TG Gurukulam: సమస్యలకు నిలయాలు సంక్షేమ హాస్టళ్ళు, ఆలనాపాలన లేక అస్తవ్యస్తమైన తెలంగాణ గురుకులాలు
TG Gurukulam: తెలంగాణలో సంక్షేమ హాస్టళ్ళు సమస్యలకు నిలయాలుగా మారాయా?మౌలిక సదుపాయాలు లేక గురుకుల పాఠశాలలు పిల్లలకు శాపాలుగా పరిణమిస్తున్నాయా? ఆలనా పాలన లేక హాస్టళ్ళు అస్తవ్యస్తంగా మారాయా? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే ఔననే సమాధానం వస్తుంది.
TG Gurukulam: తెలంగాణ గురుకుల పాఠశాలలు సమస్యలకు నిలయాలుగా మాారాయి. 8 నెలల్లో 36 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం, 500లకు పైగా మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడం సంక్షేమ హాస్టళ్ళ అధ్వాన్న పరిస్థితికి అద్దం పడుతుంది. పెద్దాపుర్ గురుకులంలో ఇద్దరు విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మృతి సర్వత్రా ఆందోళనకు గురి చేస్తోంది. సరస్వతి నిలయాలు సమస్యలతో సతమతమవుతున్న సంక్షేమ హాస్టళ్ళపై స్పెషల్ రిపోర్ట్.
చదువులమ్మ ఒడి సర్కార్ బడి...ఆ బడిలో చదివే పేద పిల్లలకు వసతి కల్పించే సంక్షేమ హాస్టళ్ళలో విద్యార్థులు అస్వస్థతకు గురికావడం... అనూహ్యంగా ప్రాణాలు కోల్పోవడం కలకలం సృష్టిస్తుంది. ఇక్కడ అక్కడ అనే తేడాలేదు.. 8 మాసాల్లో తెలంగాణ వ్యాప్తంగా 36 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అందులో ఇద్దరు విద్యార్థులు జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మృతి చెందారు. ఆ పిల్లలు ఏలా చనిపోయారో స్పష్టత లేక మిస్టరీగానే మారి సర్వత్రా ఆందోళనకు గురి చేస్తోంది.
అధ్వాన్న పరిస్థితిలో పెద్దాపూర్ గురుకులం...
500 మంది విద్యార్థులు ఉన్న పెద్దాపూర్ గురుకులంలో అధ్వాన్న పరిస్థితులు ఉన్నాయి. ఇద్దరు విద్యార్థులు మృతి చెంది, మరో నలుగురు అస్వస్థతకు గురైన పెద్దాపూర్ గురుకులంలో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన భవనం ఉన్నప్పటికి కనీస సౌకర్యాలు లేక పిల్లలు పట్టించుకునే వారు కానరాక దుర్బర పరిస్థితిల్లో పిల్లలు చదువుకునే దుస్థితి నెలకొంది.
12 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గురుకులం అపరిశుభ్రమైన వాతావరణంలో బెడ్స్ లేక నేలపై బుక్కులు, నిత్యావసర వస్తువుల మద్యన కాలం వెల్లదీసే పరిస్థితులు నెలకొన్నాయి. కరెంట్ ఉన్నా ప్యాన్ లు ఉండవు... డైనింగ్ హాల్ ఉన్నా మెను ప్రకారం భోజనం పెట్టరు... గ్రౌండ్ ఉన్నా ఆడుకునేలా పరిసరాలు అనుకూలంగా లేని పరిస్థితులు ఉన్నాయి. ఈ దుస్థితికి కారణం ఎంటో చెప్పే నాథుడే ఉండడు.
పాములతో సావాసం...
దుర్భరమైన పరిస్థితిలో పాములు, తేళ్ళు, విష పురుగులతో సావాసం చేస్తున్నారు పిల్లలు. పెద్దాపూర్ గురుకులంలో ఇద్దరు విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇద్దరు మృతి, మరో నలుగురు అస్వస్థతకు గురి కావడంతో పేరెంట్స్ భయాందోళన చెందుతూ పిల్లలను స్వగ్రామాలకు తీసుకెళ్ళారు.
హాస్టల్ లో సీటు వచ్చిందంటే సంబరపడ్డాం.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో భయపడాల్సిన వస్తుందని విద్యార్థులతోపాటు పేరెంట్స్ ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. అస్తవ్యస్తంగా ఉన్న హాస్టల్లో పిల్లలను ఉంచి చదివించాలంటే భయమేస్తుందని అంటున్నారు పేరెంట్స్.
గుడి కోసం..విష ప్రయోగం జరిగిందా?
పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల మృతి, నలుగురు విద్యార్థులు అస్వస్థత గురి కావడం విష ప్రయోగం జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకప్పటి ఎస్సారెస్పీ క్యాంప్ కు సంబంధించిన గురుకుల పాఠశాల స్థలంలో ప్రస్తుతం స్థానికులు కొందరు అక్కడ మల్లికార్జున స్వామి ఆలయం నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ లో భాగంగా ఆ స్థలం పై కన్నేసిన వారే విద్యార్థులపై విష ప్రయోగం చేసి ఉండొచ్చని అనుమానాలు విద్యార్థుల పేరెంట్ వ్యక్తం చేస్తున్నారు.
అందుకు బలం చేకూర్చేలా ఓ విద్యార్థి తల్లి కృష్ణవేణి పూనకాలతో ఊగిపోతూ తన మాయే ఈ దుస్థితి కారణమని చెప్పడం అందరిని ఆలోచనలో పడేసింది. నాగేంద్రుడి రూపంలో తన మాయ చూపినా లెక్క చేయడం లేదని మహిళా పూనకం తో భవిష్యవాణి వినిపించారు. తనను కదుపాలని చూశారని, పూజలు చేయడం లేదని, అందుకే ఈ స్థితికి తీసుకొచ్చానని వెల్లడించారు.
గుడి కట్టించి నిత్య పూజలతో శాంతి చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే శాంతి లేకుండా ఇలానే చేస్తానని హెచ్చరించారు పూనకాల మహిళ. ఇప్పటికే ఇద్దరు మృతి చెంది పలువురు అస్వస్థకు గురికావడంతో విద్యార్థులంతా హాస్టల్ ను ఖాళీ చేసి స్వగ్రామాలకు వెళ్లిపోయారు. వారిని మరింత భయాందోళనకు గురి చేసేలా మహిళా పూనకంతో చెప్పడం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తుంది. అయితే స్థానికులు కొందరు గురుకుల పాఠశాల స్థలంపై కన్నేసి గుడి పేరుతో విద్యార్థులపై విష ప్రయోగం చేసి ఉంటారని పెరెంట్స్ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మల్లన్న గుడి, విష ప్రయోగం పై విచారణ జరపాలని పేరెంట్స్ కోరుతున్నారు.
దిద్దుబాటు చర్యల్లో సర్కార్..
పెద్దాపూర్ గురుకులంలో చోటు చేసుకున్న ఘటనను సీరియస్ గా పరిగణిస్తూ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పెద్దాపూర్ గురుకులంను సందర్శించి మృతిచెందిన విద్యార్థుల పేరెంట్స్ ను పరామర్శించారు. పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా చేసేందుకు 50 లక్షలు మంజూరు చేశారు.
గత ప్రభుత్వం 10 ఏళ్ళలో విద్య కోసం 830 కోట్లు కేటాయిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది 5 వేల కోట్లు బడ్జెట్ లో కేటాయించిందని, వాటితో భవనాలు లేని పాఠశాలలకు శాశ్వత భవనాలు, హాస్టళ్ళలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. పాఠశాల ఆవరణాలను పరిశుభ్రంగా ఉంచి ఔషధ మొక్కలు, పండ్ల మొక్కలు నాటి పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని చెప్పారు. హాస్టల్లో పారామెడికల్ సిబ్బందిని నియమించడంతోపాటు కుక్క కాటు పాము కాటు మందులు అందుబాటులో ఉంచుతామని పెరిగిన ధరలకు అనుగుణంగా డేట్ చార్జీలు పెంచి పౌష్టికాహారం అందిస్తామన్నారు.
ఎమ్మెల్యే, మంత్రి కలెక్టర్ నెలకు ఒక్కసారి హాస్టల్ ను సందర్శించి పిల్లలతో ఒక్కరోజు గడిపేలా చర్యలు చేపడుతాన్నారు. మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల కుటుంబానికి ఐదు లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా తో పాటు కుటుంబంలో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం, ఇళ్ళు లేని వారికి ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేస్తామని ప్రకటించారు.
హాస్టల్ సమస్యలపై బిఆర్ఎస్ అధ్యాయానికి కమిటీ...
సంక్షేమ హాస్టళ్ళు, గురుకుల పాఠశాలలు సమస్యలతో సతమతమవుతుంటే మొన్నటి వరకు ఏలి ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ ఆద్యాయన కమిటీ వేసింది. పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో కమిటీ వేశారు.
నాలుగైదు రోజుల్లో 20 నుంచి 30 సంక్షేమ హాస్టళ్లు గురుకుల పాఠశాలను కమిటీ సందర్శించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. రాజకీయాలు చేయడం కోసం కాదన్నారు. నిర్మాణాత్మకమైన సూచనలు సలహాలు ఇచ్చేందుకు కమిటీ నివేదిక తయారు చేసి ఇస్తుందని తెలిపారు.
సంక్షేమ హాస్టల్లో మానవ తప్పిదాలతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరిపైనో నింద వేయడమో, దేవుడిపైనే భారం వేయడమో కాకుండా, ఎవరి పని వారు నిర్లక్ష్యం లేకుండా సకాలంలో చేస్తే ఇలాంటి పరిణామాలు ఉత్పన్నంకావంటున్నారు సామాజిక వేత్తలు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)