జర్నలిస్ట్ స్వేచ్ఛ సూసైడ్ కేసు - తెరపైకి పూర్ణచందర్...! వెలుగులోకి కీలక విషయాలు-poornachander arrested in news anchor swetcha suicide case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  జర్నలిస్ట్ స్వేచ్ఛ సూసైడ్ కేసు - తెరపైకి పూర్ణచందర్...! వెలుగులోకి కీలక విషయాలు

జర్నలిస్ట్ స్వేచ్ఛ సూసైడ్ కేసు - తెరపైకి పూర్ణచందర్...! వెలుగులోకి కీలక విషయాలు

ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ కేసులో కీలక విషయాలు బయటికి వస్తున్నాయి. ఈ కేసులో పూర్ణచందర్ అనే వ్యక్తిని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకంటే ముందు అతని పేరుతో 5 పేజీలతో కూడిన లేఖ కూడా బయటికి వచ్చింది. పూర్ణచందర్ పై స్వేచ్ఛ కుమార్తె… పలు ఆరోపణలు చేసింది.

స్వేచ్ఛ వోటార్కర్

తెలుగు న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ (40) సూసైడ్ కేసులో కీలక విషయాలు బయటికి వస్తున్నాయి. హైదరాబాద్ లోని చిక్కడపల్లిలోని తన నివాసంలో స్వేచ్ఛ… శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

తెరపైకి పూర్ణచందర్ - లేఖ విడుదల

స్వేచ్ఛ ఆత్మహత్యకు కారణం పూర్ణచందర్ అనే వ్యక్తి కారణమని స్వేచ్ఛ తల్లిదండ్రులు ఆరోపించారు. స్వేచ్ఛ కుమార్తె కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. అయితే వీరి ఆరోపణలపై పూర్ణచందర్ నాయక్ పేరుతో 5 పేజీలతో కూడిన లేఖ బయటికి వచ్చింది. ఇందులో పలు విషయాలను పేర్కొన్నారు.

స్వేచ్ఛతో తనకున్న అనుబంధం, వారి జీవితాల్లో చోటుచేసుకున్న సంఘటనల గురించి పూర్ణచందర్ వివరించారు. 2009 నుంచి తనకు స్నేహం ఉందన్నారు. స్వేచ్ఛ తల్లిదండ్రులు జనశక్తి కార్యకర్తలుగా పనిచేస్తూ…. ఆరు నెలల వయసులో ఉన్న స్వేచ్ఛను ఆమె అన్న, వదినల సంరక్షణలో వదిలేసి సంవత్సరానికి ఒకసారి మాత్రమే చూసి వెళ్లేవారని స్వేచ్ఛ తరచుగా తనతో ప్రస్తావించేదని పూర్ణచందర్ పేర్కొన్నారు. స్వేచ్ఛ 2008-2009 మధ్య తన మొదటి వివాహం నుండి విడాకులు తీసుకున్నారని తెలిపారు. దురదృష్టవశాత్తు 2016-2017 మధ్యకాలంలో రెండో వివాహానికి కూడా విడాకులు పొందారని.. తన జీవితంలో ఆమె ఎప్పుడూ సంతోషంగా లేదని పేర్కొన్నారు. ఆ ఆనందాన్ని కేవలం తన వృత్తిలోనే వెతుక్కునేదని పూర్ణచందర్ తన లేఖలో రాశారు.

ఇక స్వేచ్ఛతో ఆమె బిడ్డతో గానీ తనకు ఎలాంటి విభేదాలు లేవని పూర్ణచందర్ స్పష్టం చేశారు. ఆత్మహత్యకు ముందు రోజు రాత్రి స్వేచ్ఛ తండ్రి… మాట్లాడిన మాటలు ఆమెను ఎంతగానో బాధించాయని వివరించారు. ‘రెండేళ్లకొకసారి ఇతను మీ అల్లుడు అని చెబితే తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. డబ్బు లేకపోవచ్చు. నేను పీడీఎస్ యూలో పని చేశారు. గౌరవాన్ని కోల్పోలేను" అంటూ ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి స్వేచ్ఛ తనకు చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకుందన్నారు.

లేఖ బయటికి వచ్చిన తర్వాత.. శనివారం రాత్రి పూర్ణచందర్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అనంతరం ఈ కేసులో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.

కుమార్తె సంచలన ఆరోపణలు…

తల్లి సూసైడ్ పై స్పందించిన కుమార్తె… పూర్ణచందర్ పై పలు ఆరోపణలు చేసింది. పూర్ణచంద్ర నాయక్‌ ఎప్పుడూ తనని విసిగించేవాడని చెప్పింది. రకరకాల పనులు చేయమని ఇబ్బందిపెట్టేవాడని తెలిపింది. అమ్మని, నన్ను ఎప్పుడూ కలవనిచ్చేవాడు కాదని ఆరోపించింది. తన తల్లి సూసైడ్ కు పూర్ణచంద్ర నాయకే అసలు కారణమని తెలిపింది. లేఖలో రాసినవన్నీ అబద్ధాలేనని స్పష్టం చేసింది.

ఇవాళ ఎన్టీవీతో మాట్లాడిన స్వేచ్ఛ కుమార్తె… " వాళ్ల మధ్య ఏదో గొడవ జరిగింది. అందుకే నా తల్లి సూసైడ్ చేసుకుంది. ఇటీవలనే వాళ్లిద్దరు అరుణాచలం వెళ్లి వచ్చారు. ఆయన ప్రవర్తన నాకే నచ్చేది కాదు. కొన్నిసార్లు బ్యాడ్ టచ్ చేసేవాడు. మా తల్లి మరణానికి పూర్ణచందర్ వేధింపులే కారణం" అని ఆరోపణలు చేసింది.

స్వేచ్ఛ కుమార్తె ఫిర్యాదు ఆధారంగా పూర్ణచందర్ పై పోక్సో కేసు కూడా నమోదైంది. ఈ ఫిర్యాదు ఆధారంగా కూడా విచారణ జరపుతున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్న పూర్ణచందర్ ను… కోర్టులో హాజరుపరచనున్నారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం