Singur Tourism: పర్యాటక కేంద్రంగా సింగూర్‌ ప్రాజెక్టు..ఐలాండ్ అభివృద్ధికి ప్రణాళికలు-preparations underway to operate tourist boats at singur dam ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Singur Tourism: పర్యాటక కేంద్రంగా సింగూర్‌ ప్రాజెక్టు..ఐలాండ్ అభివృద్ధికి ప్రణాళికలు

Singur Tourism: పర్యాటక కేంద్రంగా సింగూర్‌ ప్రాజెక్టు..ఐలాండ్ అభివృద్ధికి ప్రణాళికలు

HT Telugu Desk HT Telugu
Jan 28, 2025 05:52 AM IST

Singur Tourism: సింగూర్ ప్రాజెక్ట్ లో ఉన్న ద్వీపాన్ని అభివృద్ధి చేసి, అక్కడికి 50 సీట్ల కెపాసిటీ ఉన్న రెండు బోట్లు నడిపేందుకు పర్యాటక శాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పర్యాటకులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు ద్వీపం వద్దకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తారు.

సింగూరు ప్రాజెక్టులో పర్యాటక అభివృద్ధికి సన్నాహాలు
సింగూరు ప్రాజెక్టులో పర్యాటక అభివృద్ధికి సన్నాహాలు

Singur Tourism: సంగారెడ్డి జిల్లాలోని పుల్కల్ మండలం లోని సింగూర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. సోమవారం సింగూరు ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో కలిసి మంత్రి క్షేత్రస్థాయి పర్యటన చేశారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు.

yearly horoscope entry point

సింగూర్ ప్రాజెక్టులో 50 సీట్ల కెపాసిటీ తో నడిచే రెండు అధునాతన సౌకర్యాలతో కూడిన బోట్లు ,స్పీడ్ బోట్లను ఏర్పాటు చేయాలని మంత్రి పర్యాటక, నీటిపారుదల శాఖల అధికారులను ఆదేశించారు.

మాస్టర్ ప్లాన్ తయారు చెయ్యండి…

సింగూర్ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా మాస్టర్ ప్లాన్, రోడ్ మ్యాప్ లను రూపొందించాలని మంత్రి టూరిజం, ఇరిగేషన్, ఆర్ అండ్ బి శాఖల అధికారులను ఆదేశించారు. సింగూర్ ప్రాజెక్టులో ఉన్న ఐల్యాండ్ లో వాచ్ టవర్ పైన రెస్టారెంట్, ఫుడ్ కోర్ట్, చిల్డ్రన్ ప్లే ఏరియా, ల్యాండ్ స్కేపింగ్, ఆర్ట్ స్కేపింగ్, గార్డెన్ లను అభివృద్ధి పరచాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టు దిగువ భాగంలో పర్యటకులను ఆకర్షించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.

29 ఎకరాలలో అధునాతనమైన రెస్టారంట్, 25 కాటేజీలు

ప్రాజెక్టు కింది భాగంలోని 29 ఎకరాలలో ఐదు కోట్ల రూపాయలతో అధునాతన రెస్టారెంట్, 25 అధునాతన కాటేజీలు నిర్మించాలని ఇందులో చిల్డ్రన్ ప్లే ఏరియా , ఫుడ్ కోర్ట్, గార్డెనింగ్, గ్రీనరీ, ల్యాండ్ స్కేటింగ్, పార్కింగ్ ఉండేలా అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులు ఆదేశించారు.

నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో సింగూర్ డ్యాం పై భాగంలో బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలన్నారు. పర్యటకుల సౌకర్యం కోసం డ్యాం పై వెళ్లడానికి అవసరమైన మెట్ల నిర్మాణం డ్యాం బండ్ వెంట పార్కు అభివృద్ధి సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రాజెక్టు పరిసరాలలో సెంట్రల్ లైటింగ్ కు అవసరమైన ప్రతిపాదనలను ఫిబ్రవరి మొదటి వారం లోపు రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

సింగూరు ప్రాజెక్టుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంతో పాటు ఇరుగుపొరుగు రాష్ట్రాల పర్యాటకులు సింగూరు ప్రాంతం కు వచ్చేలా వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. సింగూర్ ప్రాజెక్టుకు వచ్చే పర్యాటకు లకు అధునాతన వసతులతో కూడిన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

నాలుగు వరుసల రోడ్డు నిర్మించండి..

పర్యాటకులకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు ప్రాజెక్టు దిగువ భాగంలో, ఐలాండ్‌లో ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ప్రాజెక్టుకు వచ్చే పర్యాటకుల సౌలభ్యం కోసం అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన పెద్దపీట వేయాలని దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.

ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో పెద్దారెడ్డిపేట ఎక్స్ రోడ్డు నుండి సింగూర్ డ్యాం వరకు రహదారులుగా విస్తరణ చేపట్టాలని రహదారి వెంట అధునాతన లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు.

Whats_app_banner