గద్వాల జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీపై ప్రజాగ్రహం - వాహనాలకు నిప్పు..! పరిస్థితి ఉద్రిక్తం-public protest against ethanol factory at dhanwada in gadwal district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  గద్వాల జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీపై ప్రజాగ్రహం - వాహనాలకు నిప్పు..! పరిస్థితి ఉద్రిక్తం

గద్వాల జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీపై ప్రజాగ్రహం - వాహనాలకు నిప్పు..! పరిస్థితి ఉద్రిక్తం

గద్వాల జిల్లాలోని పెద్ద ధన్వాడలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పనులు చేయడానికి వచ్చిన వాహనాలను తగలబెట్టడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిరసనలు

జోగులంబ గద్వాల్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఉద్రిక్తతలకు దారి తీసింది. రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు పనులు జరుగుతున్నాయి. వీటిని వ్యతిరేకిస్తూ కొద్దిరోజులుగా గ్రామస్థులు ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు.

వాహనాలకు నిప్పు…!

ఫ్యాకర్టీలో ఏర్పాటు భాగంగా ఇవాళ కంపెనీ తరపున పనులు చేయడానికి పలు వాహనాలు వచ్చాయి. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనయైన గ్రామస్థులు… వచ్చిన వాహనాలను తగలబెట్టారు. వారిపై దాడికి యత్నించారు. మరోవైపు పోలీసుల రంగప్రవేశంతో… నిరసనకారులను చెదరగొట్టారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ధన్వాడ చుట్టుపక్కల ఉన్న పది గ్రామాల ప్రజలు తరలివచ్చారు. ఫ్యాక్టరీ ఏర్పాటుతో గ్రామాల్లో కాలుష్యం ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. కృష్ణా నదీ తీరంలో ఇలాంటి ఫ్యాక్టరీల ఏర్పాటు వల్ల పర్యావరణానికి తీరని నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందంటున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు అనుమతులను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

స్థానికుడైన మహేశ్ తో హిందుస్తాన్ టైమ్స్ తెలుగు మాట్లాడింది. ఆందోళనకు గల కారణాలపై ఆరా తీసింది. ఫ్యాక్టరీ ఏర్పాటుతో ధన్వాడతో పాటు చుట్టు పక్కల గ్రామాలు ప్రభావితమవుతాయని చెప్పారు. ఇలాంటి ఫ్యాక్టరీతో పర్యావరణం పూర్తిగా కలుషితమైందన్నారు. భూగర్భ జలాలు కలుషితమవుతాయని… ప్రజలు అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని వివరించారు. ఈ ఫ్యాక్టరీ అనుమతలు రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేసారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.