Warangal : కొమ్మాల జాతరలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. ఇరువర్గాలపై పోలీసుల లాఠీ ఛార్జ్-police lathi charge on congress and brs cadres in girnibavi of warangal district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal : కొమ్మాల జాతరలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. ఇరువర్గాలపై పోలీసుల లాఠీ ఛార్జ్

Warangal : కొమ్మాల జాతరలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. ఇరువర్గాలపై పోలీసుల లాఠీ ఛార్జ్

HT Telugu Desk HT Telugu

Warangal : వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కొమ్మాల జాతరకు ప్రభ బండ్లు కట్టే విషయంలో గొడవలు జరిగాయి. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేసే వరకు వెళ్లింది. తమ కార్యకర్తలపై ఎందుకు లాఠీ ఛార్జ్ చేశారంటూ.. బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

గిర్నిబావి వద్ద ఉద్రిక్తత

కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి జాతర నేపథ్యంలో వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. లక్ష్మీ నరసింహస్వామి జాతర కోసం వెళ్తున్న క్రమంలో.. గిర్నిబావి వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ ప్రభ బండ్లు ఎదురుపడ్డాయి. తమ పార్టీకి చెందిన బండ్లను ఆపేసి, కాంగ్రెస్ ప్రభ బండ్లను పంపిస్తున్నారంటూ గులాబీ పార్టీకి చెందిన కొందరు ఆందోళనకు దిగారు.

ఇరు పార్టీల మధ్య వాగ్వాదం..

దీంతో ఇరుపార్టీల నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. రెండు పార్టీలకు చెందిన లీడర్లు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు నేతలు ఆందోళన చేపట్టి, అక్కడ పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లను ధ్వంసం చేసి, ముందుకు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. వారికి, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

లాఠీలకు పనిచెప్పిన పోలీసులు..

ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటం, తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉండటంతో ఏసీపీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు లాఠీలతో ఇరుపార్టీల నాయకులను చెదరగొట్టారు. అయినా కొంతమంది నాయకులు వినకుండా అలాగే నినాదాలు చేయడం, ఒక దశలో పరిస్థితి కంట్రోల్ తప్పే ప్రమాదం ఏర్పడింది. పలువురిపై పోలీసులు లాఠీ ఛార్జ్ కూడా చేశారు. అనంతరం రెండు పార్టీల నాయకులను వేర్వేరుగా చేసి, అక్కడి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

కాల్పులు జరిపారంటూ ప్రచారం..

కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల పోటాపోటీ నినాదాల నేపథ్యంలో గిర్నిబావి వద్ద తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలోనే అక్కడ కొంతమంది నాయకులు టపాసులు కూడా అంటించారు. అదే సమయంలో పోలీసులు లాఠీలు ఝుళిపించగా.. అప్పటికే నిప్పంటించిన టపాసులు పేలాయి. దీంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు కాల్పులు జరుపుతున్నారంటూ కొంతమంది పరుగులు తీశారు. ఈ ఘటననంతా ఓ వ్యక్తి వీడియో తీయగా.. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీఆర్ఎస్ నాయకులపై కాల్పులు జరిపారంటూ వార్త చక్కర్లు కొట్టింది.

క్లారిటీ ఇచ్చిన సీపీ..

కొమ్మాల జాతర సందర్బంగా గిర్నిబావి ప్రాంతంలో ప్రభ బండ్లతో వరుస క్రమంలో తరలి వెళ్లే సమయంలో.. కొంత మంది అత్యుత్సాహం ప్రదర్శించారని వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ వివరించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసుల ఆదేశాలను పాటించకుండా సదరు వ్యక్తులు ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారని.. ఈ క్రమంలో పోలీసులకు ప్రభ బండ్లను తరలించే వారి మధ్య తోపులాట మాత్రమే జరిగిందన్నారు.

చర్యలు తప్పవు..

ఈ ఘటనలో పోలీస్ కాల్పులు జరగలేదని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని సీపీ స్పష్టం చేశారు. కాల్పులు జరిగినట్లుగా ప్రజలను ఆందోళన కలిగించే రీతిలో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని, ఎవరైనా ప్రజలను ఆందోళన కలిగించే విధంగా అవాస్తవాలను సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తప్పుడు ప్రచారం చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

HT Telugu Desk