TG Localbody Elections: తెలంగాణలో స్థానిక సమరానికి సన్నద్దం...నేడు ఓటర్ల జాబితా ప్రదర్శన..
TG Localbody Elections: తెలంగాణ ప్రభుత్వం స్థానిక సమరానికి సిద్ధమయ్యింది. ఎన్నికల ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న తరుణంలో అందుకు తగ్గ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.

TG Localbody Elections: స్థానిక సమరంలో ముందుగా మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల వివరాలపై దృష్టి సారించారు.
ఇప్పటికే గ్రామపంచాయతీల వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధమయ్యే నాటికి వచ్చిన అదనపు ఓటర్లను కూడా చేర్చి జాబితాలు రూపొందించారు. నేడు ఎంపీటీసీల వారీగా ఆయా గ్రామాలలో మండల, జిల్లా పరిషత్ లో ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తున్నారు. ఈ జాబితాను బరిలోకి దిగే అభ్యర్థులు పరిశీలించుకునే వీలుంటుంది.
ఈనెల 11న పోలింగ్ కేంద్రాలను వెల్లడిస్తారు. 12, 13న పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన అభ్యంతరాలు స్వీకరించి అవసరమైన చేర్పులు, మార్పులు చేపడుతారు. 13న పరిషత్ ఎన్నికలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు తీసుకుంటారు. కేంద్రాల విషయంలో వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటారు.14న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి అనుమతి తీసుకుంటారు. 15న తుది ఓటరు జాబితా ప్రకటిస్తారు.
పార్టీ గుర్తులతోనే ఎన్నికలు...
ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు జరిగే ఎన్నికలలో రాజకీయ పార్టీల గుర్తులతోనే ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల తేదీ ప్రకటించే ముందే ఆయా రాజకీయ పార్టీలు కూడా సన్నద్ధ మవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎన్నికల నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు. మరో వైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించే నాటికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు సమాచారం.
ఎన్నికల సరంజామా సిద్దం...
ఎన్నికల నిర్వహణకు కీలకమైన పోలింగ్ స్లిప్పులు, కరపత్రాలు, స్టేషనరీ, తదితర సామగ్రి సేకరణ కోసం అన్ని జిల్లాల కలెక్టర్ లు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు అవసరమైన స్టేషనరీ, కరపత్రాలు, పోల్ స్లిప్పులు తదితరాల ముద్రణ కోసం టెండర్లు పిలిచారు. జగిత్యాల, సిరిసిల్లలో టెండర్ల ప్రక్రియ ముగిసింది.
బ్యాలెట్ల ముద్రణ 90 శాతం కన్నా అధికంగా పూర్తయింది. పెద్దపల్లి జిల్లాలో 100 శాతం పూర్తయిందని అధికారులు తెలిపారు. ఇక కరీంనగర్ జిల్లాలో ఈ ప్రక్రియ టెండర్ల దశలో ఉంది. మరో వారం పది రోజుల్లో సామగ్రి తమచేతికి అందుతుందని కరీంనగర్ జిల్లా అధికారులు తెలిపారు.
15 తర్వాత షెడ్యూల్...
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఈనెల 15 తర్వాత ఎప్పుడైనా వెలువడే అవకాశం ఉంది. అందుకు సంబంధించిన ప్రక్రియ చేపట్టిన ప్రభుత్వం, తొలుత పార్టీ గుర్తులతో మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు ఆనంతరం పార్టీ గుర్తులు లేకుండా జరిపే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుంది. ఇటీవల ప్రభుత్వం పూర్తి చేసిన కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ అనంతరం రిజర్వేషన్లు కూడా పెరుగుతాయని పోటీ చేసే అభ్యర్థులు కొండంత ఆశలు పెట్టుకున్నారు.
ప్రస్తుతం 28 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతారని ప్రచారం జరుగుతోంది. అయితే, అది చట్టరూపం దాలిస్తేనే సాధ్యమవుతుంది. అది సాకారమైతే.. ఈసారి బరిలో దిగే బీసీ అభ్యర్థులు భారీగా పెరిగే అవకాశముంది. మొత్తానికి రిజర్వేషన్ల మాట ఎలా ఉన్నా.. స్థానిక సంస్థలకు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు కలెక్టర్ లు, అదనపు కలెకర్ లు (స్థానిక సంస్థల) తమ ఏర్పాట్లలో తలమునకలయ్యారు.
గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, సిబ్బంది, ఆర్వోల నియామకం, బ్యాలెట్ పేపర్ల ముద్రణ తదితర ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఆయా విషయాలపై ఇప్పటికే అధికారులతో సమావేశాలు జరిపి పురోగతి తెలుసుకుంటున్నారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)