Hyderabad : ఫామ్‌హౌస్‌లో కోడిపందాలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి పోలీసుల నోటీసులు
Hyderabad : మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో కోడి పందాల కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ ఇష్యూ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పక్కా సమాచారంతో రాజేంద్రనగర్ పోలీసులు రెయిడ్ చేసి.. నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో కోడిపందాల కేసులో నోటీసులు ఇచ్చారు. ఫామ్‌హౌస్ నిర్వహణపై విచారించనున్నారు. ఫామ్‌హౌస్ యజమానిగా ఎమ్మెల్సీ పోచంపల్లి ఉండటంతో.. ఆయనకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల రాజేంద్రనగర్ పోలీసులు.. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న క్యాసినో, కోడి పందాల రాకెట్‌ను ఛేదించారు.
గుట్టుగా కోళ్ల పందాలు..
కోళ్ల పందాలు నిర్వహిస్తున్న భూపతి రాజు శివకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నగర శివార్లలో గుట్టుగా కోళ్ల పందాలు, క్యాసినోలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో.. ఎస్వోటి పోలీసులు దాడులు చేసి జూదం ఆడుతున్న వారిని పట్టుకున్నారు. ఈ దాడిలో మొత్తం 64 మందిని అరెస్టు చేశారు. పందాలకు వినియోగిస్తున్న రూ.30 లక్షల నగదు, 55 లగ్జరీ కార్లు, పందాల కోసం ఉపయోగించే 86 కోళ్లు, కోడి కత్తులనుస్వాధీనం చేసుకున్నారు.
ఏపీకి చెందినవారే ఎక్కువ..
ఈ వ్యవహారంలో అరెస్టయిన వారిలో 10 మంది తెలంగాణకు చెందినవారు. మిగిలిన వారు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారని తెలుస్తోంది. దీని వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులను గుర్తించడానికి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పోచంపల్లికి నోటీసులు ఇచ్చారు. ఈ వ్యవహారంపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో గేమింగ్ చట్టం, జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టం కింద కేసు నమోదు అయ్యాయి.
వారాంతాల్లో..
హైదరాబాద్ నగర శివార్లలో చాలామంది వీఐపీలకు ఫామ్ హౌస్‌లు ఉన్నాయి. వీటిల్లో వారాంతాల్లో పార్టీలు జరుగుతుంటాయి. కొందరు ఫ్యామిలీ పార్టీలు చేసుకుంటే.. మరికొందరు ఇలా జూదంతో రెచ్చిపోతున్నారు. తొందరగ డబ్బులు సంపాదించడానికి నిర్వాహకులు కోడి పందాలు, విదేశీ మద్యం, క్యాసినో, పేకాట ఆడిస్తున్నారు. గతంలో చాలాసార్లు పోలీసులు రెయిడ్ చేసి ఎంతో మందిని పట్టుకున్నారు.