Mulugu District : ములుగు ఏజెన్సీలో పేలిన ప్రెషర్ బాంబ్ - మావోయిస్టులు అమర్చిందేనా..?
ములుగు ఏజెన్సీ ఏరియాలో ప్రెషర్ బాంబు పేలింది. ఈ ఘటనలో ఓ యువకుడి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో స్థానికంగా ఉన్న గ్రామాలు ఉలిక్కిపడ్డాయి. అయితే పోలీసుల కోసం మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబుగా అనుమానిస్తున్నారు.
ములుగు జిల్లా ఏజెన్సీ ఏరియా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. వెంకటాపురం మండలం వీరభద్రవరం శివారు అటవీ ప్రాంతంలో ప్రెషర్ బాంబు పేలగా, ఈ ఘటనలో వెదురుబొంగుల కోసం వెళ్లిన ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
మరో ముగ్గురు ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా.. క్షతగాత్రుడిని హుటాహుటిన ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా రాష్ట్ర సరిహద్దుల్లో తరచూ ఎన్ కౌంటర్లు జరుగుతున్న సమయంలో ములుగు అటవీ ప్రాంతంలో ప్రెషర్ బాంబు పేలడంతో చుట్టుపక్కల గ్రామాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. స్థానికులు తెలిపిన ప్రకారం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…..
ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన కృష్ణమూర్తి, నర్సింగరావుతో పాటు మరో ఇద్దరు యువకులు శుక్రవారం మధ్యాహ్నం సమయంలో వెదురు బొంగుల కోసమని వీరభద్రవరం గ్రామ శివారులోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. ముత్యంధార జలపాతం సమీపంలోని వెదురు బొంగుల కోసం వెతుకుతూ ఓ కంక పొద వద్దకు చేరుకున్నారు. అక్కడ బొంగులు కోసే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా ప్రెషర్ బాంబు పేలింది. అది పోలీసుల కోసం మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబుగా తెలుస్తుండగా.. ఆ ప్రమాదంలో కృష్ణమూర్తి అనే యువకుడి రెండు కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి.
వీరభద్రవరం వరకు మోసుకొచ్చి..
ప్రెషర్ బాంబు పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన కృష్ణమూర్తి అక్కడికక్కడే కుప్పకూలగా, మిగతా వాళ్లు అదృష్టావశాత్తు క్షేమంగా బయటపడ్డారు. అప్పటికే అటవీ ప్రాంతం మధ్య వరకు వెళ్లగా, కృష్ణమూర్తికి తీవ్ర గాయాలతో రక్త స్రావం జరుగుతోంది. దీంతో మిగతా యువకులు రెండు కాళ్లకు కట్లు కట్టి…. వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. కానీ వారు అటవీ ప్రాంతం మధ్యలో ఉండటంతో కృష్ణమూర్తిని వీరభద్రవరం వరకు మోసుకుని వచ్చారు. అంతకుముందే సమాచారం ఇవ్వడంతో 108 అంబులెన్స్ వీరభద్రవరం గ్రామానికి చేరుకుని ఉండగా…. అందులో కృష్ణమూర్తిని ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గ్రామాల్లో అలజడి.. ఆరా తీస్తున్న పోలీసులు
ములుగు జిల్లా ఏజెన్సీ ఏరియాలో ప్రెషర్ బాంబు పేలడంతో సమీపంలో గ్రామాలన్నీ ఒక్కసారిగా ఉలిక్కి పాటుకు గురయ్యాయి. ఇప్పటికే ఛత్తీస్ గడ్ అడవుల్లో తరచూ జరుగుతున్న ఎన్ కౌంటర్లతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అలజడి చెలరేగుతుండగా, ప్రెషర్ బాంబు ఘటనతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరుగుతుందేమోననే భయాందోళనకు గురయ్యారు. కాగా విషయం ములుగు జిల్లా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లగా.. ప్రెషర్ బాంబు పేలిన ఘటనపై వారు ఆరా తీసే పనిలో పడ్డారు.
కూంబింగ్ కు వచ్చే పోలీసుల కోసమే అక్కడ ప్రెషర్ బాంబు అమర్చినట్లు తెలుస్తుండగా…. సమీపంలో మావోయిస్టు దళాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ మేరకు చుట్టుపక్కల గ్రామాల్లో నిఘా పెంచి, మావోయిస్టుల కదలికలపై ఆరా తీస్తున్నారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి).
సంబంధిత కథనం