ప్రముఖ సింగ్ మంగ్లీ బర్త్ డే పార్టీపై పోలీసులు సోదాలు చేశారు. చేవెళ్ల శివారులోని ఓ రిసార్టులో స్నేహితులకు మంగ్లీ బర్త్ డే పార్టీ ఇచ్చారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు... రిస్టారుపై దాడులు చేశారు. ఈ తనిఖీల్లో విదేశీ మద్యంతో పాటు గంజాయి దొరికాయి. కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు.
చేవెళ్ల ఇన్‌స్పెక్టర్ భూపాల్ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం..." ఒక విశ్వసనీయ సమాచారం మేరకు ఈ సోదాలు జరిగాయి. ఈ ఆపరేషన్ సమయంలో... దామోదర్ అనే వ్యక్తి వేదిక వద్ద గంజాయి సేవిస్తూ పట్టుబడ్డాడు. ఈ కార్యక్రమంలో ఎంతవరకు మాదకద్రవ్యాల వినియోగం జరిగిందో తెలుసుకోవడానికి పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు"అని చెప్పారు.
“పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా పుట్టినరోజు వేడుకను నిర్వహించారు. ఎక్సైజ్ అనుమతి లేకుండా పార్టీలో మద్యం సేవించినందుకు మంగ్లీపై కేసు నమోదు చేయబడింది. అవసరమైన అనుమతులు లేకుండా ఈవెంట్ జరగడానికి అనుమతించినందుకు త్రిపుర రిసార్ట్ జనరల్ మేనేజర్‌పై కూడా కేసు నమోదు చేయబడింది. సౌండ్ పర్మిషన్ లైసెన్స్ లేకుండా ఉపయోగిస్తున్న డీజే పరికరాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీకి పలువురు సినీ సెలబ్రిటీలు కూడా హాజరైనట్లు తెలిసింది. వీరందరికీ త్వరలోనే నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది” అని సీఐ శ్రీధర్ చెప్పారు.
మంగ్లీపై నమోదైన ఎఫ్‌ఐఆర్ కాపీలో కీలక విషయాలు వెలుగు చూశాయి. రిసార్ట్‌లో పెద్దపెద్ద సౌండ్ చేస్తూ హంగామా చేస్తున్నారంటూ రాత్రి ఒంటిగంట సమయంలో కంట్రోల్ రూమ్‌కి ఫిర్యాదు అందింది. వెంటనే త్రిపుర రిసార్ట్ కి పోలీసులు వెళ్లారు.
10 మంది మహిళలు, 12 మంది పురుషులు కలిసి డీజే పెట్టి హంగామా చేస్తున్నట్లు గుర్తించారు. మంగ్లీ బర్త్‌డే పార్టీ అని మేనేజర్ చెప్పినట్లు ఎఫ్ఐఆర్ కాపీలో ప్రస్తావించారు. పార్టీకి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని తెలిపినట్లు పేర్కొన్నారు. పార్టీలో పెద్ద ఎత్తున విదేశీ మద్యం గుర్తించారు. అందరికీ డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా.. ఒక్కరు గంజాయి తీసుకున్నట్లు తేలింది.
రిసార్ట్ ఘటనపై తెలంగాణ పోలీసుల సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. చట్టాలను గౌరవించకుండా ఇష్టమొచ్చినట్టు చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. పార్టీలో డ్రగ్స్ తీసుకుంటే ఎంతటివారినైనా వదిలిపెట్టే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. మంగ్లీ బర్త్ డే పార్టీ వీడియోలు, అరెస్ట్ అయినవారి ఫొటోలను తెలంగాణ పోలీసులు విడుదల చేశారు.
టాపిక్