హైదరాబాద్, జూలై 1: సంగారెడ్డి జిల్లాలోని సిగాచి ఇండస్ట్రీస్ ప్లాంట్‌లో జరిగిన విధ్వంసకర పేలుడు తర్వాత బీహార్‌కు చెందిన పూజా కుమారి తీవ్ర వేదనతో ఎదురుచూస్తోంది. ఏడు నెలల గర్భిణి అయిన పూజా కుమారి ఈ ఘటనలో గల్లంతైన తన నలుగురు కుటుంబ సభ్యులు భర్త, ఇద్దరు బాబాయిలు, సోదరుడి గురించిన సమాచారం కోసం ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పేలుడు జరిగిన ప్రదేశంలో అధికారులను తన కుటుంబ సభ్యుల గురించి ఏదైనా సమాచారం చెప్పమని వేడుకుంటోంది. కానీ ఇప్పటి వరకు ఆమె అభ్యర్థనలకు ఎటువంటి జవాబు రాలేదు.
"మేం ఆసుపత్రులకు వెళ్లి వెతికాం. కానీ వారిని కనుగొనలేకపోయాం. మేము బీహార్ వాసులం. అతను (భర్త) సోమవారం ఉదయం 8 గంటలకు డ్యూటీకి వచ్చాడు" అని ఆమె పీటీఐతో ఆవేదన వ్యక్తం చేసింది. ఈ దంపతులకు మూడు సంవత్సరాల క్రితం వివాహం కాగా, వారికి ఒకటిన్నర సంవత్సరాల కుమారుడు ఉన్నాడు.
పూజా భర్త నాగ పాస్వాన్, సోదరుడు దీపక్ పాస్వాన్, బాబాయిలు దిలీప్ గోసాని, దబ్లు.. వీరంతా సిగాచి ఫార్మాస్యూటికల్ యూనిట్‌లో పనిచేస్తున్న సమయంలోనే ఈ పేలుడు సంభవించింది. ఒక ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ, ఆమె భర్తను కనుగొనే బాధ్యత కంపెనీదేనని నొక్కి చెప్పారు. "ఆమె తన కొడుకును చేతుల్లో పట్టుకుని ఇక్కడ కూర్చుని ఏమి చేయగలుగుతుంది?" అని ప్రశ్నిస్తూ, కంపెనీ ఆమెకు సహాయం చేయాలని డిమాండ్ చేశారు.
సోమవారం ప్లాంట్‌లో జరిగిన ఈ ఘోర పేలుడులో 36 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఇప్పటివరకు కేవలం తొమ్మిది మృతదేహాలను మాత్రమే గుర్తించినట్లు రెవెన్యూ శాఖ అధికారి ఒకరు తెలిపారు. మిగిలిన మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు చేయాల్సి ఉందని ఆయన చెప్పారు. మృతి చెందిన వారిలో ఎక్కువ మంది ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్ వంటి రాష్ట్రాలకు చెందిన వారే.