Warangal Police: స్టేషన్ లోనే కొట్టుకున్న పోలీసులు, బదిలీ వేటు వేసిన వరంగల్ సీపీ-police persons fight in warangal police station disciplinary actions against them ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Police: స్టేషన్ లోనే కొట్టుకున్న పోలీసులు, బదిలీ వేటు వేసిన వరంగల్ సీపీ

Warangal Police: స్టేషన్ లోనే కొట్టుకున్న పోలీసులు, బదిలీ వేటు వేసిన వరంగల్ సీపీ

HT Telugu Desk HT Telugu
Nov 05, 2024 07:14 AM IST

Warangal Police: వరంగల్ కమిషనరేట్ లో పోలీస్ అధికారులు, సిబ్బంది తీరు తరచూ వివాదాస్పదం అవుతోంది. కొంతమంది విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండగా, మరికొందరు అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ చర్చల్లో నిలుస్తున్నారు. ఇంకొందరు ఇతర మహిళల విషయాల్లో జోక్యం చేసుకుంటూ వార్తల్లోకి ఎక్కుతున్నారు.

పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుళ్ల తన్నులాట
పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుళ్ల తన్నులాట

Warangal Police: ఇప్పటికే వివిధ సందర్భాల్లో వరంగల్ కమిషనరేట్ పోలీసులు వివాదాల్లో చిక్కి పనిష్మెంట్ కు గురి కాగా.. తాజాగా మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్ళ మధ్య పైసల పంచాయితీ తలెత్తగా.. ఇద్దరూ స్టేషన్ లోనే ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. దీంతో విషయం పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లగా.. పోలీస్ కమిషనర్ ఇద్దరినీ ఆ పీఎస్ నుంచి చెరో స్టేషన్ కు బదిలీ చేశారు.

పోలీస్ సిబ్బంది తెలిపిన సమాచారం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ ఈస్ట్ జోన్ పరిధి వరంగల్ జిల్లా నెక్కొండ పోలీస్ స్టేషన్లో గత నెల 29న స్థానిక ఎస్సై మహేందర్ వ్యక్తిగత కారణాలతో లీవ్ పెట్టాడు. దీంతో ఆయన మళ్ళీ విధుల్లో చేరే వరకు స్టేషన్ లోని ఒక హెడ్ కానిస్టేబుల్ కు పీఎస్ ఇన్చార్జీ బాధ్యతలు ఇచ్చారు. కాగా గత నెల 30న ఇన్ చార్జీ హెడ్ కానిస్టేబుల్ మండలంలోని ఓ గ్రామానికి పిటిషన్ పై ఎంక్వైరీకి వెళ్లాడు.

అక్కడ ఎంక్వైరీ అనంతరం పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. ఆ తరువాత కొద్దిసేపటికి పిటిషన్ దారుడు ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ కు కాల్ చేశాడు. అక్కడికి వచ్చిన మరో హెడ్ కానిస్టేబుల్ కు డబ్బులు ఫోన్ పే చేసానని చెప్పాడు. ఇదే విషయమై ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ ఇంకో హెడ్ కానిస్టేబుల్ ను నిలదీశాడు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ లోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

ఆ గొడవ కాస్త కొట్లాటకు దారి తీసింది. అనంతరం స్టేషన్ లోనే ఒకరిపై ఒకరు బాహాబాహీకి దిగారు. దీంతో స్టేషన్ మొత్తం గందరగోళంగా మారింది. ఈ విషయం ఎస్సై, సీఐ వరకూ వెళ్లడంతో వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత విచారణ నిమిత్తం ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ నెక్కొండ పోలీస్ స్టేషన్ నుంచి వివరాలు సేకరించారు.

హెడ్ కానిస్టేబుళ్ళపై సీపీ బదిలీ వేటు

నెక్కొండ పోలీస్ స్టేషన్ లో ఇద్దరు హెడ్ కానిస్టేబుల్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న విషయం బయటకు పొక్కింది. సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. దీంతో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. దాడి చేసుకున్న హెడ్ కానిస్టేబుళ్ళు ఇద్దరినీ అక్కడి నుంచి బదిలీ చేశారు.

అందులో ఒకరిని ధర్మసాగర్ పోలీస్ స్టేషన్‌కు ట్రాన్స్ఫర్ చేయగా.. మరొకరిని ఎల్కతుర్తి స్టేషన్‌కు బదిలీ చేస్తూ వరంగల్ సిపి అంబర్ కిషోర్ ఝా సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పోలీస్ శాఖలో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

Whats_app_banner