Telangana Talli Statue : 'తెలంగాణ తల్లి' రూపంపై వివాదమేంటి..? 10 ముఖ్యమైన అంశాలు
Telangana Talli New Statue: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రూపంతో కూడిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనుంది. ఈ మేరకు సచివాలయంలో ఏర్పాట్లు సిద్ధం చేసింది. డిసెంబర్ 9వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. అయితే కొత్త రూపంపై వివాదం ముదురుతోంది.
తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది. డిసెంబర్ 9వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం వద్ద విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ తెలంగాణ తల్లికి సంబంధించిన ఒక ఫొటో కూడా బయటకు వచ్చింది. అయితే అధికారికంగా ప్రభుత్వం మాత్రం ప్రకటన చేయలేదు. అయినప్పటికీ ఇదే ఫొటో ఫైనల్ అని తెలుస్తోంది. ఇప్పుడు ఇదే అంశం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.
గతంలో ఉన్న రూపాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రాచరికపు పోకడలకు దూరంగా ఉండేలా కొత్త రూపంతో కూడిన విగ్రహాన్ని రూపొందించినట్లు మరోవైపు నుంచి స్పందనలు వస్తున్నాయి. ఇక ఇదే విషయంపై అధికార కాంగ్రెస్ ను బీఆర్ఎస్ టార్గెట్ చేస్తోంది. తెలంగాణ ఆత్మ లేకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారని విమర్శలు చేస్తోంది. అదే స్థాయిలో అధికార పార్టీ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు.
తెలంగాణ తల్లి వివాదం - 10 ముఖ్యమైన అంశాలు
- తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ అస్తిత్వ చిహ్నంగా తెలంగాణ తల్లికి రూపం ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుగు తల్లి కాకుండా… తమ ప్రాంత అస్తిత్వానికి ప్రతీకగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెరపైకి తీసుకొచ్చారు.
- తెలంగాణకు చెందిన ప్రముఖ రచయిత బీఎస్ రాములు మొదటిసారి తెలంగాణ తల్లికి ఒక రూపాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే కంప్యూటర్‌పై తెలంగాణ తల్లి విగ్రహానికి రూపమిచ్చిన వ్యక్తి బీవీఆర్ చారి. తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా ప్రాంతాల్లోనూ తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటయ్యాయి. ఇక కేసీఆర్ దీక్ష, మలి దశ తెలంగాణ పోరాటం తర్వాత… మారుమూల పల్లెల్లో కూడా తెలంగాణ తల్లి విగ్రహాలు దర్శనమిచ్చాయి.
- తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా తీసుకొచ్చిన తెలంగాణ తల్లి విగ్రహంలో ఒక చేతిలో బతుకమ్మ, గద్వాల, పోచంపల్లి నేతన్నల కృషి చూపించే పట్టు చీర, కరీంనగర్ వెండి మట్టెలు, మెట్ట పంటలకు చిహ్నంగా మక్కకంకులు ఉండేవి. కిరీటంతో పాటు ఆ కిరీటంలో ప్రసిద్ద కోహినూర్ వజ్రం, వడ్డాణం, జరీ అంచుచీర, నిండైన కేశ సంపద తదితరాలతో తుది మెరుగులు తీర్చిదిద్దారు.
- తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రేవంత్ సర్కార్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. చిహ్నల మార్పు, తెలంగాణ రాష్ట్ర గీతం వంటి నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలోనే… కొత్త తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సిద్ధమైంది. ఇందుకోసం కొద్దిరోజులుగా కసరత్తు చేస్తూ వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటో తాాజాగా బయటికి వచ్చింది.
- ఈ ఫొటోలో ఆకుపచ్చ చీరలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. మెడలో కంటె, బంగారు ఆభరణాలు ఉన్నాయి. అలాగే, ఎడమ చేతిలో వరి, మొక్కజొన్న కంకులు, జొన్నలు ఉన్నాయి. చెవులకు కమ్మలతో నిండుగా ఉండేలా విగ్రహాన్ని రూపొందించారు. అయితే ఇందులో బతుకమ్మ కనిపించలేదు.
- గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాం రాచరికపు పోకడలకు దగ్గరగా ఉందని పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆడబిడ్డను గుర్తు చేసేలా.. సాధారణ మహిళలా, పోరాట స్ఫూర్తిని తెలిపేలా కొత్త విగ్రహాన్ని రూపొందిస్తామని కూడా చెప్పారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఆ దిశగా అడుగులు వేస్తూ వచ్చారు.
- కొత్త రూపంతో ఉన్న విగ్రహాన్ని సచివాలయంలోని ప్రాంగణంలో 20 అడుగుల ఎత్తులో ఆవిష్కరించనున్నారు. తెలంగాణ సాంస్కృతి ఉట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీర్చిదిద్దామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించుకుంది. డిసెంబర్ 9వ తేదీన లక్ష మంది మహిళలతో కలిసి విగ్రహావిష్కరణ చేయనుంది.
- విగ్రహావిష్కరణ కోసం ప్రతిపక్ష నేత కేసీఆర్ తో పాటు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను కూడా ఆహ్వానించింది. వీరితో పాటు తెలంగాణలోని పలువురు కవులు, కళాకారులకు ఆహ్వానాలను పంపించింది.
- కొత్త విగ్రహాం రూపొందించటంపై బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తెలంగాణ ఆత్మగా భావించే బతుకమ్మ లేకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించటమా అని ప్రశ్నిస్తోంది. తెలంగాణ తల్లిని పేదగా చూపెట్టాలనే ప్రయత్నం తెలంగాణ ప్రజలను అవమానించడమే అని అంటోంది. ఎవరితోనూ సంప్రదించకుండా సీఎం రేవంత్ రెడ్డి… తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చే ఒక దుస్సాహసం చేస్తున్నాడని ఆక్షేపిస్తోంది.
- సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అంశంపై రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రముఖ కవి, రచయిత జూలూరి గౌరీశంకర్ పిటిషన్ వేశారు. విగ్రహం రూపు రేఖలు మార్చడం ద్వారా ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలను కూడా మార్చకుండా చూడాలని కోరారు.
సంబంధిత కథనం