Hyderabad Double Murder : హైదరాబాద్ డబుల్ మర్డర్ కేసులో కీలక అప్‌డేట్.. వారిద్దరు అక్కడికి ఎందుకొచ్చారు?
Hyderabad Double Murder : హైదరాబాద్ శివార్లలోని నార్సింగిలో డబుల్ మర్డర్ బాధితులను పోలీసులు గుర్తించారు. ఈ హత్య ఘటనపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిని తెలిసినవారే హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అసలు వారిద్దరు అక్కడి ఎందుకొచ్చారనే కోణంలో విచారణ చేస్తున్నారు.
హైదరాబాద్ నార్సింగి పోలీసుస్టేషన్ పరిధిలో జంట హత్యలు కలకలం రేపాయి. మహిళ సహా మరో వ్యక్తిపై దారుణంగా కత్తితో దాడి చేసి, బండరాయితో మోది హత్య చేశారు. మహిళ వివస్త్రగా ఉండటం అనుమానాలకు తావిస్తోంది. మృతుడు మధ్యప్రదేశ్‌కి చెందిన అంకిత్ సాకేత్, మృతురాలు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బిందుగా పోలీసులు గుర్తించారు. క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

ఏం జరిగింది..
నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి పుప్పాలగూడలో అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది. దీనికి సమీపంలోని ఒక కొండ ఉంది. ఇది ఎత్తుగా ఉండటంటో.. చాలామంది ఉదయాన్నే సూర్యోదయాన్ని చూడటానికి ఇక్కడికి వస్తారు. అలా మంగళవారం ఉదయం కొందరు యువకులు కొండపైకి వచ్చారు. వారికి మొదట ఓ మృతదేహం కనిపించింది.
పోలీసులకు సమాచారం..
వెంటనే యువకులు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని (సాకేత్‌ది) పరిశీలించారు. అతనిది హత్యేనని పోలీసులు అనుమానించి.. ఆధారాలు సేకరించే పనిలోపడ్డారు. ఈ క్రమంలో సాకేత్ డెడ్ బాడీకి 60 మీటర్ల దూరంలో మరో మృతదేహం (బిందు డెడ్ బాడీ) కనిపించింది. వివస్త్రగా కనిపించడంతో.. పోలీసుల అనుమానం మరింత బలపడింది.
శరీరంపై కత్తి గాయాలు..
ఈ విషయాన్ని అక్కడికి వచ్చిన పోలీసులు ఉన్నతాధికారులకు చెప్పారు. వెంటనే డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించారు. ఎవరో హత్య చేశారని గుర్తించారు. యువకుడి శరీరంపై పలుచోట్ల కత్తితో చేసిన గాయాలున్నాయని డీసీపీ వెల్లడించారు. కత్తితో దాడి చేసి.. ఆ తర్వాత బండరాయితో మోది చంపారని వివరించారు.
ఎందుకు వచ్చారు..
25 ఏళ్ల సాకేత్ నానక్‌రామ్‌గూడలో ఉంటూ.. ఓ ఇంట్లో పని చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. మృతరాలు బిందు ఎల్బీ నగర్‌లో ఉండేదని గుర్తించారు. వీరు అక్కడికి టూవీలర్‌పై వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ఆ బండిని స్వాధీనం చేసుకున్నారు. అయితే.. ఈ ఇద్దరు అక్కడికి ఎందుకొచ్చారు.. ఎప్పుడొచ్చారు.. ఎవరైనా తీసుకొచ్చారా.. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ఈ ఇద్దరికి ఎలా పరిచయం ఏర్పడింది అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఘటనా స్థలంలో బీరు సీసాలు..
హత్యలు జరిగిన స్థలంలో దాదాపు 10 వరకు బీరు సీసాలు ఉన్నట్టు తెలుస్తోంది. మద్యం మత్తులో ఈ హత్యలు చేశారా.. లేక ఏదైనా వివాదం ఉందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే.. సాకేత్, బిందుకు గతంలోనే పరిచయం ఉందని, ఇటీవలే సాకేత్.. బిందును తాను ఉంటున్న ఇంటికి తీసుకెళ్లారని తెలుస్తోంది. విచారణ తర్వాతే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.