IIT Campus: హనుమకొండ జిల్లాలో బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్, వంద ఎకరాల్లో ఏర్పాటుకు సన్నాహాలు-preparations are underway to set up a triple it campus in basara ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Iit Campus: హనుమకొండ జిల్లాలో బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్, వంద ఎకరాల్లో ఏర్పాటుకు సన్నాహాలు

IIT Campus: హనుమకొండ జిల్లాలో బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్, వంద ఎకరాల్లో ఏర్పాటుకు సన్నాహాలు

Sarath Chandra.B HT Telugu
Published Mar 14, 2025 11:33 AM IST

IIT Campus: బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ విస్తరణకు అడుగులు పడుతున్నాయి.ప్రస్తుతం నిర్మల్ జిల్లా బాసరలో ఈ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఉండగా, ఆ క్యాంపస్ ఎక్స్ టెన్షన్ కు ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు హనుమకొండ జిల్లాలో దానిని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.

హనుమకొండలో ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ ఏర్పాటుకు సన్నాహాలు
హనుమకొండలో ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ ఏర్పాటుకు సన్నాహాలు

IIT Campus: హన్మకొండలో ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాాయి. జిల్లాలోని ఎల్కతుర్తి మండల కేంద్రంలోనే క్యాంపస్ ఏర్పాటుకు నిర్ణయించారు. అందుకు అవసరమైన స్థలాన్ని పరిశీలించే పనిలో పడ్డారు. కాగా ఇన్నిరోజులు కేవలం బాసరలోనే ట్రిపుల్ ఐటీ ఎడ్యుకేషన్ అందుబాటులో ఉండగా.. ఇప్పుడు మరో క్యాంపస్ ఏర్పాటుతో మరిన్ని సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఎల్కతుర్తిలో.. వంద ఎకరాల్లో క్యాంపస్

ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ను చుట్టుపక్కల జిల్లాలకు అనుకూలంగా ఉండేలా హనుమకొండ జిల్లా పరిధిలోని ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాలకు జంక్షన్ గా ఉండటం, విద్యార్థులకు కూడా సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో ఎల్కతుర్తిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

కాగా ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు మొదట 50 ఎకరాల వరకు భూమిని కావాలని ప్రతిపాదించారు. కానీ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అదనంగా మరో 50 ఎకరాలు తీసుకోనున్నారు. దీంతో వంద ఎకరాల సువిశాల స్థలంలో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఏర్పాటు కానుంది.

స్థలాన్ని పరిశీలించిన ఆఫీసర్లు

ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఎక్స్ టెన్షన్ కోసం బాసర ట్రిపుల్ ఐటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ గోవర్ధన్, హైదరాబాద్ జేఎన్టీయూ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ గురువారం సాయంత్రం హనుమకొండ జిల్లాకు వచ్చారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎ.వెంకట్ రెడ్డి, హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేశ్, తహసీల్దార్ జగత్ సింగ్, స్థానిక అధికారులతో కలిసి ప్రతిపాదిత ఎల్కతుర్తి మండల కేంద్రాన్ని పరిశీలించారు.

ఇక్కడ క్యాంపస్ ఏర్పాటుకు అనువుగా ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలించి, హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ ప్రావీణ్యతో సమావేశం అయ్యారు. ట్రిపుల్ ఐటీ ఎక్స్ టెన్షన్ క్యాంపస్ ఏర్పాటు విషయాన్ని కలెక్టర్ కు వివరించారు. ఎల్కతుర్తిలో గుర్తించిన భూముల గురించి కలెక్టర్ తో సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ట్రిపుల్ ఐటీ క్యాంపస్ విస్తరణకు స్థలం అప్పగించాల్సిందిగా కోరారు.

దీంతో కలెక్టర్ ప్రావీణ్య ప్రభుత్వ భూముల గురించి, ఎల్కతుర్తి మండల అధికారులు, అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డితో చర్చించారు. క్యాంపస్ ఏర్పాటుకు స్థలాలు అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. కాగా రెండేళ్లలోనే క్యాంపస్ ను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. ఇదిలాఉంటే తొందర్లోనే హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ అందుబాటులోకి రానుండటంతో రాష్ట్రంలో మరిన్ని సీట్లు పెరగనున్నాయి. దీంతో మరింత మంది విద్యార్థులకు సాంకేతిక విద్య చేరువ కానుంది.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్థాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. ఈనాడు, ఎన్టీవి, టీవీ9, హెచ్‌ఎంటీవి, ఎక్స్‌ప్రెస్‌ టీవీ, టీవీ5లలో పని చేశారు. 2010-14 మధ్యకాలంలో హెచ్‌ఎంటీవీ, మహా టీవీలో ఢిల్లీ బ్యూరో చీఫ్‌/అసిస్టెంట్‌ ఎడిటర్‌గా పనిచేశారు. నాగార్జున వర్శిటీ క్యాంపస్ కాలేజీలో జర్నలిజంలో పట్టభద్రులయ్యారు. 2022లో హెచ్‌టీలో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం