Hyderabad Murder : భారీగా డబ్బు కాజేశారు.. భయపడి హత్య చేశారు.. వ్యాపారి మర్డర్ కేసులో కీలక అంశాలు
Hyderabad Murder : హైదరాబాద్‌లో నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వివాహేత సంబంధాలు, వ్యాపార లావాదేవీలు ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా డబ్బు కోసం ఓ వ్యాపారిని దారుణంగా హత్య చేశారు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించిన కీలక అంశాలు ఇలా ఉన్నాయి.
సికింద్రాబాద్ విక్రమ్ పురి కాలనీకి చెందిన వ్యాపారి బొల్లు రమేష్ హత్య కేసును పోలీసులు చేధించారు. కొనుగోలు చేసిన సరుకుకి సొమ్ము చెల్లిస్తామని అతడిని రప్పించారు. అతడినే బంధించి భారీ ఎత్తున డబ్బు కాజేశారు. ఈ విషయం బయటపడితే పోలీస్ కేసు తప్పదనే భయపడ్డారు. వ్యాపారిని హత్య చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సయ్యద్ సజ్జాద్ అహ్మద్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్‌కు తరిలించారు. నిందితుడికి సహకరించిన మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సరుకు కొనుగోలు..
ఖార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలోని విక్రమ్ పురి కాలనీలో వ్యాపారి బొల్లు రమేష్ నివసిస్తున్నారు. రమేష్ రెండు రాష్ట్రాల్లోని దుకాణాలకు పాన్ మసాల సరఫరా చేస్తున్నారు. పెద్దఎత్తువ వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే చాంద్రాయణగుట్టకు చెందిన సజ్జాద్ అహ్మద్ ఖాన్‌తో పరిచయం ఏర్పడింది. ఇటీవల సజ్జాద్ ముఠా రమేష్ దగ్గర రూ.6 లక్షల విలువైన పాన్ మసాలా సరుకును కొనుగోలు చేశారు.
డబ్బులు ఇస్తాం రమ్మని..
దీనికి సంబంధించి డబ్బులు పూర్తిగా చెల్లించలేదు. ఎప్పుడు అడిగినా.. రేపు మాపు అంటూ సజ్జాద్ దాటవేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 18న ఉదయం డబ్బు తీసుకునేందుకు కాచిగూడ రావాలని రమేష్‌ను సజ్జాద్ పిలిచారు. అక్కడ డబ్బు విషయంలో రమేష్, సజ్జాద్ మధ్య గొడవ జరిగింది. అయితే.. అదే సమయంలో రమేష్‌కు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. దీంతో అతన్ని బెదిరించి డబ్బు గుంజేందుకు ప్లాన్ చేశారు.
ప్రాధేయపడ్డ వ్యాపారి..
వెంటనే రమేష్ కాళ్లు, చేతులను తాళ్లతో కట్టేశారు. బెదిరించి రూ.15 లక్షలు డిమాండ్ చేశారు. అయితే.. వారు తనని చంపుతారని భయపడిన రమేష్ స్నేహితుడి ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించారు. డబ్బులు తీసుకున్న తర్వాత తనను వదిలేయాలని ప్రాధేయపడ్డాడు. అయితే.. రమేష్‌ను ప్రాణాలతో వదిలితే.. డబ్బు తీసుకున్న విషయం బయటపడుతుందని నిందితులు భావించారు. వెంటనే రమేష్ కాళ్లు, చేతులు కట్టి కారులో బంధించారు.
హత్యకు ప్లాన్..
అతన్ని ఏపీ- తెలంగాణ సరిహద్దులో హత్య చేయాలని ప్లాన్ చేసుకున్నారు. వెంటనే కాచిగూడ నుంచి ఖమ్మం వెళ్లి.. అక్కడి నుంచి కోదాడ చేరుకున్నారు. మళ్లీ అక్కడి నుంచి ఖమ్మం వైపు వచ్చారు. మార్గమధ్యలో కోక్యా తండా సమీపంలో రమేష్‌ను హత్య చేశారు. కారులోనే రమేష్ మెడకు టవల్ బిగించి ఊపిరాడకుండా చేశారు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక.. సమీపంలో ఉన్న మిరపతోట మధ్యలోకి తీసుకెళ్లారు. అతన్ని గుర్తుపట్టకుండా ముఖంపై బండరాళ్లతో కొట్టారు.
భార్య ఫిర్యాదుతో..
వ్యాపారి రమేష్ సెల్‌ఫోన్లను ఖమ్మం, హైదరాబాద్, కోదాడ మార్గాల్లో పడేశారు. పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అయితే.. ఈనెల 19న రమేష్ భార్య జనని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ, సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా వ్యాపారి ఖమ్మం, కూసుమంచి పరిసరాల్లో ఉండొచ్చని అంచనా వేశారు. అదే సమయంలో అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు.
గతంలోనూ పలు కేసులు..
దర్యాప్తులో భాగంగా.. ప్రధాన నిందితుడు సజ్జాద్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. పోలీసుల తమ స్టైల్‌లో ప్రశ్నించగా.. సజ్జాద్ నేరం చేసినట్టు అంగీకరించాడు. దీంతో అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడు సజ్జాద్‌పై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో హత్య, మోసం కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.