TG Panchayat Secretaries : చేతిలో చిల్లిగవ్వ లేదు.. బతుకమ్మ పండుగను ఎలా నిర్వహించాలి.. పంచాయతీ కార్యదర్శుల ఆవేదన
TG Panchayat Secretaries : బతుకమ్మ, దసరా.. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పండగలు. గ్రామాల్లో ఈ పండగలకు ప్రాధాన్యత ఎక్కువ. వీటిని నిర్వహించడానికి ఇప్పుడు పంచాయతీ కార్యదర్శులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిధులు రావడం లేదని.. చేతిలో చిల్లిగవ్వ లేదని వాపోతున్నారు.

తెలంగాణలో పెద్ద పండగలు సద్దుల బతుకమ్మ, దసరా. ఈ పండగలను పల్లెల్లో ఘనంగా నిర్వహిస్తారు. బతుకమ్మ ఆఖరి రోజు ఆడపడుచులు అందరూ తమతమ గ్రామం సమీపంలోని చెరువు కట్టకు వెళ్లి.. బతుకమ్మను గంగమ్మ ఒడికి చేరుస్తారు. అయితే.. ఈసారి పల్లెల్లో పండుగ వాతావరణం కనిపించడం లేదు. దానికి కారణం నిధులు లేకపోవడమేనని పంచాయతీ కార్యదర్శలు చెబుతున్నారు.
బతుకమ్మ ఆడే స్థలాలను, పరిసరాలను శుభ్రం చేయించాలి. చెరువు కట్టలపై బతుకమ్మ ఆడతారు కాబట్టి.. అంతకు ముందే అక్కడ చెట్లను తొలగించాలి. అందుకు జేసీబీలు, డోజర్లను వినియోగిస్తారు. కానీ.. ఇప్పుడు వాటికి కూడా డబ్బులు లేవు. దీంతో ఏర్పాట్లు సరిగా జరగడం లేదు. కొన్నిచోట్ల పంచాయతీల్లో ఉన్న సిబ్బందితో చెట్లను తొలగిస్తున్నారు. కానీ.. వారికి పూర్తిస్థాయిలో సాధ్యం కావడం లేదు.
ఈసారి కష్టమే..
బతుకమ్మ ఆడే ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. ఈసారి అది కూడా కష్టంగానే కనిపిస్తోంది. ఎక్కడా ఏర్పాట్ల దిశగా అడుగులు పడటం లేదు. నగర పంచాయతీలు, మేజర్ పంచాయతీల్లో సంతల టెండర్ల ద్వారా ఆదాయం వస్తుంది. ఆ నిధులతో పండగల సమయంలో ఏర్పాట్లు చేస్తుంటారు. కానీ.. గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ఇచ్చే నిధులే దిక్కు. దీంతో అడుగు ముందుకు పడటం లేదు.
పంచాయతీ కార్యదర్శుల ఆవేదన..
బతుకమ్మ పండగ నిర్వహణ కోసం పంచాయతీలకు నిధులు వస్తే.. వాటితో పనులు చేయించేవాళ్లమని కార్యదర్శలు చెబుతున్నారు. ఈసారి నిధుల కొరత కారణంగా పనులు జరగడం లేదని అంటున్నారు. తాము సొంతంగా ఎంతో కొంత ఖర్చు చేసినా పనులు పూర్తి కావడం లేదని చెబుతున్నారు. స్థానికంగా ఉన్న సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
బిల్లులు వస్తాయో.. రావో..
ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. గ్రామాల్లో ఎక్కువ బీఆర్ఎస్ పాలకవర్గాలు ఉన్నాయి. దీంతో సొంతంగా డబ్బులు ఖర్చు చేసేందుకు సర్పంచ్, ఎంపీటీసీలు ముందుకు రావడం లేదు. ఇప్పుడు ఖర్చు చేస్తే.. మళ్లీ డబ్బులు వస్తాయో.. రావోనని భయపడుతున్నారు. దీంతో భారం అంతా పంచాయతీ కార్యదర్శులపై పడుతోంది. తమకు వచ్చేదే తక్కువ జీతం.. దాంట్లో ఈ ఖర్చులు ఎలా భరించాలని.. కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు.