Telangana September 17 : హస్తిన టు హైదరాబాద్ - అగ్రనేతల రాకతో పొలిటికల్ హీట్-political heat in telangana braces for september 17 events ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana September 17 : హస్తిన టు హైదరాబాద్ - అగ్రనేతల రాకతో పొలిటికల్ హీట్

Telangana September 17 : హస్తిన టు హైదరాబాద్ - అగ్రనేతల రాకతో పొలిటికల్ హీట్

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 17, 2023 08:57 AM IST

Telangana Politics: ఆసక్తికరమైన రాజకీయాలకు తెలంగాణ వేదికైంది. కీలకమైన CWC భేటీతో పాటు విజయభేరి సభ కోసం కాంగ్రెస్ అగ్రనేతలు రాక.. మరోవైపు విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు అమిత్ షా వచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ సమైక్యత దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు.

తెలంగాణలో రాజకీయ వేడి
తెలంగాణలో రాజకీయ వేడి

Telangana Politics: తెలంగాణలో ఎన్నికల ఫైట్ షురూ అయింది. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో… ప్రధాన పార్టీలన్నీ రంగంలోకి దిగుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థులు ప్రకటించిన బీఆర్ఎస్… అభివృద్ధి పనులతో పాటు ప్రచారంపై కూడా దృష్టిపెట్టింది. ఇక జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ… పక్కాగా వ్యూహలను రచించే పనిలో ఉంది. హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ భేటీతో కాంగ్రెస్ ముందుకు రాగా… సాయంత్రం భారీ సభను తలపెట్టింది. తెలంగాణ విమోచన దినోత్సం వేడుకల్లో పాల్గొనేందుకు బీజేపీ అగ్రనేత అమిత్ షా కూడా రాజధానికి చేరుకున్నారు. ఇవాళ పరేడ్ గ్రౌండ్ సభలో ప్రసంగిస్తారు. మరోవైపు గులాబీ బాస్ కేసీఆర్… జాతీయ సమైక్యతా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఒకేరోజు మూడు ప్రధాన పార్టీల కార్యక్రమాలు ఉండటంతో రసవత్తర రాజకీయానికి రాజధాని వేదికైంది.

సెప్టెంబర్ 17 లక్ష్యంగా అన్ని పార్టీలు తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచుతున్నాయి. రాష్ట్రానికి ఢిల్లీ నేతల రాకతో విమర్శలు, ప్రతి విమర్శలు, పోస్టర్ల యుద్ధంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. చారిత్రక దినోత్సవం సందర్భంగా ప్రధాన పార్టీలు యాక్టివ్‌ అయ్యాయి. తెలంగాణ విమోచన దినోత్సం, విలీన దినోత్సవం, సమైక్యతా దినోత్సవం పేరుతో ఇలా ఎవరికి వారుగా కార్యక్రమాలు చేపడుతుండటంతో… పొలిటిక్ హీట్ పెరిగిపోనుంది.

అమిత్ షా ప్రసంగంపై ఆసక్తి…!

తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శనివారమే హైదరాబాద్ కు వచ్చారు. రాష్ట్ర నేతలతో సమీక్ష జరిపి, ఎన్నికలకు ఎలా ముందుకెళ్లాలో దిశానిర్దేశం చేశారు. ఇవాళ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ జరిపే విమోచన దినోత్సవాల్లో విశిష్ట అతిథిగా పాల్గొననున్నారు. ఉదయం 11.10కి జరిగే తెలంగాణ విమోచన దినోత్సవాల్లో పాల్గొననున్న ఆయన… కీలక ప్రసంగం చేస్తారని తెలుస్తోంది. తన ప్రసంగంలో బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసే అవకాశం కనిపిస్తోంది. మధ్యాహ్నం తర్వాత అమిత్ షా ఢిల్లీ వెళ్తారు.

కాంగ్రెస్ విజయభేరి సభ…

సీడబ్ల్యూసీ భేటీ ఆదివారం మధ్యాహ్నం తర్వాత ముగుస్తుంది. ఆ తర్వాత పార్టీ అగ్రనేతలు విజయభేరి సభకు హాజరుకానున్నారు. ఈ సభలో సోనియా గాంధీ, ప్రస్తుత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేతలు రాహుల్, ప్రియాంకగాంధీ మాట్లాడనున్నారు. ఈ సభా వేదిక నుంచి 6 గ్యారెంటీ హామీలను ప్రకటించనున్నారు సోనియా గాంధీ. రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీతో కీలకమైన ప్రకటనలు చేయించటం ద్వారా…. బలమైన సందేశాన్ని ప్రజల్లోకి పంపాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందులో భాగంగా తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయానికి సంబంధించి ఐదు ప్రధాన హామీలను ప్రకటించనుంది. ఇదే సమయంలో ముఖ్య నేతలు ప్రసంగాల్లో అధికార బీఆర్ఎస్ తో పాటు కేంద్రంలోని బీజేపీపై విమర్శలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఉదయం అమిత్ షా మాట్లాడనున్న నేపథ్యంలో… కాంగ్రెస్ నుంచి కౌంటర్ ఉండే ఛాన్స్ ఉంది.

జాతీయ పార్టీల సభలు ఇలా ఉంటే…. తెలంగాణ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని జరుపుతోంది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొనబోతున్నారు. పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఎగరేస్తారు. మరోవైపు MIM పార్టీ కూడా జాతీయ జెండాను ఎగరవేయటంతో పాటు తిరంగ ర్యాలీని చేపట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ జాతీయ సమైక్యతా దినోత్సవాల్ని జరపుతోంది. సెప్టెంబర్ 17వ తేదీని విమోచన దినోత్సవంగా జరపాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తుంటే… విలీన దినోత్సవంగా కాంగ్రెస్ జరుపుకుంటోంది. అయితే ఈ రెండు పార్టీలకు భిన్నంగా అధికార బీఆర్ఎస్ సమైక్యతా దినోత్సవాన్ని తెరపైకి తీసుకువచ్చింది.నిరుడు జాతీయ సమైక్యతా దినోత్సవం పేరిట రాష్ట్ర ప్రభుత్వం 15 రోజులపాటు కార్యక్రమాలను నిర్వహించింది.

మూడు ప్రధాన పార్టీల కార్యక్రమాలు ఒకే రోజు ఉండటంతో హైదరాబాద్ వేదికగా రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. ఎన్నికల వేళ అగ్రనేతలు స్పీచ్ లు మరింత పోలిటికల్ హీట్ ను రాజేసే అవకాశం కనిపిస్తోంది.

IPL_Entry_Point