Warangal : మంత్రుల పర్యటనలో ప్రోటోకాల్ రగడ.. డిప్యూటీ సీఎంను మరిచిన అధికారులు..!
Warangal : వరంగల్ ఆర్టీసీ అధికారులు డిప్యూటీ సీఎంనే మరిచారు. వరంగల్ రీజియన్‌కు టీజీఎస్ ఆర్టీసీ కేటాయించిన ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం.. స్టేజీ, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కానీ ప్రోటోకాల్‌ను మాత్రం గాలికొదిలేశారనే విమర్శలు వచ్చాయి. దీనిపై కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో.. సీఎం రేవంత్ రెడ్డి తోపాటు ఉమ్మడి వరంగల్ ఇంఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక మంత్రులు, ఎమ్మెల్యే ఫొటోలతో స్టేజీ, ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కానీ.. అందులో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫొటోను విస్మరించారు. డిప్యూటీ సీఎం ఫొటో లేకుండానే వేదికను తీర్చిదిద్దగా.. దానిని గమనించిన కొందరు స్థానిక కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీంతో నాలుక కర్చుకున్న ఆర్టీసీ అధికారులు హడావుడిగా దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అప్పటికప్పుడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫొటో స్టిక్కర్ రెడీ చేయించారు. మంత్రులు కాసేపట్లో సభా ప్రాంగణానికి చేరుకుంటారనగా.. డిప్యూటీ సీఎం ఫొటో స్టిక్కర్‌ను తీసుకొచ్చి, ఫ్లెక్సీపై అంటించారు. దీంతో వివాదం కాస్త సద్దుమణిగింది. అప్పటికే కొంతమంది దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది కాస్త వైరల్‌గా మారింది.
50 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం..
ఓరుగల్లు పర్యటనలో భాగంగా ఉమ్మడి జిల్లా ఇంఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, స్థానిక నేతల చేతుల మీదుగా వరంగల్ రీజియన్‌కు కేటాయించిన 112 ఎలక్ట్రిక్ బస్సుల్లో 50 బస్సులను ప్రారంభించారు. హనుమకొండ బాలసముద్రం హయగ్రీవాచారి గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీటిని ప్రారంభించారు.
సంక్రాంతి వరకు మరో 25 బస్సులు రోడ్డెక్కనుండగా, ఆ తరువాత మిగతా బస్సులను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రులు వివరించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు.. మహాలక్ష్మీ పథకాన్ని తీసుకొచ్చినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. ఆ పథకం ద్వారా ఇప్పటివరకు 125 కోట్ల మంది మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని వివరించారు. ఇందుకు రూ.4,350 కోట్లు ఖర్చు చేసినట్లు స్పష్టం చేశారు.
వెయ్యికిపైగా..
ఇప్పటికే రాష్ట్రంలోని హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో వెయ్యికిపైగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించినట్లు మంత్రి పొన్నం వెల్లడించారు. అక్యుపెన్సి గతంలో కంటే రెట్టింపు అయ్యిందని, ఆర్టీసీ ఉద్యోగుల వల్లే ఇది సాధ్యం అవుతుందన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఉద్యమాన్ని రగిలించారు..
తెలంగాణ కోసం కోట్లాడిన ఆర్టీసీ ఉద్యోగులు ‘బస్ కా పయ్య నహీ చెలేగా’ అంటూ ఉద్యమాన్ని రగిలించారని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టామని, 3 వేల ఉద్యోగాలకు నియామకాలు చేపడుతున్నామన్నారు. భూమిలేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ కానుక కింద 12 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని, గత 10 సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని గుర్తు చేశారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)