TS Maoist Posters: పేదల భూములు తిరిగి ఇచ్చేయాలంటూ మావోయిస్టుల పోస్టర్లు… సిద్దిపేటలో పోస్టర్ల కలకలం
TS Maoist Posters: పేదల భూముల్ని తిరిగి ఇచ్చేయాలంటూ మావోయిస్టుల హెచ్చరికలతో కూడిన పోస్టర్లు సిద్దిపేట Siddipetలో కలకలం రేపాయి.
TS Maoist Posters: పేదల భూములు వారిక తిరిగి ఇవ్వాలంటూ సిద్దిపేటలో కార్పొరేట్ కంపెనీకి వ్యతిరేకంగా మావోయిస్టు పోస్టర్లు, వాల్ రైటింగ్స్ వెలిశాయి.
మండలంలోని పెద్ద మాసాన్పల్లి లోని హెటిరో డ్రగ్స్ hetero Drugs కంపెనీకి చెందిన భూములలో మావోయిస్టు పార్టీ పేరున వెలసిన వాల్ రైటింగ్స్, బ్యానర్ కలకలం రేపాయి. ఈ ప్రాంతంలో హెటిరో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం 2007 నుండి పెద్ద మాసాన్పల్లి, కొండపాక మండలం లోని సిర్సినగండ్ల గ్రామాల పరిధిలో 380 ఎకరాల భూమిని సేకరించారు.
జిల్లాలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం 2015 లో ప్రజాభిప్రాయ కార్యక్రమం ఏర్పాటు చేయగా, కంపెనీ ఏర్పాటును ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ కార్యక్రమం పెద్ద రసాబాసా గా మారింది. రసాయన కంపెనీ ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతం, విషతుల్యం అవుతుందని గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. సభను అడ్డుకున్నారు.
అప్పట్లో 22 మంది రైతులపై కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత, చాల సంవత్సరాలు ఆ ప్రాంతంలో కంపెనీ ఎటువంటి పనులు చేపట్టలేదు.ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఈ భూమి చుట్టూరా కంపెనీ వారు ప్రహారిని నిర్మిస్తున్నారు. దీంతో ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తారని పుకార్లు వినిపించారు. కంపెనీ భూముల మద్య ప్రభుత్వ భూములు ఉన్నాయని, వాటిని కాపాడాలని గ్రామానికి చెందిన యువకులు ఇటీవల అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో ఆదివారం మద్యాహ్నం మావోయిస్టు పార్టీ పేర బ్యానర్, వాల్ రైటింగ్స్ కనపడటంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. గ్రామానికి చెందిన పన్యాల ఎల్లారెడ్డి పశువుల కొట్టం వద్ద బ్యానర్, హెటిరో కంపెనీ వాచ్ మెన్ ల గదులకు వాల్ రైటింగ్స్ వ్రాశారు.
పేదల భూములు వారికీ తిరిగి ఇవ్వాలి…
అక్రమంగా పేదల నుండి తీసుకున్న భూములను తిరిగి పేదలకు అప్పగించాలని, అక్రమంగా పేదల భూములను తీసుకొని కంపెనీకి కట్టపెట్టాలని ప్రయత్నిస్తే బడా పెట్టుబడిదారునికి కొమ్ము కాస్తే ప్రజా కోర్టులో ఎంతటి వారైనా శిక్షకు అర్హులేనని, పేదల దగ్గర నుండి తీసుకున్న భూములను బేషరుతుగా ప్రజలకు తిరిగి అప్పగించాలి అంటూ మావోయిస్టు పార్టీ పేరున హెచ్చరికలు జారీ చేశారు.
పేదల వద్ద భూములు తీసుకొని పెట్టుబడి దారులకు కొమ్ముకాస్తున్న వారికి ప్రజా కోర్టులో శిక్ష తప్పదని అందులో పేర్కొన్నారు. ఎర్రటి బట్ట మీద తెల్లని రాతలు వ్రాసారు అందులో కంకి కొడవలి గుర్తు వేశారు.
హెటిరో కంపెనీ భూముల పరిధిలో మావోయిస్టుల పేర వాల్ రైటింగ్స్ కనపడటంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. చాలా ఏళ్లుగా జిల్లాలో మావోయిస్టుల ఉనికి కనిపించలేదు. సంఘటన స్థలంకు దగ్గరలో గతంలో మావోయిస్టులకు అవినాభావ సంబంధం ఉన్న ఓదన్ చెర్వు, సిర్సినగండ్ల, గిరాయిపల్లి అడవులు ఉన్నాయి.
ఈ ప్రాంతంలో నుండి గతంలో పనిచేసిన మావోయిస్టులు, సానుభూతిపరులు ఇలాంటి కార్యక్రమం చేపట్టారా, లేక కంపెనీ నిర్మాణంకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లు చేసి ఉంటారా అని అనుమానిస్తున్నారు. గతంలో ఓదన్ చెర్వు వద్ద జెండాలు వెలిసిన సందర్భంగా మావోయిస్టులు మందు పాతర పేల్చడంతో ఎస్ ఐ రాజేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. మావోయిస్టుల పేర వెలసిన వ్రాతలు జిల్లాలో సంచలనంగా మారాయి. ఈ విషయమై తొగుట సీఐ లతీఫ్ ను ఆరా తీయగా సంఘటనపై విచారణ చేస్తున్నామన్నారు.