TG New Ration cards : గ్రామాల్లో కొత్త రేషన్ కార్డుల రగడ.. అప్పుడే మొదలైన ఆందోళనలు.. కారణాలు ఏంటీ?
TG New Ration cards : రాష్ట్రంలోని పలు గ్రామాల్లో కొత్త రేషన్ కార్డులపై లొల్లి మొదలైంది. దరఖాస్తు చేసుకున్న వారందరికీ కార్డులు రాకపోవడమే ఇందుకు కారణంగా అధికారులు చెబుతున్నారు. తాజాగా బి.అన్నారం గ్రామంలో ఏకంగా పోస్టర్లు వేసి ఆందోళనకు దిగారు. దీనికి కారణాలు ఏంటో ఓసారి చూద్దాం.
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. ఇటీవలే కొత్త కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 6.68 లక్షల కుటుంబాలు నూతన కార్డులకు అర్హమైనవిగా ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. ఈ జాబితాను 33 జిల్లాలకు పంపించింది. ఈ నెల 20 నుంచి 24 వరకు గ్రామ, బస్తీ సభలు నిర్వహించి, అభ్యంతరాల స్వీకరించనున్నారు. ఆ తర్వాత తుది జాబితా ఖరారవుతుందని అధికారులు చెబుతున్నారు.
జనవరి 26న..
కలెక్టర్ల ద్వారా వచ్చే జాబితాల మేరకు పౌరసరఫరాల శాఖ కార్డులను మంజూరు చేయనుంది. జనవరి 26న కొత్త కార్డుల జారీ ప్రారంభం కానుంది. అయితే.. ప్రస్తుతం వచ్చిన జాబితా తమ పేర్లు లేవని చాలా గ్రామాల్లో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులను నిలదీస్తున్నారు. దీంతో వారు గ్రామాలకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొంది.
మాకేందుకు రాలేదు..
తాజాగా బి.అన్నారం గ్రామంలో ధర్నా నిర్వహించారు. 'మేము ఇచ్చాం అప్లికేషన్.. మాకేందుకు రాలేదు రేషన్ కార్డు' అంటూ ఆ గ్రామ ప్రజలు నినాదాలు చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఒక్క బి.అన్నారం గ్రామంలోనే కాదు.. చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అటు దరఖాస్తు చేసుకున్నవారు గ్రామాల్లోని కాంగ్రెస్ నాయకుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు.
ఉన్నతాధికారుల ఆగ్రహం..
కొందరు క్షేత్రస్థాయి అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి.. జాబితాలో ఉన్నవారి పేర్లను వెల్లడించారు. దీంతో జాబితాలో పేర్లు లేని వారు ఆందోళనలు చేస్తున్నారు. గ్రామ, బస్తీ సభలు నిర్వహించక ముందే జాబితాలోని పేర్లు బయటకు ఎలా వెళ్లాయని ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు క్షేత్రస్థాయిలో అధికారులు గ్రామ, బస్తీ సభలు నిర్వహించడానికి భయపడుతున్నారు.
భారీగా డిమాండ్..
రాష్ట్రంలో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, రూ.500కు గ్యాస్ సిలిండర్, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలకు రేషన్‌కార్డే ఆధారం. దీంతో బాగా డిమాండ్ ఉంది. గతంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకుని పరిశీలించేవారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం కొత్త పద్ధతిని అనుసరిస్తోంది. గతేడాది నవంబరులో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేను ఆధారంగా చేసుకుంటోంది. ఆ సర్వే ద్వారా రేషన్ కార్డులు లేనివారి వివరాలను పౌరసరఫరాల శాఖ తీసుకుంది.
హెచ్చుతగ్గులు..
కొత్త కార్డులు కావాలన్నవారి, ఇప్పటికే ఉన్నకార్డుల్లో పేర్ల నమోదుకు దరఖాస్తు చేసుకున్నవారి సమాచారాన్ని అధికారులు వడబోశారు. ఈ ప్రక్రియ తర్వాత 6,68,309 కుటుంబాలు కొత్త కార్డులకు అర్హమైనవిగా ప్రాథమికంగా గుర్తించారు. ఈ కుటుంబాల్లో 11,65,052 మంది పేర్లు ఉన్నాయి. గ్రామ, బస్తీ సభల తర్వాత కొత్త కార్డులు.. అందులో లబ్ధిదారుల సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
నాయకులకు భయం..
ప్రస్తుతం వచ్చిన జాబితాలో గతంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నవారి పేర్లే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు తక్కువగా ఉన్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం మంచి చేద్దామని కొత్త రేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించింది. కానీ కార్డులు రానివారు గ్రామాల్లో తిరగబడే ప్రమాదం ఉందని కాంగ్రెస్ నాయకులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.