Naveen Murder Case : నవీన్ ని హత్య చేసిన విషయం ప్రియురాలికి చెప్పిన హరిహరకృష్ణ !
Naveen Murder Case : బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు హరిహరకృష్ణ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. నవీన్ ని హత్య చేసిన విషయం హరిహరకృష్ణ తన ప్రియురాలికి చెప్పాడని పేర్కొన్నారు.
Naveen Murder Case : ఇంజినీరింగ్ విద్యార్థి నవీన్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో విస్తుపోయే అంశాలు తెలుస్తున్నాయి. తాజాగా.. ఈ కేసుకి సంబంధించి పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టు ద్వారా మరిన్ని కీలక విషయాలు బయటపడ్డాయి. మూడు నెలల క్రితమే నవీన్ హత్యకు హరిహరకృష్ణ ప్లాన్ చేసినట్లుగా తేలింది. గెట్ టు గెదర్ పేరుతో జనవరి 16న హత్యకు ప్లాన్ చేయగా... వీలు కాకపోవడంతో ఫిబ్రవరి 17న హత్య చేసినట్లు వెల్లడైంది. అలాగే.. నవీన్ ను హత్య చేసిన విషయం... స్నేహితుడితో పాటు ప్రియురాలికి చెప్పినట్లు తెలిసింది. పోలీసులకి లొంగిపోవాలని ఆమె చెప్పినా వినకుండా వరంగల్ వెళ్లినట్లు వెల్లడైంది.
రిమాండ్ రిపోర్ట్ ప్రకారం... "ఫిబ్రవరి 17న పెద్ద అంబర్ పేట్ వద్ద నవీన్, హరిహరకృష్ణ మద్యం సేవించారు. రాత్రి 12 గంటల సమయంలో యువతి ప్రేమ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో గొంతు నులిమి నవీన్ ని హత్య చేశాడు.. హరిహర కృష్ణ. ఆ తర్వాత శరీరం నుంచి తల, వేళ్లు, ఇతర భాగాలను వేరు చేశాడు. వాటిని ఓ బ్యాగులో వేసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. బ్రాహ్మణపల్లికి చేరుకొని అక్కడ ఓ నిర్మానుష్య ప్రదేశంలో నవీన్ శరీర భాగాలున్న బ్యాగుని పడేశాడు. ఆ తర్వాత సమీపంలోనే ఉన్న స్నేహితుడి ఇంటికి చేరుకున్న హరిహరకృష్ణ.. అక్కడే స్నానం చేసి దుస్తులు మార్చుకున్నాడు. ఈ క్రమంలో.. నవీన్ ని హత్య చేసిన విషయం.. స్నేహితుడికి చెప్పాడు. ఇదే విషయాన్ని మరుసటి రోజు ప్రియురాలికి కూడా చెప్పాడు. ఫోన్ ని హైదరాబాద్ లోని తన నివాసంలోనే వదిలి... కోదాడ, ఖమ్మం, వైజాగ్ ప్రాంతాలలో రెండు రోజులు గడిపాడు. ఫిబ్రవరి 23న హైదరాబాద్ కు తిరిగి వచ్చి నవీన్ ని హత్య చేసిన విషయం తండ్రికి చెప్పాడు. ఫిబ్రవరి 24న మళ్లీ బ్రాహ్మణపల్లికి వెళ్లి... నవీన్ శరీర భాగాలను, ఆధారాలను తగలబెట్టాడు. అనంతరం... అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులకి లొంగిపోయాడు" అని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
నిందితుడు హరిహరకృష్ణకు హయత్ నగర్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. దీంతో అతడిని చర్లపల్లి జైలుకి తరలించారు. కాగా... పోలీసులకి ఆధారాలు లభించకుండా ఎలా హత్య చేయాలో యూట్యూబ్ లో వీడియోలు చూసి తెలుసుకున్న హరిహరకృష్ణ.. హత్యకు ప్లాన్ చేసినట్లు సమాచారం. అందులో భాగంగానే హత్య సమయంలో చేతికి గ్లౌజులు వేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులకి ఆధారాలు లభించవద్దనే.. నవీన్ శరీర భాగాలు సహా ఇతర ఆధారాలను తగలబెట్టాడు. పోలీసులకి లొంగిపోయే ముందు అతడు ఫోన్ లోని వాట్సాప్ చాటింగ్ ను, కాల్ డేటా మొత్తాన్ని డిలీట్ చేశాడు. అయితే... నవీన్, యువతి ఫోన్లో డేటా ద్వారా కొన్ని ఆధారాలను పోలీసులు సేకరించారు.
తమ కుమారుడు చేసింది తప్పేనని.. అయితే నవీన్ ని తన కొడుకు ఒక్కడే చంపాడని అనుకోవడం లేదని .. హరిహరకృష్ణ తండ్రి పేరాల ప్రభాకర్ అన్నారు. నవీన్ తల్లిదండ్రులు, అతడి కుటుంబ సభ్యులకి క్షమాపణలు చెప్పారు. తన కుమారిడి దుశ్చర్య క్షమించరానిది అన్న ఆయన... అయితే ఈ హత్య తన కుమారుడు ఒక్కడి ద్వారా అయ్యే పని కాదని.. అతిడితో పాటు, యువతి, నవీన్ ఫోన్లను పరిశీలించాలని కోరారు. హత్యలో పాల్గొన్నవారందరినీ గుర్తించి చట్టపరంగా శిక్షించాలని కోరారు. తన కొడుకు ఇంట్లో ఉన్నప్పుడు రాత్రి సమయంలో టీవీలో వచ్చే సీఐడీ క్రైమ్ స్టోరీలు చూసేవాడని చెప్పారు. ఏదో క్రైమ్ సీరియల్స్ చూస్తున్నాడని అనుకునే వాళ్లమని.. కానీ ఇంత ఘోరం చేస్తాడని అనుకోలేదని వాపోయారు.