Property registrations: హైదరాబాద్‌లో మే నెలలో 152 శాతం పెరుగుదల
హైదరాబాద్‌లో ఆస్తుల రిజిస్ట్రేషన్లలో మే నెలలో 152 శాతం పెరుగుదల నమోదైందని నైట్ ఫ్రాంక్ వెల్లడించింది.
హైదరాబాద్, జూన్ 9: హైదరాబాద్ నగరంలో మే నెలలో ఆస్తి రిజిస్ట్రేషన్లలో అంతకుముందు ఏడాది ఇదే నెలతో పోల్చితే 152 శాతం వృద్ధి నమోదైందని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా గురువారం తెలిపింది.
నెలవారీగా చూస్తే 17.6 శాతం వృద్ధి కనబడిందని వివరించింది. ద్రవ్యోల్భణం, ఆర్థిక మాంద్యం వంటి ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ బలమైన డిమాండ్ ధోరణిని సూచిస్తుందని తెలిపింది. అయితే గత ఏడాది రెండో విడత కోవిడ్ కారణంగా రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా తగ్గడం గమనార్హం.
మే 2022లో రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిపిన ఆస్తుల మొత్తం విలువ రూ. 3,058 కోట్లుగా ఉంది. విలువ పరంగా చూస్తే ఇది 146 శాతం వృద్ధికి సమానం. నెలవారీగా 9.9 శాతం వృద్ధి నమోదు చేసింది.
జనవరి 2022 నుండి రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగిన అన్ని ఆస్తుల విలువ రూ. 15,071 కోట్లుగా ఉంది. హైదరాబాద్ నివాస మార్కెట్‌లో హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి తదితర నాలుగు జిల్లాలు ఉన్నాయి.
‘ఇటీవలి సంవత్సరాలలో ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం వంటి ప్రతిబంధకాలు ఎదురవుతున్నప్పటికీ.. హైదరాబాద్ బలమైన డిమాండ్ చూపిస్తున్న నగరాల్లో ఒకటిగా ఉంది. పెరుగుతున్న నిర్మాణ ఖర్చులు, అధిక ధరలు మిడ్ సెగ్మెంట్‌పై ప్రభావం చూపినప్పటికీ మార్కెట్ పటిష్టంగా ఉంది. ఉద్యోగ భద్రత, పెరుగుతున్న గృహ ఆదాయాలు, సేవింగ్స్, అనుకూలమైన హోం లోన్ వడ్డీ రేట్లు వంటి అంశాల ద్వారా ఇంటి కొనుగోళ్లకు ఆకర్షితులవుతున్నారు’ అని నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ తెలిపారు.
మే నెలలో నమోదైన అన్ని రెసిడెన్షియల్ అమ్మకాలలో రూ. 25 లక్షల నుండి రూ. 50 లక్షల ధర గల ఇళ్ల వాటా 55 శాతంగా ఉంది. అయితే రూ. 25 లక్షల కంటే తక్కువ విలువైన ఇళ్లలో డిమాండ్ 18 శాతానికి పడిపోయిందని నివేదిక తెలిపింది. రూ. 50 లక్షలు, అంతకంటే ఎక్కువ ఉన్న ఆస్తుల విక్రయాల రిజిస్ట్రేషన్ మొత్తం వాటా గత ఏడాది ఇదే నెలలో 26 శాతంతో పోలిస్తే ఈ నెలలో 27 శాతానికి పెరిగింది.
సంబంధిత కథనం