Hanumakonda Issue: తమ్ముడి ఇంటి ఎదుట అన్న డెడ్ బాడీతో ఆందోళన,మూడ్రోజులు శవజాగారం-protest with the dead body in front of his brothers house the funeral took place for three days ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hanumakonda Issue: తమ్ముడి ఇంటి ఎదుట అన్న డెడ్ బాడీతో ఆందోళన,మూడ్రోజులు శవజాగారం

Hanumakonda Issue: తమ్ముడి ఇంటి ఎదుట అన్న డెడ్ బాడీతో ఆందోళన,మూడ్రోజులు శవజాగారం

HT Telugu Desk HT Telugu
Published Jul 09, 2024 06:30 AM IST

Hanumakonda Issue: వంశ పారంపర్యంగా వచ్చిన భూమిలో తన వాటాను కూడా తన తమ్ముడే పట్టా చేసుకున్నాడనే ఆవేదన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆయన డెడ్ బాడీతో కుటుంబ సభ్యులు తమ్ముడి ఎదుట శవ జాగారం చేశారు.

తమ్ముడి మృతదేహంతో అన్న ఇంటి ఎదుట బంధువుల ఆందోళన
తమ్ముడి మృతదేహంతో అన్న ఇంటి ఎదుట బంధువుల ఆందోళన

Hanumakonda Issue: ఆస్తిని తమ్ముడు అన్యాయంగా పట్టా చేసుకోవడంతో అన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో బంధువులు మూడు రోజుల పాటు మృత దేహంతో అక్కడే బైఠాయించగా, చివరకు అధికారుల హామీతో ఆందోళన విరమించి సోమవారం అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం అనంత సాగర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అనంతసాగర్ గ్రామానికి చెందిన బండ బండ శ్రీనివాస్ రెడ్డి, సరోజన దంపతులకు మహేందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. వంశ పారం పర్యంగా సక్రమించిన భూమి వారికి ఏడు ఎకరాల వరకు భూమి ఉండగా, తన్న మహేందర్ రెడ్డికి రావాల్సిన 3 ఎకరాల 20 గుంటల భూమిని కూడా తమ్ముడైన ప్రభాకర్ రెడ్డే సొంతం చేసుకున్నాడు.

2018లో తనతో పాటు తన భార్య జ్యోతి, కొడుకు సాయినాథ్ పేరున పట్టా చేశాడు. దీంతో తనకు రావాల్సిన భూమిని తన తమ్ముడే పట్టా చేయించుకున్నాడనే కోపంతో మహేందర్ రెడ్డి పలుమార్లు ప్రభాకర్ రెడ్డిని నిలదీశాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవలు పెరిగిపోయాయి. దీంతో ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసుకున్నారు.

గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు కూడా నిర్వహించారు. అయినా వివాదం ఎటూ తేలకపోవడంతో తాజా మాజీ వైస్ ఎంపీపీ, అదే గ్రామానికి చెందిన బండ రత్నాకర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ రామంచ సాయిలును సంప్రదించారు. దీంతో వారు తాము అడిగినంత ఇస్తేనే ప్రభాకర్ రెడ్డితో మాట్లాడి భూమిని పట్టా చేయించేలా చూస్తామని నమ్మబలికారు. పైసలు ఇవ్వకపోతే పని చేసి పెట్టేదే లేదని స్పష్టం చేశారు.

దీంతో తన తమ్ముడు, బంధువులే తనను మోసం చేశారని మనోవేదనకు గురైన బండ మహేందర్ రెడ్డి గత గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పురుగుల మందు తాగాడు. అది గమనించిన ఇరుగు పొరుగు వారు మహేందర్ రెడ్డిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహేందర్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ప్రాణాలు కోల్పోయాడు.

డెడ్ బాడీతో మూడు రోజుల ఆందోళన

సొంత తమ్ముడే మోసం చేశాడన్న కారణంతో మహేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోగా, తమకు రావాల్సిన భూమిని తమ పేరున పట్టా చేయించాల్సిందేనంటూ మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అంతకుముందు మహేందర్ రెడ్డి ఆత్మహత్యకు ప్రభాకర్ రెడ్డితో పాటు అతని భార్య, కొడుకు సాయినాథ్, పెద్ద మనుషులుగా వ్యవహరించిన బండ రత్నాకర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ రామంచ సాయిలు కారణమని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ మహేందర్ రెడ్డి భార్య పద్మ హసన్ పర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అనంతరం మహేందర్ రెడ్డి మృత దేహాన్ని ఆసుపత్రి నుంచి నేరుగా ప్రభాకర్ రెడ్డికి తీసుకెళ్లారు. శుక్రవారం రాత్రి ప్రభాకర్ రెడ్డి ఇంటి ఎదుట డెడ్ బాడీ తో ఆందోళన చేపట్టగా, విషయం తెలుసుకున్న హసన్ పర్తి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు నచ్చజెప్పేందుకు శతవిధాలా ప్రయత్నం చేశారు. కానీ తమ భూమి తమకు దక్కకుండా ఆందోళన విరమించేది లేదంటూ బాధిత కుటుంబ సభ్యులు శవంతోనే జాగారం చేశారు. పోలీసులు, గ్రామస్థులు ఎవరు నచ్చజెప్పినా వినకుండా ఆందోళన కొనసాగించారు. దీంతో అనంతసాగర్ గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఆఫీసర్ల హామీతో దహన సంస్కారాలు

శుక్రవారం నుంచి ఆదివారం సాయంత్రం వరకు ఆందోళన కొనసాగిన అనంతరం గ్రామంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు తమ భూమి తమకు దక్కేదాకా పోరాడుతామని భీష్మించుకు కూర్చోవడంతో పోలీసులకు ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు పెరిగాయి. దీంతో ఆదివారం రాత్రి పోలీసులు గ్రామానికి చెందిన కొందరు పెద్ద మనుషుల సహకారంతో మరోసారి బాధిత కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. కాంగ్రెస్ నేత వెంకట్రామ్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బిల్లా ఉదయ్ రెడ్డి సమక్షంలో మహేందర్ రెడ్డి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని తెల్ల కాగితం రాసి సంతకాలు చేశారు. ఆదివారం అర్ధరాత్రి వరకు ఈ తతంగం పూర్తి చేశారు.

ముగిసిన అంత్యక్రియలు.. లొంగిపోయిన నిందితులు

ఆదివారం రాత్రి పెద్ద మనుషుల సమక్షంలో ఆఫీసర్లు హామీ ఇవ్వడంతో మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళన విమరించారు. అనంతరం సోమవారం ఉదయం 11 గంటల సమయంలో డెడ్ బాడీని అక్కడి నుంచి దహన సంస్కారాలకు తరలించారు. మళ్లీ ఆందోళనలు జరిగే అవకాశం ఉండటంతో సీఐ సురేష్ చివరి వరకు బందోబస్తు నిర్వహించారు.

కాగా మహేందర్ రెడ్డి ఆత్మహత్యకు కారణమైన ప్రభాకర్ రెడ్డి, తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం సాయంత్రం హసన్ పర్తి పోలీస్ స్టేషన్ కు వచ్చి సీఐ ఎదుట లొంగిపోయారు. కాగా మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని అధికారులు, పెద్ద మనుషులు తెల్ల కాగితంపై రాసి సంతకాలు పెట్టగా, ఆ హామీ ఏ మేరకు నెరవేరుస్తారో చూడాలి.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner