Warangal MGM Hospital : వరంగల్ ఎంజీఎంలో ప్రైవేట్ ల్యాబ్స్ దందా..! తెర వెనక ఎవరున్నారు..?-private labs business in warangal mgm hospital ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Mgm Hospital : వరంగల్ ఎంజీఎంలో ప్రైవేట్ ల్యాబ్స్ దందా..! తెర వెనక ఎవరున్నారు..?

Warangal MGM Hospital : వరంగల్ ఎంజీఎంలో ప్రైవేట్ ల్యాబ్స్ దందా..! తెర వెనక ఎవరున్నారు..?

HT Telugu Desk HT Telugu
Dec 26, 2024 05:42 PM IST

వరంగల్ ఎంజీఎం వేదికగా ప్రైవేట్ ల్యాబ్ నిర్వాహకలు సరికొత్త దందాకు తెరలేపుతున్నారు. ల్యాబ్ ల నిర్వాహకులు నేరుగా హాస్పిటల్ లోపలున్న వార్డుల్లోకి ఎంటర్ అవుతున్నారు. బ్లడ్ శాంపిల్స్ తీసుకుని టెస్టులకు తరలిస్తున్నారు. ఇదంతా జరుగుతున్నా అధికారుల నుంచి ఎలాంటి స్పందన్న లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

వరంగల్ ఎంజీఎంలో ప్రైవేట్ ల్యాబ్స్ దందా....!
వరంగల్ ఎంజీఎంలో ప్రైవేట్ ల్యాబ్స్ దందా....!

ఉమ్మడి వరంగల్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల నిరుపేదలకు పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ప్రైవేటు ల్యాబ్ల దందా జోరుగా నడుస్తోంది. ఎంజీఎం ఆసుపత్రిలోని ల్యాబ్ సిబ్బంది తో పాటు కొంతమంది పెద్ద డాక్టర్ల సహకారంతో ప్రైవేటు ల్యాబ్ ల నిర్వాహకులు నేరుగా హాస్పిటల్ లోపలున్న వార్డుల్లోకి ఎంటర్ అవుతున్నారు. 

yearly horoscope entry point

ఎంజీఎంలో ల్యాబ్ సౌకర్యాలు సరిగా ఉండవని, రిపోర్టులు సరిగా ఇచ్చే పరిస్థితి కూడా ఉందని పేషెంట్లను మాయ మాటలతో బోల్తా కొట్టిస్తున్నారు. అనంతరం వారి నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని, టెస్టులకు తరలిస్తున్నారు. ఎంజీఎంలో ఉచితంగా చేసే టెస్టులకు కూడా రూ.వెయ్యికి పైగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇదంతా ఎంజీఎం డాక్టర్ల కనుసన్నల్లోనే జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్నేళ్లుగా ఎంజీఎం ఆసుపత్రిలో ప్రైవేటు ల్యాబ్ ల దందా సాగుతుండగా, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, ప్రైవేటు సిబ్బందికే వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

టెస్టుకు వెయ్యికిపైగా వసూలు….

ఎంజీఎం ఆసుపత్రిలో అన్ని రకాల టెస్టులు చేసేందుకు ల్యాబ్ సౌకర్యం అందుబాటులో ఉంది. కానీ ఆయా ల్యాబ్ ల్లో అప్పుడప్పుడు కెమికల్స్ కొరత ఏర్పడి వివిధ టెస్టులకు అంతరాయం ఏర్పడుతోంది. అంతేగాకుండా ఎంజీఎంకు వచ్చే రోగుల తాకిడి దృష్ట్యా అప్పటికప్పుడు రిపోర్టులు అందించడంలో కూడా కొంత ఆలస్యం జరుగుతుంటుంది. దీనిని ఆసరాగా చేసుకుని కొంతమంది ప్రైవేటు ల్యాబుల నిర్వాహకులు ఎంజీఎంలోకి ఎంటరై దందా మొదలు పెడుతున్నారు.
 

ఎంజీఎం హాస్పిటల్ ముందున్న ల్యాబ్ లకు సంబంధించిన సిబ్బంది అన్ని వార్డుల్లో కలియ తిరిగి, ఎవరికైనా టెస్టులు అవసరమేమో కనుక్కుంటున్నారు. అనంతరం వారిని నెమ్మదిగా మాటల్లో పెట్టి ప్రైవేటు ల్యాబుల్లో టెస్టులు చేయించి, వెంటనే రిపోర్టులు కూడా తెచ్చి ఇస్తామంటూ నమ్మబలుకుతున్నారు. దీంతో చేసేదేమీ లేక హాస్పిటల్ లో అడ్మిట్ అయిన రోగులు వారికి శాంపిల్స్ ఇచ్చేందుకు ఒప్పుకుంటున్నారు. 

డాక్టర్లు రాసిన ఏ చిన్న టెస్టు చేసేందుకైనా ప్రైవేటు ల్యాబుల సిబ్బంది రూ.వెయ్యికి పైగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అంతకుమించి కూడా వసూలు చేస్తారని, అక్కడి డాక్టర్లకు నెలవారీగా మామూళ్లు ఇచ్చి ప్రైవేటు ల్యాబ్ ల నిర్వాహకులు ఈ దందా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పట్టించుకోని అధికారులు

ఎంజీఎం ఆస్పత్రిలో ల్యాబ్ సౌకర్యాలు సరిగా ఉండవని, రిపోర్టు సరిగా రాదని ప్రైవేట్ లో చేయించుకోమని పేషెంట్లకు కొంతమంది వైద్యులే ఉచిత సలహాలు ఇస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతోనే పేషెంట్లు ప్రైవేటు ల్యాబ్ ల సిబ్బందికి శాంపిల్స్ ఇస్తున్నట్లు సమాచారం. 

వాస్తవానికి గతం నుంచే ఎంజీఎం ఆసుపత్రిలో ప్రైవేటు ల్యాబ్ ల దందా ఇష్టారీతిన సాగుతోంది. ఈ విషయంపై ఎవరైనా ఫిర్యాదులు చేస్తే తప్ప ఎంజీఎం ఉన్నతాధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఉచిత వైద్యం కోసం ఎంజీఎం కు వస్తున్న నిరుపేదలకు ప్రైవేటు ల్యాబ్ల వ్యవహారంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతుండగా.. ఇకనైనా ఆసుపత్రి ఉన్నతాధికారులు స్పందించి ప్రైవేటు ల్యాబుల దందాకు అడ్డుకట్ట వేయాలని రోగులు, వారి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. 

ఎంజీఎంలో ల్యాబ్ వ్యవస్థను పట్టిష్టం చేయడంతో పాటు ఎప్పటికప్పుడు రిపోర్టులు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరి ఎంజీఎం ఉన్నతాధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటారో.. లేదా ఎప్పటిలాగే ప్రైవేటు ల్యాబ్ నిర్వాహకులకే వత్తాసు పలుకుతారో చూడాలి.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

Whats_app_banner