Karimnagar Police: న్యూ ఇయర్ వేడుకలపై పోలీస్ స్పెషల్ ఫోకస్, కరీంనగర్‌లో తగ్గిన మద్యం అమ్మకాలు
Karimnagar Police: న్యూ ఇయర్ వేడుకలు శృతిమించకుండా పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ మద్యం అమ్మకాలపై ప్రభావం చూపింది. కరీంనగర్ జిల్లాలో గణనీయంగా మద్యం అమ్మకాలు తగ్గాయి.గతంతో పోల్చితే ఏడు కొట్ల 75 లక్షల ఆదాయం సర్కార్ కు తగ్గింది. లక్ష్యం నెరవేరక ఆబ్కారీ అధికారులు,మద్యం వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
Karimnagar Police: పండుగైనా..పబ్బమైన చుక్క, ముక్క ఉండాల్సిందే. ఆ రెండు ఉంటే క్రేజే వేరు. ఇక న్యూ ఇయర్ వేడుకల వేళ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తాగర అన్నా తాగి ఊగర అన్నా అంటూ మందు బాబుల జోష్ అంతాఇంతా కాదు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా ఎక్కువమంది మద్యంలో మునిగి తేలుతారు. జోరుగా మధ్యం అమ్మకాలు జరిగి ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుంది. కానీ, ఈసారి పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ తో కరీంనగర్ జిల్లాలో మద్యం అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు కోట్ల 75 లక్షల ఆదాయం కోల్పోయింది. అబ్కారీ అధికారుల, మద్యం వ్యాపారుల ఆశలను అడియాశలు చేసింది. అర్థరాత్రి వరకు వైన్ షాపులకు బార్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ మందకోడిగానే మద్యం అమ్మకాలు జరిగాయి.
ఈసారి రూ. 7.52 కోట్ల మద్యం అమ్మకం...
కరీంనగర్ ఐఎంఎల్ డిపో నుంచి డిసెంబర్ 30న 24 కోట్ల 50 లక్షల రూపాయల మద్యం అమ్మితే, 31న 10 కోట్లు తగ్గి 14 కోట్ల 50 లక్షల మద్యం విక్రయం జరిగింది. కరీంనగర్ జిల్లాలోని వైన్ షాప్ ల ద్వారా డిశంబర్ 31న 7 కోట్ల 52 లక్షల రూపాయల విలువ చేసే మద్యం విక్రయాలు జరిగాయి. గత ఏడాది 2023 డిసెంబర్ నెలలో జిల్లా వ్యాప్తంగా 133 కోట్ల 78 లక్షల విలువ చేసి మద్యం అమ్మకాలు జరిగితే 2024 డిశంబర్ మాసంలో 126 కోట్ల విలువ చేసే మద్యం విక్రయాలు జరిగాయి. గతంతో పోల్చితే 15 శాతం మద్యం అమ్మకాలు తగ్గినట్లు ఆభ్కారి అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
జగిత్యాల సిరిసిల్ల లో భారీగా పెరిగిన అమ్మకాలు...
కరీంనగర్ జిల్లాలో గణనీయంగా మద్యం అమ్మకాలు తగ్గగా జగిత్యాల సిరిసిల్ల జిల్లాలో భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. జగిత్యాల జిల్లాలో 2023 డిసెంబర్ 31న కోటి 89 లక్షల 34 వేల రూపాయల మద్యం అమ్మకాలు జరిగితే 2020 4 డిసెంబర్ 31న 4 కోట్ల 42 లక్షల 33 వేల రూపాయల మధ్యం అమ్మకాలు జరిగాయి.
ఇక సిరిసిల్లలో 2023 డిసెంబర్ 31న కోటి 36 లక్షల రూపాయల విలువచేసే మధ్యం అమ్మకాలు జరిగితే 20204 డిసెంబర్ 31న 4 కోట్ల 31 లక్షల రూపాయలు మద్యం విక్రయించడం జరిగింది. జగిత్యాల జిల్లాలో రెట్టింపు స్థాయిలో సిరిసిల్ల జిల్లాలో మూడింతలు ఎక్కువ మధ్యం అమ్మకాలు జరిగితే కరీంనగర్ లో మాత్రం ఘననీయంగా తగ్గడం పోలీసుల ప్రభావమేనని అటు ఆబ్కారీ అధికారులు ఇటు మద్యం వ్యాపారులు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు.
స్పెషల్ డ్రైవ్ ఎఫెక్ట్...
కరీంనగర్ జిల్లాలో న్యూ ఇయర్ వేడుకలు శృతిమించకుండా ఉండేందుకు సీపీ అభిషేక్ మోహంతి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి నిరంతరాయంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. 30, 31న రెండు రోజుల పాటు సాయంత్రం నుంచి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టడంతో మందుబాబులు రోడ్డు ఎక్కకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. ముందుగా కొనుగోలు చేసిన మధ్యాన్ని సేవించారు.
మద్యం సేవించి రోడ్ ఎక్కితే తాటతీస్తామని పోలీసుల హెచ్చరికతో మందుబాబులు 31న రోడ్డు మీదికి రావడానికి భయపడ్డారు. ముందుగా తెచ్చుకున్న మద్యం అయిపోతే మళ్లీ వైన్ షాప్ కు వెళ్లి తెచ్చుకోవడానికి భయపడ్డారు. దీంతో ఉన్నంతలోనే సర్దుకోవడంతో మద్యం అమ్మకాలకు కోతపడిందని మందుబాబులతో పాటు మధ్యం వ్యాపారులు అంటున్నారు. ఏదేమైనా పోలీసుల స్పెషల్ ఫోకస్ మద్యం అమ్మకాలపై ప్రభావం చూపడం ఆబ్కారీ అధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు.
కరీంనగర్ జిల్లాలో 2023 డిసెంబర్ లో 133 కోట్ల రూపాయల విలువ చేసే మధ్యం అమ్మకాలు జరిగితే 2024 డిసెంబర్ లో 141 కోట్ల మద్యం విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఊహించని విధంగా గతంలో కంటే ఏడు కోట్ల 75 లక్షల వరకు మద్యం విక్రయాలు తగ్గడం పోలీసుల పుణ్యమేనని భావిస్తున్నారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)