Power demand in Telangana : రాష్ట్రంలో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం.. కారణం ఇదే !-power demand in telangana goes up due to paddy cultivation ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Power Demand In Telangana Goes Up Due To Paddy Cultivation

Power demand in Telangana : రాష్ట్రంలో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం.. కారణం ఇదే !

HT Telugu Desk HT Telugu
Dec 27, 2022 01:25 PM IST

Power demand in Telangana : తెలంగాణలో విద్యుత్ డిమాండ్ పెరిగింది. వరినాట్లు జోరందుకోవడంతో విద్యుత్ మోటార్ల వినియోగం పెరిగి.. డిమాండ్ అధికమైంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా డిసెంబర్ నెలలో ఈ స్థాయి డిమాండ్ రావడం గమనర్హాం.

తెలంగాణలో పెరిగిన విద్యుత్ వినియోగం
తెలంగాణలో పెరిగిన విద్యుత్ వినియోగం

Power demand in Telangana : Telangana Power Demand : రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. గతంలో ఎన్నడూ లేనంతగా డిసెంబర్ నెలలో అత్యధిక డిమాండ్ ఏర్పడింది. సహజంగా చలి కాలంలో విద్యుత్ వినియోగం తగ్గుతుంది. ఎక్కువ మంది ఫ్యాన్లు, ఏసీలు వినియోగించరు. దీంతో.. డిమాండ్ పడిపోతుంది. ఇందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తారు. లోడ్ డిస్పాచ్ లో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే... ఇందుకు విరుద్ధంగా ఈ సారి తెలంగాణలో డిసెంబర్ లోనే రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం పెరిగింది. రాష్ట్రంలో ఎక్కువ మంది రైతులు ముందస్తుగా వరినాట్లు వేయడంతోనే ఇంత విద్యుత్ డిమాండ్ ఏర్పడిందని అధికారులు అంటున్నారు. ఈ కారణంగానే ఫిబ్రవరి నెలలో నమోదు కావాల్సిన డిమాండ్... డిసెంబర్ లో వచ్చిందని వివరిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

సోమవారం ఉదయం 10.28 గంటల సమయంలో 13,081 మెగావాట్లకు చేరిన రాష్ట్రవిద్యుత్ డిమాండ్... మంగళవారం ఉదయం 7.58 గంటలకు 13,403 మెగావాట్లకు పెరిగింది. గతేడాది ఇదే సమయానికి 9,167 మెగావాట్లు ఉండటం గమనార్హం. డిస్కమ్ వారీగా చూస్తే.... సోమవారం దక్షిణ డిస్కమ్ (SPDCL)లో 8,175 మెగావాట్లు రికార్డవగా.. గతేడాది ఇదే రోజున 6,076 మెగావాట్లుగా ఉంది. ఉత్తర డిస్కమ్ (NPDCL)లో సోమవారం 4,661 మెగావాట్ల డిమాండ్ రాగా... గతేడాది 3,483 మెగావాట్లుగా రికార్డయింది. నిరంతరం నాణ్యమైన విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పెరిగిన సాగు విస్తీర్ణం కారణంగా... రాష్ట్రంలో విద్యుత్ వినియోగంలో అధిక వాటా వ్యవసాయ రంగానిదే ఉంటోందని... వరి నాట్లు పెరగడం వల్ల ఒక్కసారిగా డిమాండ్ అధికమైందని అధికారులు వివరిస్తున్నారు. ఈ సారి వేసవికాలంలో 15 వేల మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చే అవకాశం ఉందని... అయినప్పటికీ ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామంటున్నారు.

రాష్ట్రంలో యాసంగి పంటకి సంబంధించి డిసెంబర్ చివరి వారంలో వరి నాట్లు జోరందుకున్నాయి. సాధారణంగా ప్రతి సంవత్సరం సంక్రాంతి తర్వాత నాట్లు వేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే.. ఈ సారి రాష్ట్రంలో చాలా చోట్ల రైతులు ముందస్తుగా వరి నాట్లకు శ్రీకారం చుట్టారు. రానున్న రెండు వారాల్లో నాట్లు ఇంకా పెరగనున్నాయి. గతేడాది యాసంగి సమయంలో ప్రభుత్వం వరి సాగుని నియంత్రించింది. ధాన్యం కొనుగోళ్లపై సందిగ్ధత కారణంగా.. రైతులు వరి సాగు చేయవద్దని సూచించింది. దీంతో.. గతేడాది యాసంగిలో 35 లక్షల ఎకరాల్లోనే రైతులు వరి సాగు చేశారు. ఈ సారి అప్పటి పరిస్థితులు లేకపోవడంతో.. ఈ సారి 50 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో... రానున్న రోజుల్లో విద్యుత్ డిమాండ్ మరింతగా పెరగనుంది.

WhatsApp channel