BRAOU Vice Chancellor : కరీంనగర్ కు అరుదైన గౌరవం - అంబేడ్కర్ వర్శిటీ వీసీగా ఘంటా చక్రపాణి నియామకం
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదంతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. గతంలో టీజీపీఎస్సీ ఛైర్మన్ గా కూడా ఘంటా చక్రపాణి పని చేశారు.
డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా సీనియర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి నియమితులయ్యారు. ప్రభుత్వ సిఫారసుతో ఆయన నియామకానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదముద్ర వేశారు. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. దీంతో కరీంనగర్ జిల్లా వాసికి అరుదైన గౌరవం దక్కినట్లయింది. సీనియర్ ఆచార్యులైన ఆయనకు సమున్నత పదవిలో బాధ్యతలు చేపట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఉమ్మడి జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వివాదరహితుడిగా పేరొందిన చక్రపాణి గత ప్రభుత్వ హయాంలోనూ టీఎస్పీఎస్సీ చైర్మన్ గా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించడంతో దూరవిద్యకు సేవనందించే అవకాశం లభించినట్లైంది.
చక్రపాణి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2014 నుంచి 2020 వరకు తొలి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ గా పని చేశారు. కరీంనగర్ సమీపంలోని ఎల్ఎండీ నిర్మాణంలో మునిగిన యాస్వాడ గ్రామంలో ఘంటా జన్మించారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం దూళికట్టలో స్థిరపడ్డారు. యాస్వాడ, ఎలగందల్, రామగుండం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్యనభ్యసించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివి, ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వెళ్లారు. ఓయూలో ఎంఏ, పీహెచ్ఎ సోషియాలజీ, ఎంసీజే చేశారు.
నాడు జర్నలిస్టు...నేడు వైస్ ఛాన్సలర్
1985లో జీవగడ్డ దినపత్రికలో పాత్రికేయుడిగా ప్రవేశించి, ఆ తర్వాత పలు పత్రికల్లో రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్ గా పని చేశారు. 1990లో టీచింగ్ వైపు మళ్లారు. కాకతీయ యూనివర్సిటీలో సోషియాలజీ ప్రొఫెసర్ గా చేరారు. 1994లో అంబేడ్కర్ యూనివర్సిటీలో సోషియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరి, 2009లో ప్రొఫెసర్గా పదోన్నతి పొందారు.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేశారు. పలు సామాజిక అం శాలపై అధ్యయనాలు, రచనలు, విశ్లేషణలతో తెలంగాణ సమాజానికి సుపరిచితులుగా మారారు. 2004లో డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నక్సల్స్ తో జరిపిన శాంతి చర్చల సందర్భంగా పీస్ ఇనిషియేటివ్ కమిటీ వ్యవస్థాపకుల్లో ఘంటా ఒకరు. కాల్పుల విరమణ కమిటీకి ఆయన కన్వీనర్ గా పని చేశారు. వీసీగా చక్రపాణి నియామకంపై ఉమ్మడి జిల్లావాసులు హర్షం వ్యక్తం. చేస్తున్నారు.
గతంలో కీలక పదవులు..
ఘంటా చక్రపాణి కే కాకుండా గతంలో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులకు కీలక పదవులు లభించాయి. వేములవాడ మండలం హన్మాజీపేటకు చెందిన డా.సి.నారాయణ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వీసీగా పని చేశారు. ఇదే మండలం మల్లారం గ్రామానికి చెందిన జి. రాంరెడ్డి దూరవిద్య పితామహుడుగా పేరు ఉంది. ఈయన ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి తొలి వీసీగా వ్యవహరించారు. అలాగే హన్మాజీపేటకు చెందిన సంకశాల మల్లేశం కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం వీసీగా ఇటీవలి వరకు కొనసాగారు.
కోనరావుపేట మండలం నాగారానికి చెందిన ఆర్థికవేత్త సీహెచ్. హనుమంతరావుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కులపతిగా బాధ్యతలు నిర్వ ర్తించారు. కొన్ని నెలల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ విశ్వవిద్యాలయాలకు వీసీల వీసీలను నియమించింది. అందులోనూ సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందిన జిఎన్. శ్రీనివాస్ పాలమూరు విశ్వవిద్యాలయానికి వీసీగా నియమితులయ్యారు. తాజాగా డాక్టర్ చక్రపా ణికి వీసీగా అవకాశం దక్కింది.
రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం