Suryapet Honour killing Case : ఫ్రెండ్ తో ఫోన్ చేయించి స్పాట్ కు రప్పించి..! పరువు హత్య కేసులో వెలుగులోకి అసలు విషయాలు-police identified the accused in the suryapet honor killing case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Suryapet Honour Killing Case : ఫ్రెండ్ తో ఫోన్ చేయించి స్పాట్ కు రప్పించి..! పరువు హత్య కేసులో వెలుగులోకి అసలు విషయాలు

Suryapet Honour killing Case : ఫ్రెండ్ తో ఫోన్ చేయించి స్పాట్ కు రప్పించి..! పరువు హత్య కేసులో వెలుగులోకి అసలు విషయాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 29, 2025 03:42 PM IST

సూర్యాపేట జిల్లాలో సంచలనం సృష్టించిన దళిత యువకుడి హత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఇష్టంలేని వివాహం చేసుకోవటంతో అమ్మాయి తరపు వాళ్లే ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు తేలింది. హత్య చేసింది అమ్మాయి సోదరుడే అని గుర్తించారు. ఈ కేసులో మొత్తం ఆరు మందిపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు తెలిసింది.

సూర్యాపేటలో పరువు హత్య - వెలుగులోకి అసలు విషయాలు (Representational image)
సూర్యాపేటలో పరువు హత్య - వెలుగులోకి అసలు విషయాలు (Representational image)

సూర్యాపేట జిల్లాలో దళిత యువకుడు హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన సంచలనంగా మారింది. అయితే ఈ కేసులోని అసలు విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారమే… యువకుడి హత్య జరిగినట్లు తేలింది. ఈ కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు.

ఏం జరిగిందంటే..?

సూర్యాపేట జిల్లాలో జనవరి 26వ తేదీన రాత్రి మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్ బంటి హత్యకు గురయ్యాడు. సోమవారం తెల్లవారుజామున పిల్లలమర్రి గ్రామం వద్ద ఉన్న కాలువలో కృష్ణ డెడ్ బాడీ లభ్యమైంది. అయితే ఈ హత్యకు ప్రధాన కారణం ప్రేమ వివాహమే అని తేలింది. హత్య చేసిన నిందితుల వివరాలు కూడా బయటికి వచ్చాయి.

సూర్యాపేటకు చెందిన కృష్ణ అలియాస్ బంటి(షెడ్యూల్ కులం).. పిల్లలమర్రికి చెందిన భార్గవి(బీసీ కులం)ని ప్రేమించాడు. ఈ క్రమంలోనే ఆర్నేళ్ల క్రితం వీరూ వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమను అమ్మాయి తరపు వాళ్ల తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే అమ్మాయి సోదరుడు నవీన్ తో కృష్ణకు ఎప్పట్నుంచే స్నేహం కూడా ఉంది.

కృష్ణ తరుచూ పిల్లలమర్రిలోని నవీన్ ఇంటికి వస్తూపోతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే నవీన్ సోదరి భార్గవితో కృష్ణ ప్రేమలో పడ్డారు. అయితే భార్గవి ఇంట్లోవాళ్లు మరో సంబంధం కూడా చేశారు. ఇష్టంలేని భార్గవి.. ఆర్నేళ్ల కిందట కృష్ణతో బయటికి వెళ్లి పెళ్లి కూడా చేసుకుంది. ప్రస్తుతం వాళ్లు సూర్యాపేటలోనే ఉంటున్నారు.

తమ అమ్మాయిని పెళ్లి చేసుకోవటంతో పాటు కళ్లముందే  ఉండటంతో భార్గవి కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోయారు. నాయనమ్మ బుచ్చమ్మ… కుమారుడితో పాటు మనుమళ్లను పదే పదే రెచ్చగొట్టినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే భార్గవి సోదరుడైన నవీన్… కృష్ణ హత్యకు ప్లాన్ వేశాడని సమాచారం.

ప్లాన్ ప్రకారమే మర్డర్…!

వడ్లకొండ కృష్ణను ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. తండ్రి జాన్ డేవిడ్ ఫిర్యాదు మేరకు విచారణ జరపగా… అసలు విషయాలు బయటికి వచ్చాయి. భార్గవి తండ్రి కోట్ల సైదులు, సోదరులు కోట్ల నవీన్, కోట్ల వంశీపై కేసు నమోదు చేశారు. అంతేకాదు నవీన్ స్నేహితుడైన బైరు మహేష్, సాయి చరణ్ పేరును కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చారు. అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సూర్యాపేట డీఎస్పీ జి. రవి వివరించారు.

కృష్ణ- బార్గవి పెళ్లి విషయంపై నవీన్ బాగా కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే అతని స్నేహితుడైన బైరు మహేశ్ తో ప్లాన్ వేశాడు. పథకం ప్రకారం.. మహేశ్ తో కృష్ణకు కాల్ చేసి ఓ ప్రదేశానికి రప్పించాడు. అక్కడికి అప్పటికే చేరుకున్న నవీన్… కృష్ణను గొంతు నులిమి హత్య చేసి ఉంటారని డీఎస్పీ చెప్పారు. తలతో పాటు మెడపై తీవ్ర గాయాలు ఉన్నాయని వివరించారు. మృతదేహంపై తల, మెడపై తీవ్ర గాయాలున్నాయని డీఎస్సీ రవి పేర్కొన్నారు.

పోలీసుల అదుపులో నిందితులు..!

నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అయితే ప్రధాన నిందితుడైన నవీన్.. పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.నవీమ్ మాత్రమే కాకుండా… భార్గవి నాయనమ్మ కోట్ల బుచ్చమ్మ, తండ్రి సైదులు, మరో సోదరుడు వంశీ తో పాటు నవీన్ స్నేహితులు భైరి మహేష్, సాయి చరణ్ అనే వ్యక్తిని కూడా పోలీసలు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు.. అధికారికంగా వివరాలను వెల్లడించాల్సి ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం