తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మౌనం ఇప్పుడు అనేక ప్రశ్నలకు దారి తీస్తోంది. ఆయన నిర్ణయాల్లోని ఊగిసలాట, స్పష్టత లేకపోవడం వల్ల పార్టీ శ్రేణులు మూడు గ్రూపులుగా విడిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావు, కూతురు కవిత - ఈ ముగ్గురికీ పార్టీలో సొంత బలగాలున్నాయి. నిజానికి, ఈ మూడు శక్తులు కలిసికట్టుగా ఉంటేనే బీఆర్ఎస్ బలంగా ఉంటుంది. కానీ, ప్రస్తుత పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వాన్ని సమర్థంగా ఎదుర్కొని పార్టీని పటిష్టపరచాల్సిన సమయంలో, అంతర్గత గ్రూపు రాజకీయాలతో బీఆర్ఎస్ బలహీనపడుతోంది.
ఇటీవలే కవిత రాసిన ఒక లేఖ బహిర్గతం కావడంతో పార్టీలోని విభేదాలు రచ్చకెక్కాయి. బీఆర్ఎస్ లో ఏదో జరుగుతోందనే వార్తలు, కథనాలు మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. పార్టీలో ఈ విభేదాలను నిలువరించడం పార్టీ పెద్దగా కేసీఆర్ కే సాధ్యం. ఆయన చొరవ తీసుకుంటేనే ఈ పరిస్థితికి ముగింపు పడుతుంది. లేదంటే, ఈ అంతర్గత కలహాలు పార్టీని పూర్తిగా ముంచే ప్రమాదం ఉంది.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం తర్వాత పార్టీ గాడి తప్పినట్లు, అంతర్గత లుకలుకలు బయటపడినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్యనే ఆధిపత్య పోరు నడుస్తుండడంతో పార్టీలోని కీలక నేతలతో సహా కార్యకర్తలు అయోమయంలో పడిపోయారు. కవిత రాసిన లేఖ ఈ గ్రూపు తగాదాలకు కొత్త మలుపునిచ్చింది. కవిత అమెరికా పర్యటనకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో నాటకీయంగా ఈ లేఖ లీక్ కావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ లీకు వెనుక ఎవరున్నారనేది పక్కన పెడితే, అసలు కవిత పార్టీకి సంబంధించిన అంశాలపై లేఖ రాయాల్సినంత తీవ్రమైన పరిస్థితులు బీఆర్ఎస్ లో ఏర్పడ్డాయనేదే ఇక్కడ కీలకం. ఈ లేఖ తానే రాశానని కవిత స్వయంగా అంగీకరించడం పార్టీలో విభేదాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో తెలియజేస్తోంది.
పార్టీ బలోపేతం కోసమే తాను ఈ లేఖ రాశానని కవిత చెప్పినప్పటికీ, దీనికి మీడియాలో, సోషల్ మీడియాలో లభించినంత విస్తృతమైన చర్చ క్షేత్రస్థాయిలో జరగలేదు. ప్రజలు కూడా ఇదంతా ఒక కుటుంబ డ్రామాగానే ఉందని, కేసీఆర్ జోక్యం చేసుకుంటే అంతా సమిసిపోతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో కూడా కవితకు ఆశించిన మద్దతు లభించలేదు. ఈ లేఖ వెనుక అదృశ్య శక్తులు ఉన్నాయనే అభిప్రాయం బీఆర్ఎస్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
ఎయిర్‌పోర్ట్‌లో కవిత విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని చెప్పడంపై పార్టీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. ఎయిర్‌పోర్ట్‌లో ‘కవిత సీఎం సీఎం’ అంటూ ఆమె అనుచరులు చేసిన నినాదాలను కవిత వారించి ఉంటే, ఆమె కేసీఆర్‌ను ధిక్కరించలేదనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో కలిగి, ఆమెకు కొంత మద్దతు లభించేది.
లేఖ ఎపిసోడ్ కంటే ముందు కవిత మే 1న కార్మిక దినోత్సవం రోజున ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భవించినా సామాజిక తెలంగాణ ఏర్పడలేదని వ్యాఖ్యానించడం ఆమె పార్టీలో అసంతృప్తిగా ఉన్నారనే సందేశాన్నిచ్చింది. కవిత పలు దఫాలుగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నా కేసీఆర్ పట్టించుకోకపోవడంతోనే పరిస్థితులు లేఖ వరకు వచ్చాయని అర్థమవుతోంది.
పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా బయట మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తీసుకునే కేసీఆర్ ఇప్పుడు కుటుంబ సభ్యులే గొంతు విప్పితే ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. లేఖ కంటే ముందు తాను పలు నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీ పరిస్థితులు తెలుసుకున్నానని, పార్టీలో నాకు వ్యతిరేకంగా కొందరు పనిచేస్తున్నారని కవిత ఆరోపించారు. ఆ వెంటనే హరీశ్ రావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసీఆర్ ఆదేశిస్తే కేటీఆర్ నాయకత్వంలో కూడా పనిచేయడానికి తాను సిద్ధమని ప్రకటించారు. ఆ వెంటనే కేటీఆర్ హరీశ్ రావు ఇంటికెళ్లడం, హరీశ్ రావు కేసీఆర్ ఫామ్ హౌస్ వెళ్లడం జరిగాయి. ఈ పరిణామాలతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోగా పార్టీలో ఏదో కీలక నిర్ణయం జరగబోతుందనే సంకేతాలు వెలువడ్డాయి. అంతేకాక కవిత చేసిన వ్యాఖ్యలను కూడా కేసీఆర్ పట్టించుకోలేదని ఈ భేటీల వల్ల అర్థమైంది. పార్టీలో కూడా కవిత వ్యాఖ్యలపై మద్దతు లభించలేదు.
బీఆర్ఎస్ లో కేటీఆర్, కవిత, హరీశ్ మధ్య ఆధిపత్య పోరుపై భిన్నమైన అభిప్రాయాలున్నాయి. కేటీఆర్ ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండడంతో పార్టీలో ఆయనది ప్రత్యేక స్థానం. ఇదే సమయంలో పార్టీలో హరీశ్ రావుకు కూడా కీలక ప్రాధాన్యతే ఉంది. ఉద్యమ సమయం నుంచి పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న హరీశ్ రావుపై ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే బాగుంటుందనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో ఉంది. పార్టీలో కుటుంబ సభ్యుల మధ్యే పోరు నడుస్తుండడంతో కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని పార్టీ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
వారసులుగా తనయులకే పెద్దపీట వేయడం చరిత్ర చెబుతున్న సత్యం. పార్టీలో ప్రస్తుత పరిణామాలతో కవిత కంటే, హరీశ్ నుంచే తనయుడు కేటీఆర్ కు పోటీ ఉందని కేసీఆర్ కు తెలుసని ఆయన తీసుకున్న అనేక నిర్ణయాలు స్పష్టం చేస్తున్నాయి. పార్టీని స్థాపించిన నాటి నుంచి హరీశ్ ఉద్యమ నాయకుడిగా, అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం కేసీఆర్ మేనల్లుడు అనే ముద్ర తనపై పడకుండా, ఒక మాస్ లీడర్ గా మన్ననలు పొందారు. గ్రామీణ ప్రాంతాలలో కేటీఆర్ కంటే హరీశ్ కే ఎక్కువ ఆదరణ ఉందనడంలో అతిశయోక్తి లేదు.
హరీశ్ బలమేంటో, తనయుడి బలహీనత ఏంటో బాగా తెలిసిన కేసీఆర్ కొడుకు కేటీఆర్ ను ఒక మెట్టు ఎక్కించడానికి, మేనల్లుడు హరీశ్ ను ఒక మెట్టు దించే ప్రయత్నాలు గతంలో అనేకసార్లు చేశారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ విజయం సాధించిన తర్వాత హరీశ్ కి మంత్రి పదవి ఇవ్వకుండా దూరం పెట్టారు. దీంతో ఆయన సిద్దిపేటకే పరిమితమయ్యారు. ఆ తర్వాత ఏకపక్షంగా కేటీఆర్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టారు.
అప్పుడు కూడా కేటీఆర్ నాయకత్వంలో పని చేయడానికి తాను సిద్ధమని హరీశ్ తన విధేయతను ప్రకటించారు. అనంతరం ఇంటా బయట తీవ్ర ఒత్తిడి రావడంతో హరీశ్ కి మంత్రి పదవి ఇచ్చినా... అంతకు ముందు నీటిపారుదల మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్న హరీశ్ కు ఆ శాఖ కాకుండా ఆరోగ్య శాఖ బాధ్యతలు ఇచ్చారు. పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీశ్ కు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, ఇతర ఉప ఎన్నికల్లో ప్రాధాన్యత తగ్గించడంతో అప్పుడు బీఆర్ఎస్ బలహీనపడగా, బీజేపీ బలపడింది.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేస్తే... హరీశ్ మెదక్ జిల్లాకే పరిమితమయ్యారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగింది. ఇటీవల పార్టీ రజతోత్సవ సభ కోసం ముందుగా హరీశ్ రావుని ఇంచార్జ్ గా ప్రకటించారు. ఆయన వెళ్లి ఒక స్థలాన్ని కూడా ఎంపిక చేశారు. కానీ, ఇంతలోనే ఆ బాధ్యతను కేటీఆర్ కి అప్పగించడంతో ఆయన మరో స్థలాన్ని ఎంపిక చేశారు. తర్వాత వేదికపై వేసిన పోస్టర్లలోనూ కేసీఆర్, కేటీఆర్ ఫొటోలే కనిపించాయి. ఇవన్నీ పార్టీలో కేటీఆర్ ప్రాధాన్యతను పెంచడానికే అన్న సంకేతాలు క్యాడర్ లోకి వెళ్లాయి. అయినా హరీశ్ దీనిపై కవితలాగా తన అసంతృప్తిని బయట పడనీయలేదు.
ఇక, కవిత ఎదురు తిరగడానికి అనేక కారణాలున్నాయి. తనను లిక్కర్ కేసులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అరెస్టు చేస్తే కేసీఆర్ ఆ పార్టీపై వెనకడుగు వేస్తున్నారనే అభిప్రాయం కవితలో ఏర్పడింది. రజతోత్సవ సభలో కేసీఆర్ బీజేపీపై తేలికపాటి విమర్శలు చేయడం వల్ల పార్టీపై ప్రజల్లో అనుమానాలు పెరిగాయని ఆమె తండ్రికి రాసిన లేఖలో చెప్పడానికి ఇదే ప్రధాన కారణం. రాజకీయంగా బీజేపీ కోసం తనను బలిపశువు చేశారనే ఆగ్రహం ఆమెలో ఉంది. తనను అరెస్టు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించిన పార్టీ తాను జైలు పాలైనా పట్టించుకోలేదనే బాధా కవితలో ఉంది.
ఈ నేపథ్యంలో లిక్కర్ స్కాంలో జైలు నుంచి వచ్చిన తర్వాత కవిత ఇంటికే పరిమితం అవుతారని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తే ఆమె సామాజిక తెలంగాణ నినాదంతో ప్రజల్లోకి వచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర గేయంపై ఆమె తెలంగాణ జాగృతి తరఫున పలు నిరసనలు చేపట్టినా పార్టీ నుండి ఆమెకు మద్దతు లభించలేదు. దీనికి కేసీఆర్, కేటీఆర్ కారణమని భావన ఆమెలో ఏర్పడింది.
పార్టీలో తనకు ప్రాధాన్యతనివ్వడం లేదని అసంతృప్తితో కవిత 'డియర్ డాడీ' అంటూ లేఖ రాసి అందులో రజతోత్సవ సభలో కేసీఆర్ 42 శాతం రిజర్వేషన్లు, వక్ఫ్ సవరణ చట్టం అంశాలను ప్రస్తావించకపోవడం, సభలో ఉర్దూలో మాట్లాడకపోవడం, వేదికపై పార్టీలో మొదటి నుండీ ఉద్యమకారులకు ప్రాధాన్యతనివ్వకపోవడం వంటి అంశాలను పేర్కొన్నారు. ఇవి సామాజిక అంశాలైనా వీటిపై పార్టీలో కానీ, ప్రజా సంఘాల నుండి కానీ, మీడియాలో కానీ కవితకు ఆశించిన మద్దతు రాలేదు. పార్టీలోని అంతర్గత విభేదాలతోనే ఆమె లేఖ రాశారనే అభిప్రాయంతో వీటిని ఎవరూ పట్టించుకోలేదు.
కవిత తన లేఖతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు అస్త్రాన్ని అందించినట్టయిందనే అభిప్రాయం పార్టీ నాయకుల్లో, శ్రేణుల్లో ఉంది. అందుకే పార్టీలోని పెద్ద నేతలెవరూ ఆమెను సమర్థించలేదు. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ముందుకు రాలేదు. త్వరలో తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కవిత వెంట వెళ్లేందుకు పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు సాహసించరు. బీఆర్ఎస్ లో ఉంటేనే ప్రయోజనమని భావిస్తారు. ఈ నేపథ్యంలో ఒకవేళ కవిత భవిష్యత్తులో వేరు కుంపటి పెట్టినా పార్టీలో చీలిక తేవడం సాధ్యం కాదు.
కవితకు పార్టీ తరఫున ఏ స్థాయి నుండైన మద్దతు రాకుండా చేయడంలో కేసీఆర్ సఫలమయ్యారనే చెప్పవచ్చు. అయితే స్వయానా కూతురే ధిక్కరించడమే ఆయనకు ప్రతికూల అంశం. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ తో కానీ, పార్టీతో కానీ విభేదించిన వారిపై క్రమశిక్షణలో భాగంగా నోటీసులిచ్చి పార్టీ నుండి వెళ్లిపోయేలా చేశారు. ఇప్పుడు కేసీఆర్ కవిత విషయంలో ఏమి చేస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేసీఆర్ స్వయంగా చొరవ తీసుకుంటే పార్టీలో సమస్యలన్నీ సమసిపోతాయని పార్టీ వర్గాలు విశ్వాసంతో ఉన్నాయి.
పార్టీలో ఇంత గందరగోళానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత ఎవరు అనే అనవసర ప్రశ్న రావడమే. పార్టీ రజతోత్సవ సభను కూడా అంతా తానై నడిపించిన కేసీఆర్ పై ఇలాంటి సందేహాలు రావడం పార్టీకి కీడు చేస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకైనా పార్టీలో ఇలాంటి ప్రశ్నలు మళ్లీ తలెత్తకుండా కేసీఆర్ మౌనం వీడి కచ్చితమైన సందేశాన్ని పార్టీకి ఇస్తే బీఆర్ఎస్ కు అదే శ్రీరామరక్ష.
-జంపాల ప్రవీణ్,
రీసెర్చర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ.
(డిస్‌క్లెయిమర్: వ్యాసంలో తెలిపిన అభిప్రాయాలు, విశ్లేషణలు రచయిత వ్యక్తిగతం. హిందుస్తాన్ టైమ్స్‌వి కావు)