేశంలోనే ఆహార ఉత్పత్తిలో ప్రథమంగా ఉండేదని చెప్పుకొచ్చారు. కానీ భూగర్భ నీటి వనరులను అధికంగా ఉపయోగించడం మూలంగా ప్రస్తుతం పంజాబ్ లోని కొన్ని జిల్లాలో భూగర్భ నీటిమట్టాలు ప్రమాదకర స్థాయికి చేరాయని వివరించారు. పంజాబ్ లో 80 శాతం భూగర్భ నీటి లభ్యతలో డార్క్ జోన్ లో ఉందన్నారు.
తెలంగాణ మోడల్ ని అనుసరించి పంజాబ్ లో కూడా చెక్ డ్యామ్ లు విరివిగా నిర్మిస్తామని భగవంత్ మాన్ చెప్పారు. జల సంపదను భవిష్యత్తు తరాలకు అందించేందుకు చర్యలు చేపడతామన్నారు. భూగర్భ నీటి వనరులను కాపాడేందుకు క్రాఫ్ట్ డైవర్షన్ పద్ధతిని అనుసరిస్తున్నామమని... పంజాబ్ లో గల పాతకాలం నాటి నీటిపారుదల వ్యవస్థను తెలంగాణలోలాగా ఆధునీకరించి భూగర్భ జలాలను పెంచేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి మార్చి నెలలో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నామని... ఈ బడ్జెట్లో నీటిపారుదలతో పాటు పారిశ్రామిక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.
"పంజాబ్ రాష్ట్రం వ్యవసాయ రంగంతో పాటు, పంజాబ్ యువత దేశ రక్షణలో అధిక భాగస్వామ్యం ఉంది. ప్రపంచంలో 80 శాతం బాస్మతి రైస్ పంజాబ్ లోనే పండుతుంది. గత ప్రభుత్వాల తీరుతో నిర్లక్ష్యానికి గురైన పంజాబ్ ను మళ్లీ ప్రాచీన కాలం నాటి పంజాబ్ గా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. కేంద్ర ప్రభుత్వం సరైన మద్దతు ధర ఇవ్వకపోవడం మూలంగా రైతులు నష్టపోతున్నారు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణలో కేసీఆర్ విద్యా, వైద్యం తదితర రంగాలలో అమలు చేస్తున్న వినూత్న పథకాలు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆకర్షిస్తున్నాయి" అని భగవంత్ మాన్ అన్నారు.