ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. క్యాన్సర్, లంగ్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నానని పిటిషన్‌లో వివరించారు. చికిత్స కోసమే అమెరికాకు వెళ్లినట్టు ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. తననునిందితుడిగా చేర్చడానికి ముందే అమెరికా వెళ్లినట్టు చెప్పారు. తాను పారిపోయానని ముద్ర వేయడం సరికాదన్న ఎస్ఐబీ మాజీ చీఫ్.. తనకు వ్యతిరేకంగా ఒక్క ఆధారమూ లేదని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని ఎస్ఐబీ కేంద్రంగా విచ్చలవిడిగా ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేశారని.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో 2023 మార్చి 10న కేసు నమోదైంది. ప్రతిపక్ష నాయకులు, వ్యాపారవేత్తలు, ఇతర ముఖ్యమైన వ్యక్తుల ఫోన్లను ప్రభాకర్ రావు, అతని బృందం అక్రమంగా ట్యాప్ చేశారని ఆరోపణలు వచ్చాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ట్యాపింగ్ జరిగిందని, దీని ద్వారా సేకరించిన సమాచారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఉన్నాయి.
ప్రభాకర్ రావు అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) చీఫ్‌గా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కార్యకలాపాలను ప్రభాకర్ రావు నేతృత్వంలోని బృందం నిర్వహించిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో డీఎస్పీ ప్రణీత్ రావును అరెస్టు చేయడంతో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు దేశం విడిచి వెళ్లిపోయారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రభాకర్ రావును రప్పించడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. ప్రభాకర్ రావు హైకోర్టును ఆశ్రయించారు.
ఫోన్ ట్యాపింగ్ చట్టవిరుద్ధం. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఉంది. భారత టెలిగ్రాఫ్ చట్టం, 1885లోని సెక్షన్ 5(2) ప్రకారం.. దేశ భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చు. అయితే.. దీనికి ఉన్నత స్థాయి అధికారుల అనుమతి తప్పనిసరి. వ్యక్తిగత కారణాలతో ఫోన్ ట్యాపింగ్ చేయడం చట్టవిరుద్ధం. భారత టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 26 (బి) ప్రకారం.. ఫోన్ ట్యాపింగ్‌కు గరిష్ఠంగా మూడేళ్ల వరకూ జైలు శిక్ష విధించవచ్చు.
ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఫోన్ కాల్స్‌ను వినడం, రికార్డ్ చేయడం, అలాగే ఇతర డేటాను సేకరించడం వంటివి చేస్తారు. ఫోన్ ట్యాపింగ్‌లో ఏదైనా మొబైల్ నెంబర్ పై నిఘా పెట్టాలనుకుంటే.. ఆ నెంబర్ ఇన్ కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్‌ను సాఫ్ట్ వేర్‌ల ద్వారా వింటుంటారు. దేశ భద్రతకు ముప్పు కలిగించే సందర్భాల్లో, నేర పరిశోధనలో భాగంగా, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా.. ట్యాపింగ్ చేస్తారు. కానీ.. తెలంగాణలో మాత్రం రాజకీయ లబ్ధి కోసం ట్యాపింగ్ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.
సంబంధిత కథనం