Karimnagar Murder: మహిళ హత్య, బాలుడు అదృశ్యం మిస్టరీని ఛేదించిన పోలీసులు.. బాలుడిని చెన్నై హోటల్లో వదిలి పారిపోయిన..
Karimnagar Murder: కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టించిన యువతి హత్య కేసులో అదృశ్యమైన బాలుడి ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. గత నెల 27న మహిళ హత్యకు గురి కాగా ఆమె కుమారుడు అపహరణకు గురయ్యాడు. బాలుడి అచూకీని చెన్నైలో కనిపెట్టారు.
Karimnagar Murder: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి శివారులో గత నెల 27 మహిళ మమత హత్యకు గురి కాగా, 4 ఏళ్ళ బాలుడు అద్యశ్యం మిస్టరీని పోలీసులు చేధించారు. హంతకుడు బాలుడిని చెన్నైలో ఓ హోటల్ వదిలి పారిపోగా బాలుడిని పోలీసులు చేరదీసి కరీంనగర్ కు తరలించారు. కరీంనగర్ రూరల్ ఏసిపి శుభం ప్రకాష్ సమక్షంలో బాలుడిని నానమ్మ తాతయ్య మేడ లక్ష్మీ రాంచందర్ దంపతులకు అప్పగించారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఖాసీంపేట కు చెందిన భరత్, కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన నర్సింగ్ స్టూడెంట్ మమత ప్రేమించుకున్నారు. ఆరేళ్ళ క్రితం ప్రేమ పెళ్ళి చేసుకున్నారు. వారికి ధ్రువ అనే బాబు జన్మించాడు. అన్యోన్యంగా సాగిన దాంపత్య జీవితంలో తర్వాత కలతలు మొదలయ్యాయి.
గత ఏడాది దసరా పండుగ నుంచి మమత భర్త భరత్ కు దూరంగా కొడుకుతో కలిసి మంచిర్యాలలో ఉండే బంధువుల వద్ద ఉంటుంది. జనవరి 27న బాబుతో కలిసి కారులో బయలుదేరి అదృశ్యం అయింది. 29న కరీంనగర్ జిల్లా కొండన్నపల్లి వద్ద మమత శవమై తేలింది.
కారులో బయలుదేరి...
27న షాప్ కు వెళ్తున్నానని చెప్పి బాబుతో కలిసి కారులో ఎక్కి బయలుదేరిన మమత కరీంనగర్ జిల్లా కొండన్నపల్లి వద్ద ఎస్సారెస్పీ వరద కాలువ సమీపంలో రోడ్డు పక్కన శవమై తెలింది. ముఖంపై గాయాలు మెడకు ఉరేసిన ఆనవాళ్ళు ఉండడంతో గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి శవాన్ని గుర్తించేందుకు ప్రచారం చేశారు.
అప్పటికే మంచిర్యాలలో ఇంటి నుంచి బయలుదేరిన మమత ఆచూకీ దొరకక పోవడంతో అదృశ్యమైనట్టు పోలీసులను కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. కొండన్నపల్లి వద్ద ఉన్న మహిళా మృతదేహాన్ని చూసి మమతగా గుర్తించారు. హత్యకు గురైనట్లు ఆనవాళ్ళు లభించాయి. కానీ ఆమె వెంట వెళ్లిన కొడుకు ధ్రువ ఆచూకీ లేకపోవడంతో అటు కుటుంబ సభ్యులను ఇటు పోలీసులను ఆందోళనకు గురి చేసింది.
మమతను ఎవరు హత్య చేశారు.. నాలుగేళ్ల బాబు ఏమయ్యాడోనని గత వారం రోజులుగా పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి విచారణ చేపట్టగా మంచిర్యాల నుంచి బయలుదేరిన కారును పోలీసులు గుర్తించారు. ఆ కారు మంచిర్యాల జిల్లాకు చెందిన వ్యక్తిదిగా గుర్తించి ఆరా తీయగా కారును సెల్ప్ డ్రైవింగ్ కోసం ఓ డ్రైవర్ తీసుకెళ్ళినట్లు కారు ఓనర్ తెలిపారు. కారును అద్దెకు తీసుకున్న డ్రైవర్ కారును సికింద్రాబాద్ లో వదిలేసి పారిపోయాడు.
బాబును వదిలి పారిపోయిన హంతకుడు...
వారం రోజులుగా బాబు ఆచూకీ కోసం ఇటు కుటుంబ సభ్యులు అటు పోలీసులు గాలించారు. పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి సాంకేతిక పరిజ్ఞానంతో గాలిస్తుండగా నిందితుడు చైన్నైలో ఓ హోటల్ లో బాబుతో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు అక్కడికి చేరే సరికి బాబును వదిలి హంతకుడు పారిపోయాడని పోలీసులు తెలిపారు.
బాబును చేరదీసిన పోలీసులు క్షేమంగా కరీంనగర్ కు తరలించి నానమ్మ తాతయ్య లక్ష్మి రాంచందర్ లకు అప్పగించారు. పారిపోయిన హంతకుడిని త్వరలోనే పట్టుకుంటామని కరీంనగర్ రూరల్ ఏసీపి శుభం ప్రకాష్ తెలిపారు. బాబును చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను సిపి అభిషేక్ మోహంతితో పాటు పోలీస్ అధికారులు అభినందించారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)